Nara Lokesh | రాజకీయ వేదికలపై సాధారణంగా అధికారిక ప్రసంగాలు, ప్రోటోకాల్ కార్యక్రమాలే ఎక్కువగా కనిపిస్తాయి. కానీ అప్పుడప్పుడూ జరిగే సరదా సంఘటనలు అందరి దృష్టిని ఆకర్షిస్తుంటాయి. తాజాగా ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్, దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి కుమారుడు ఎస్.ఎస్. కార్తికేయ, ఆయన భార్య పూజా ప్రసాద్ మధ్య జరిగిన ఆసక్తికర సంభాషణ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గంలోని పునాదిపాడులో నూతనంగా నిర్మించిన మహిళా జూనియర్ కళాశాల ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఈ సరదా ఘటన చోటుచేసుకుంది. ఈ విద్యాసంస్థ నిర్మాణానికి కార్తికేయ అత్తగారు, పూజా ప్రసాద్ తల్లి విరాళం అందించడంతో, కార్యక్రమానికి నారా లోకేష్‌తో పాటు కార్తికేయ, పూజా ప్రసాద్ ప్రత్యేక అతిథులుగా హాజరయ్యారు.
అధికారిక కార్యక్రమం సమయంలో నారా లోకేష్ తన హాస్య చతురతతో ఆ వాతావరణాన్ని ఒక్కసారిగా సందడిగా మార్చేశారు. మంత్రి లోకేష్ చిరునవ్వుతో పూజా ప్రసాద్‌ను ఉద్దేశిస్తూ.. కార్తికేయ నిన్ను బాగా చూసుకుంటున్నాడా? ఏమైనా కంప్లైంట్స్ ఉన్నాయా? ఉంటే చెప్పండి… నేను ఉన్నాను కదా!” అంటూ సరదాగా ప్రశ్నించారు. దానికి పూజా ప్రసాద్ నవ్వుతూ..లేదండీ… ఎలాంటి కంప్లైంట్స్ లేవు అని సమాధానమిచ్చారు. పూజా సమాధానం విన్న వెంటనే పక్కనే ఉన్న కార్తికేయ వైపు తిరిగి మంత్రి లోకేష్..”బచ్ గయా!” (హమ్మయ్య… తప్పించుకున్నావ్!) అంటూ చమత్కరించారు. లోకేష్ చేసిన ఈ వ్యాఖ్యతో అక్కడే ఉన్న అతిథులు, ప్రేక్షకులు ఒక్కసారిగా నవ్వుల్లో మునిగిపోయారు. అధికారిక కార్యక్రమంలో చోటుచేసుకున్న ఈ అన్‌స్క్రిప్టెడ్ మూమెంట్ అందరినీ ఆకట్టుకుంది.
ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అవుతోంది. రాజకీయ సమావేశాల్లో ఎక్కువగా సీరియస్‌గా కనిపించే నారా లోకేష్‌లోని ఈ సరదా కోణాన్ని చూసి నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. కుటుంబ సభ్యుల మధ్య ఉండే ఆప్యాయతతో మాట్లాడిన ఆయన తీరు సహజంగా అనిపించిందని పలువురు కామెంట్లు చేస్తున్నారు.ఎస్.ఎస్. కార్తికేయ ప్రస్తుతం రాజమౌళి తెరకెక్కిస్తున్న భారీ చిత్రాల నిర్మాణ వ్యవహారాల్లో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మరోవైపు ఆయన భార్య పూజా ప్రసాద్ ప్రముఖ గాయనిగా గుర్తింపు పొందారు. ఆమె ప్రముఖ నటుడు జగపతిబాబు కుటుంబానికి చెందిన వ్యక్తి అనే విషయం మనందరికి తెలిసిందే.