హైదరాబాద్, సెప్టెంబర్ 29 (నమస్తే తెలంగాణ): అక్టోబర్ 9న జరుగనున్న టీజీఎస్ ఆర్టీసీ గుర్తింపు సంఘం ఎన్నికలకు సంబంధించి తెలంగాణ మజ్దూర్ యూనియన్ (టీఎంయూ)కి కేటాయించిన గుర్తు విషయంలో జోక్యం చేసుకునేందుకు హైకోర్టు నిరాకరించింది. టీఎంయూకి గతంలో ఉన్న ‘విల్లు-బాణం’ గుర్తుకు బదులుగా ‘నిచ్చెన’ గుర్తును కేటాయించడాన్ని సవాలు చేస్తూ ఆ యూనియన్ ప్రధాన కార్యదర్శి థామస్‌రెడ్డి దాఖలు చేసిన పిటిషపై జస్టిస్ జువ్వాడి శ్రీదేవి మంగళవారం విచారణ చేపట్టారు. చాలా ఏండ్ల క్రితమే తమకు విల్లు-బాణం’ గుర్తును కేటాయించారని, ఆ గుర్తుతో తాము ఇప్పటికే రెండుసార్లు ఎన్నికల్లో పోటీ చేశామని పిటిషనర్ తరఫు న్యాయవాది తెలిపారు.
ప్రస్తుతం ‘విల్లు-బాణం’ గుర్తును అశ్వత్థామరెడ్డి నాయకత్వలోని తెలంగాణ ఆర్టీసీ వరర్స్ యూనియన్‌కు కేటాయించడం అన్యాయమని, ఈ విషయంలో కార్మికశాఖ కమిషనర్, ఇతర అధికారులు ఏకపక్షంగా వ్యవహరించారని వాదించారు. టీఎంయూకి తిరిగి ‘విల్లు-బాణం’ గుర్తును కేటాయించేలా కార్మికశాఖ కమిషనర్, జాయింట్ కమిషనర్, రిటర్నింగ్ అధికారిని ఆదేశిస్తూ ఉత్తర్వులు జారీచేయాలని కోరారు. దీంతో ఆర్టీసీ యూనియన్ ఎన్నికల ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైనందున ఈ వ్యవహారంలో జోక్యం చేసుకోబోమని న్యాయమూర్తి స్పష్టం చేస్తూ.. థామస్‌రెడ్డి పిటిషన్‌ను కొట్టివేశారు.