గజ్వేల్, మార్చి 6: కేసీఆర్ పుణ్యమాని మండుటెండల్లో కాళేశ్వర జలాలు వాగులు, వంకల్లో పరవళ్లు తొక్కుతున్నాయి. చెక్‌డ్యామ్‌లను నింపుతూ పరవళ్లు తొక్కుతూ రైతుల పంట చేలకు తరలుతున్నాయి.ఇటీవల రైతుల ఆందోళనలు, బీఆర్ఎస్ నేతల హెచ్చరికలతో ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టు రిజర్వాయర్ల ద్వారా సాగునీటిని విడుదల చేయడంతో నీటి వనరులు జలకళ సంతరించుకుంటున్నాయి. కేసీఆర్ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా సిద్దిపేట జిల్లాలో 50టీఎంసీల సామర్థ్యంతో మల్లన్నసాగర్, 15టీఎంసీల సామర్థ్యంతో కొండపోచమ్మ సాగర్ ప్రాజెక్టులు నిర్మించింది.
కాళేశ్వరంపై ఎన్నో అపోహలు సృష్టించిన కాంగ్రెస్ ప్రభుత్వం నేడు అవే గోదావరి జలాలను వాగుల్లోకి వదిలింది. ఎర్రటి ఎండల్లో కూడవెళ్లి, హల్దీ వాగులపై చెక్‌డ్యామ్‌లు పరవళ్లు తొక్కుతుండడంతో రైతుల కళ్లలో ఆనందానికి అవధులు లేవు. పొంగిపొర్లుతున్న చెక్‌డ్యామ్‌ల వద్ద నిలబడి రైతులు సగర్వంగా కేసీఆర్ చేసిన పుణ్యమే అంటూ గొప్పగా చెప్పుకొంటున్నారు. ఎర్రటి ఎండల్లో పారుతున్న వాగుల ద్వారా చెరువులు, చెక్‌డ్యామ్‌లోకి పుష్కలంగా గోదావరి జలాలు చేరుతుండడంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం కొడకండ్ల వద్ద కొండపోచమ్మ సాగర్‌లోకి వెళ్లే కాలువ ద్వారా నీటిని కూడవెల్లి వాగులోకి కొద్ది రోజుల క్రితం వదలడంతో చెక్‌డ్యామ్‌లు నిండి పొంగిపొర్లుతున్నాయి. కూడవెల్లి ్ల వాగులో గోదారమ్మ ప్రవాహంతో 38 చెక్‌డ్యామ్‌లు నిండాయి. 60కిలోమీటర్ల దూరం పరవళ్లు తొక్కుతూ గోదావరి జలాలు సిద్దిపేట జిల్లాను వీడి కరీంనగర్ జిల్లాలోని అప్పర్‌మానేరు డ్యామ్‌లో కలుస్తాయి. కూడవెల్ల్లి వాగుపై నిర్మించిన చెక్‌డ్యామ్‌లు గోదావరి జలకళను సంతరించుకున్నాయి.
గజ్వేల్, తొగుట, మిరుదొడ్డి, దుబ్బాక మండలాల్లోని చెక్‌డ్యామ్‌ల్లో గోదావరి జలాలు చేరాయి. దీంతో రైతులు సాగు చేసిన 40వేల ఎకరాల వరికి గోదావరి జలాలు జీవం పోసినట్లయ్యింది. కూడవెల్లి వాగు పరిసర ప్రాంత రైతులు ఎక్కువగా నీటి ఆధారిత పంటలనే సాగుచేస్తారు. కొండపోచమ్మ సాగర్‌లో 12.11టీఎంసీల నీటిని వర్షాకాలంలో నింపారు. కొద్ది రోజులుగా రామాయంపేట, ఆలేరు, గజ్వేల్ కాలువల ద్వారా నీటిని అధికారులు విడుదల చేశారు. దీని ద్వారా ఆయా ప్రాంతాల్లోని 34 చెరువులు, కుంటలను అధికారులు నింపుతున్నారు. సంగారెడ్డి కాలువ ద్వారా వర్గల్‌లోని బందం చెరువు, పెద్దచెరువు నుంచి శాకారంలోని ధర్మాయ చెరువులోకి నీళ్లు వెళ్లాయి. అక్కడి నుంచి అంబర్‌పేటలోని ఖాన్ చెరువులోకి నీళ్లు చేరి అలుగు పారాయి.
అంబర్‌పేట-మాదారం మధ్య ఉన్న చెక్‌డ్యామ్ ద్వారా నాచారం ఆలయం సమీపంలో హల్దీ వాగుపై చెక్‌డ్యామ్‌పై నుంచి గోదావరి జలాలు పరవళ్లు తోక్కుతూ మెదక్ జిల్లాలోని వెల్దుర్తి మండలం మీదుగా మంజీరా నదిలోకి గోదావరి జలాలు ప్రవేశించాయి. వీటి ద్వారా వాగు పక్కన సాగు చేసుకున్న పంటలు జీవం పోసుకుంటాయి. కేసీఆర్ హయాంలో నిర్మించిన ప్రాజెక్టుల ద్వారా బీఆర్ఎస్ ప్రభుత్వంలోనే వాగుల ద్వారా నీటి విడుదల చేయడంతో రైతులు అధిక విస్తీర్ణంలో వరి, కూరగాయల పంటలు సాగు చేశారు.