ధర్మపురి, మార్చి 6 : కారుకు దారి ఇవ్వలేదనే కారణంతో దళిత యువకుడిపై కాంగ్రెస్ నాయకుడు, సర్పంచ్ భర్త, అత ని బంధువులు ఓ దళిత యువకుడిపై దాడికి దిగారు. పోలీసులు, బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. జగిత్యాల జిల్లా బుగ్గారం మండలం చిన్నాపూర్ సర్పంచ్ గట్టు శారద గ్రామంలో కోతుల బెడదను నివారించడానికి దళిత యువకుడు దమ్మ తిరుపతితో చింపాంజీ వేషం వేయించారు. చింపాంజీ వేషధారణకు సంబంధించిన కూలి డబ్బులు తిరుపతికి ఇవ్వకుండా సర్పంచ్ భర్త గంగారాం రెండు నెలల పాటు తిప్పుకున్నాడు. తిరుపతికి డబ్బులు అత్యవసరం ఉండి గురువారం మధ్యాహ్నం కారులో వెళ్తున్న గంగారాంను డబ్బులు అడిగే ప్రయత్నంచేశాడు. దీంతో గంగారాం కారులోంచి దిగి ‘కారుకు అడ్డుగా వస్తావా? నేను ఎవరనుకున్నావురా?’ అంటూ ఆగ్రహంతో ఊగిపోతూ తిరుపతిని కులంపేరుతో దూ షిస్తూ.. చితకబాది పక్కనే ఉన్న డ్రైనేజీలో పడేసి వెళ్లిపోయాడు. అక్కడితో ఆగకుం డా గురువారం సాయంత్రం తిరుపతిపై మరోసారి దాడి చేశారు. ఇదంతా అక్కడే ఉన్న సీసీ కెమెరాలో రికార్డు అయింది. రెండుసార్లు చితకబాదడంతో అపస్మారక స్థితికి చేరిన తిరుపతిని బంధువులు జగిత్యాల దవాఖానలో చేర్పించారు. తిరుపతి తల్లి లక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్టు ఎస్సై సతీశ్ తెలిపారు.