హైదరాబాద్, మార్చి 6(నమస్తే తెలంగాణ) : తెలంగాణ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ(ఎఫ్ఎస్ఎల్)లో అగ్ని ప్రమాదం జరిగి నేటి నెల రోజులవుతున్నా.. ఘటనకు కారణాలేమిటో మాత్రం పోలీసు శాఖ తేల్చలేకపోతున్నది. తెలంగాణ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ(ఎఫ్ఎస్ఎల్)లో అగ్ని ప్రమాదం జరిగి నేటి నెల రోజులవుతున్నా.. ఘటనకు కారణాలేమిటో మాత్రం పోలీసు శాఖ తేల్చలేకపోతున్నది. నేర నిరూపణలో ఆయువుపట్టుగా ఈ కార్యాలయంలోని పలు కీలక ఫైళ్లు, సంచలన కేసుల ఆధారాలు, సామగ్రి అగ్ని ఆహుతైనప్పటికీ నామమాత్రంగా దర్యాప్తు జరిపి, చేతులు దులుపుకొన్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఎఫ్ఎస్ఎల్లో 40-50 కంప్యూటర్లు, హార్డ్‌డిస్క్‌లు, పెన్‌డ్రైవ్‌లు, కేసుల విచారణ కోసం తీసుకొచ్చిన ఇతర హార్డ్ డిస్క్‌లు, సెల్ఫోన్లు వంటి ఎన్నో కీలక ఆధారాలు కాలిపోయినట్టు పోలీసు అధికారులే చెప్పారు.
చాలా కేసుల ఆధారాలను రిట్రైవ్ చేస్తున్నామని, ఏ కేసుల్లో ఆధారాలు దొరకలేదో.. ఏ కేసుల ఆధారాలు కాలిపోయాయో వాటి వివరాలను పబ్లిక్ డొమైన్లో పెడుతామని ఎఫ్ఎస్ఎల్ డీజీ శిఖాగోయెల్ మీడియాముఖంగా ప్రకటించారు. ఇప్పటివరకు ఎలాంటి వివరా లు వెల్లడించలేదు. మరుసటి రోజే రామంతాపూర్‌లోని సెంట్రల్ ఫోరెన్సిక్ నిపుణులు, నాగ్‌పూర్‌కు చెందిన ఫైర్ ఫోరెన్సిక్ నిపుణుడు నీలేశ్ ఉకుందే కలిసి ప్రమాదంపై విచారణ జరిపారు. కాలిపోయిన సర్వర్లను సెంట్రల్ ఫోరెన్సిక్ నిపుణులు రిట్రైవ్ చేసే ప్రయత్నం చేయగా.. అగ్నిప్రమాదంపై నాగ్‌పూర్ నిపుణులు దర్యాప్తు చేశారు. వీళ్లు వారం, పది రోజుల్లోనే విశ్లేషించి చెప్పగలిగే నిపుణులే. కానీ ప్రమాదంపై పోలీసు శాఖకు నివేదిక ఇచ్చారా? లేదా? అనేది తెలియాల్సి ఉన్నది.
కుట్ర కోణంపైనే అనుమానాలు
ఫోరెన్సిక్ ల్యాబొరేటరీ ప్రమాదంలో కచ్చితంగా కుట్ర కోణం ఉందని ప్రతిపక్షాలు చెబుతూనే ఉన్నాయి. మొదట ఈ ప్రమాదంలో ఎలాంటి కుట్ర కోణం లేదని చెప్పిన పోలీసులు.. తమ దర్యాప్తు ఆంశాలను మీడియా ముందు బహిర్గతం చేయకపోవడం అనుమానాలు తావిస్తున్నది. అందుకే నెల రోజులైనా కూడా ఎలాంటి ఆధారాలు లభించలేదా? కుట్ర కోణం కాకపోతే ఆధారాలను బయటపెట్టకపోవడానికి గల కారణాలేంటో చెప్పాలని? అని రాజకీయ విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు.