Taj Mahal | ఆగ్రా(యూపీ), జూన్ 27 : యునెస్కో ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తింపు పొంది, అంతర్జాతీయ పర్యాటకులను సైతం విశేషంగా ఆకట్టుకునే ఆగ్రాలోని తాజ్మహల్లో వర్షపు నీరు లీకవుతోంది. తాజ్మహల్ ప్రధాన గుమ్మటంలో 73 మీటర్ల ఎత్తున ఒక చోట నీటి లీకేజీని ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా(ఏఎస్ఐ) థర్మల్ స్కానింగ్ గుర్తించింది. ఏఎస్ఐ నిర్వహిస్తున్న తనిఖీలు మరో 15 రోజులు జరుగుతాయి. ఆ తర్వాత గుమ్మటంపై మరమ్మతు పనులను నిపుణులు చేపడతారు. పాలరాతి కట్టడంలో మూడు ప్రధాన సమస్యలను ఏఎస్ఐకి చెందిన లైట్ డిటెక్షన్, రేంజింగ్ ఇన్వెస్టిగేషన్లో బయటపడినట్లు వర్గాలు తెలిపాయి.
ప్రధాన గుమ్మటంపైన రాళ్ల మధ్యలో ఉండే మిశ్రమం (సున్నం, ఇసుకల మిశ్రమం) క్షీణించింది. గుమ్మటం పైకప్పు తలుపు, గచ్చు బలహీనపడ్డాయి. శిఖర భాగాన్ని నిలబెట్టే ఇనుప చువ్వ తుప్పు పట్టిన కారణంగా బలహీనపడింది. దీంతో మిశ్రమానికి, రాళ్లకు మధ్య ఎడం పెరిగి నీరు లీకేజీ అవుతోంది. తాజ్ మహల్ ప్రధాన గుమ్మటంపైన పరంజాను(కర్రలతో తాత్కాలిక నిర్మాణం) ఏర్పాటు చేసిన ఏఎస్ఐ బృందం ప్రత్యక్ష తనిఖీ నిర్వహించనున్నది. 15 రోజుల తర్వాత సాంకేతిక నిపుణులు పరంజాలో పగుళ్లు ఏమైనా ఉన్నాయా వంటి అంశాలను తనిఖీ చేస్తారు.