చేర్యాల, ఫిబ్రవరి 21: సిద్దిపేట జిల్లా చేర్యాల పట్టణ ప్రజల చిరకాల కోరిక ఆదిలోనే అడ్డుపుల్ల పడింది.పట్టణంలోని పెద్ద చెరువు సుందరీకరణ పనులు చేపట్టాలని జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి రాష్ట్ర స్థ్ధాయిలో సంబంధిత ఉన్నతాధికారులు, మంత్రులతో పలుమార్లు మాట్లాడడంతో పాటు కట్ట పరిస్థితుల పై నివేదికలు అందజేశారు. దీంతో కేంద్రం అమృత్ పథకం ద్వారా రూ.3.16 కోట్లు మంజూరు చేసింది. అధికారులు వెంటనే టెండర్లు పిలిచి పనులు సైతం కాంట్రాక్టర్కు అప్పగించారు.
కాంట్రాక్టర్ ఇటీవల చెరువు కట్టపై పనులు ప్రారంభించారు. చేర్యాల పెద్ద చెరువు కట్టకు నిధులు మంజూరు కావడంతో పనులు పూర్తి కాగానే, పట్టణ ప్రజలకు సుందరీకరించబడిన చెరువు కట్ట అందుబాటులోకి వస్తుందని భావించిన ప్రజలకు ఆదిలోనే నిరాశ ఎదురైంది. అధికార పార్టీకి చెందిన పెద్ద నేతల చర్యలతో పనులు నిలిచిపోయాయని పట్టణ ప్రజలు చర్చించుకుంటున్నారు. తమకు తెలియకుండా పనులు ఎలా ప్రారంభిస్తారు, అసలు శిలాఫలకం ఎందుకు వేయలేదు అంటూ పలువురు అధికార పార్టీ నేతలు అధికారులపై ప్రశ్నల వర్షం కురిపించినట్లు సమాచారం.దీంతో అధికారులు చేసేది లేక శిలాఫలకం వేసిన తర్వాతే పనులు చేయాలని అధికారులు ఆర్డర్ వేయడంతో ఎక్కడి పనులు అక్కడే నిలిచిపోయాయి.
సుందరీకరణకు రూ.3.14 కోట్లు
పెద్ద చెరువు కట్ట సుందరీకరణ కోసం అమృత్ పథకంలో రూ.3కోట్ల,14లక్షల,60వేలు మంజూరు చేశారు.పెద్ద చెరువు పునర్జీవనం కోసం మంజూరు చేసిన నిధులతో చెరువు కట్టను బలోపేతం చేయడంతో పాటు చుట్టూ ఇనుప రేలింగ్, చైన్ మేష్ ఫెన్సింగ్, వాకింగ్ ట్రాక్ పాత్ వే, లైటింగ్ తదితర పనులు చేయనున్నారు.పనులు చేపట్టిన కాంట్రాక్టర్ చెరువుకు ఒక వైపున పెరిగిన సర్కారు తుమ్మ చెట్లు, పిచ్చి మొక్కలు తొలిగించడంతో పాటు సీసీ వాల్ కోసం కందకం తీసి అందులో పైపులు ఏర్పాటు చేశాడు.పనులు కొనసాగుతున్న సమయంలో అధికార పార్టీ నేతలు చెరువు కట్టను సందర్శించిన అనంతరం పనులు నిలిచిపోవడంతో పలువురు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.అభివృద్ధి చేసేందుకు నిధులు మంజూరైతే వాటితో పనులు చకచకా చేయించాల్సిన వారే తమకు తెలియకుండా ఎలా పనులు ప్రారంభించారని ప్రశ్నిస్తే పనులు చేసే వారు కాస్తా వెనక్కి తగ్గిపోయారు.
పనులు వెంటనే ప్రారంభించాలి
పెద్ద చెరువు కట్టను సుందరీకంచేందుకు నిధులు మంజూరయ్యాయి. కట్టను బలోపేతం చేయడం,లైటింగ్, వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేస్తే పట్టణంలోని అన్ని వర్గాలకు ఉపయోగంగా ఉంటుంది. సెలవు రోజులు, పండుగలు, ప్రత్యేక రోజుల్లో చెరు వు కట్ట పర్యాటక కేంద్రంగా మారుతుంది. ప్రజలకు ఉపయోగపడే చెరువు కట్ట సుందరీకరణ పనులు వెంటనే ప్రారంభించకపోతే చెరువు కట్ట వాకర్స్ అసోసియేసన్ ఆధ్వర్యంలో ఆందోళనలు ఉధృతం చేస్తాం.
– తిరుపతిరెడ్డి, పెద్దచెరువు కట్టవాకర్స్ అసోసియేషన్ ప్రతినిధి, చేర్యాల, సిద్దిపేట జిల్లా
ఉద్యమాలకు సిద్ధం
పెద్ద చెరువు కట్ట పనులు ప్రారంభించకపోతే ఉద్యమాలకు సిద్ధమవుతాం.చెరువు కట్టపై గుంతలు ఏర్పడి వాకర్స్,రైతులు నడిచే పరిస్థితి లేదు.కట్టకు ఇరువైపులా సర్కారు తుమ్మ చెట్లు, పిచ్చి చెట్లు పెరిగిపోయాయి.కట్ట పై భాగంతో పా టు చెరువు లోపల వ్యర్థాలు పడేస్తుండటంతో కలుషితమవుతున్నది. రాజకీయాలకతీతంగా పనులు ప్రారంభించారు.
– కొంగరి శ్రీధర్, పెద్ద చెరువు కట్ట వాకర్స్ అసోసియేషన్ ప్రతినిధి, చేర్యాల, సిద్దిపేట జిల్లా