మహబూబ్‌నగర్, సెప్టెంబర్ 29 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): బాధితులకు పునరావాసం కల్పించకపోతే సీఎం రేవంత్‌రెడ్డి ప్యాలెస్‌ను ముట్టడిస్తామని మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి హెచ్చరించారు. ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గంలో ప్రజలకు ఏమాత్రం అవసరంలేని రహదారి విస్తరణపేరుతో పేదల ఇండ్లు, దుకాణాలు కూల్చివేయడంతో మంగళవారం మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి ఆధ్వర్యంలో పార్టీ నేతలు, కార్యకర్తలు ఆందోళనలకు దిగారు. బాధితుల ఇండ్లను పరిశీలించి వారితో మాట్లాడారు.
అధికారులు నోటీసులు ఇవ్వకుండా.. పోలీసు బందోబస్తుతో అర్ధరాత్రి వచ్చి తమ ఇండ్లను కూల్చేశారని బాధితులు కన్నీరు మున్నీరయ్యారు. ఇండ్లు కూలుస్తుంటే అడ్డుపడిన తమవారిని పోలీసులు తీసుకెళ్లి ఇప్పటివరకు విడిచిపెట్టలేదని ఆవేదన వ్యక్తంచేశారు. స్పందించిన పట్నం నారాయణపేట కలెక్టర్‌కు ఫోన్ చేసి, బాధితులకు నోటీసులు ఇవ్వకుండా కూల్చివేయడం ఏమిటని ప్రశ్నించారు. చాలామంది నిరాశ్రయులయ్యారని, వాళ్లంతా ఎక్కడ ఉండాలని నిలదీశారు. దీంతో కలెక్టర్ బాధితుల వద్దకు ఆర్డీవో, మున్సిపల్ కమిషనర్‌ను పంపించి, వారికి ఆశ్రయం కల్పించేందుకు తగిన చర్యలు తీసుకుంటామని హామీఇచ్చారు.
బాధితులతో పట్నం మాట్లాడుతుండగా పోలీసులు వీడియో రికార్డింగ్ చేస్తుండటంతో బీఆర్ఎస్ నేతలు వారితో వాగ్వాదానికి దిగారు. పేదలకు న్యాయం చేయకపోతే జూబ్లీహిల్స్‌లోని ముఖ్యమంత్రి ప్యాలెస్ ముట్టడిస్తామని పట్నం హెచ్చరించారు. మద్దూర్ చౌరస్తాలో పార్టీ శ్రేణులు, బాధితులతో కలిసి భారీ ఎత్తున ధర్నాకు దిగా రు. ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా నినాదా లు చేశారు. పోలీసులు మాజీ ఎమ్మెల్యేను అరెస్ట్ చేసేందుకు యత్నించగా పార్టీ నాయకులు, కార్యకర్తలు అడ్డుకున్నారు.