Operation Sindhu | ఇరాన్, ఇజ్రాయెల్ (Israel-Iran) మధ్య వార్ కారణంగా అక్కడ చిక్కుకున్న భారతీయుల్ని (Indians) రప్పించేందుకు కేంద్రం ‘ఆపరేషన్ సింధు’ (Operation Sindhu) చేపట్టిన విషయం తెలిసిందే. ఈ ఆపరేషన్ ద్వారా ఇజ్రాయెల్, ఇరాన్లో చిక్కుకుపోయిన భారతీయుల్ని స్వదేశానికి చేర్చింది. పొరుగు దేశాలకు చెందిన పౌరులకు కూడా ఆపరేషన్ సింధు ద్వారా సాయం అందించింది. జూన్ 18న ప్రారంభమైన ఈ ఆపరేషన్ ద్వారా ఇజ్రాయెల్, ఇరాన్ దేశాల నుంచి దాదాపు 4,415 మందికిపైగా భారతీయుల్ని స్వదేశానికి చేర్చినట్లు కేంద్ర ప్రభుత్వం తాజాగా వెల్లడించింది.
‘19 ప్రత్యేక విమానాల ద్వారా ఇప్పటి వరకూ మొత్తం 4,415 మంది భారతీయ పౌరులను తరలించాం. అందులో ఇరాన్ నుంచి 3,597 మంది, ఇజ్రాయెల్ నుంచి 818 మంది ఉన్నారు. 14 మంది ఓసీఐ కార్డుదారులు, తొమ్మిది మంది నేపాలీలు, నలుగురు శ్రీలంక జాతీయులు ఉన్నారు. తరలించిన పౌరుల్లో 1,500 మందికిపైగా మహిళలు, 500 మంది చిన్నారులు ఉన్నారు’ అని విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇరాన్‌లోని టెహ్రాన్, యెరెవాన్, అష్గాబాత్లో చిక్కుకుపోయిన వారిని ఆర్మేనియా, తుర్క్మెనిస్తాన్ సరిహద్దు క్రాసింగ్ ద్వారా తరలించినట్లు పేర్కొంది. భారతీయుల కోసం తన గగనతలాన్ని తెరిచిన ఇరాన్‌కు విదేశాంగ శాఖ ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపింది. జూన్ 18 నుంచి 26 వరకూ 15 ప్రత్యేక విమానాల ద్వారా యెరెవాన్, అష్గాబాత్, మష్హాద్ నుంచి 3,597 మంది భారత పౌరులను స్వదేశానికి తీసుకొచ్చినట్లు విదేశాంగ శాఖ ఓ ప్రకటనలో తెలిపింది.
ఇక ఆపరేషన్ సింధులో భాగంగా ఇజ్రాయెల్‌లోని భారతీయుల తరలింపు జూన్ 23న నుంచి ప్రారంభమైనట్లు వెల్లడించింది. టెల్ అవీవ్, రామల్లా, అమ్మన్, కైరో నుంచి జోర్డాన్, ఈజిప్ట్ సరిహద్దుల మీదుగా భారత పౌరులను తరలించినట్లు తెలిపింది. విద్యార్థులు, కార్మికులు, నిపుణులు మొత్తం 818 మంది భారతీయులను ఇజ్రాయెల్ నుంచి తరలించినట్లు పేర్కొంది. జూన్ 22 నుంచి 25 వరకూ మూడు ఐఏఎఫ్ సీ-17 విమానాలు సహా నాలుగు ప్రత్యేక విమానాల ద్వారా తరలించినట్లు వివరించింది. మరోవైపు రెండు దేశాల మధ్య కాల్పుల విరమణతో పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు చల్లారాయి. దీంతో ప్రస్తుతం ఈ ఆపరేషన్‌కు బ్రేక్ పడింది.
Also Read..
Ayodhya Ram Temple: రామ్‌లల్లాను దర్శించుకున్న 5.5 కోట్ల మంది భక్తులు
Tamil Nadu | పట్టాలు తప్పిన ప్యాసింజర్ రైలు..
Taj Mahal | తాజ్ మహల్లో లీకేజీ.. ప్రధాన గుమ్మటానికి బీటలు?