హైదరాబాద్/నాంపల్లి క్రిమినల్ కోర్టులు, సెప్టెంబర్ 29 (నమస్తే తెలంగాణ): ఫార్ములా ఈ-కార్ రేస్ కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాస్‌పోర్టును సీజ్ చేయాలంటూ ఏసీబీ కోర్టు ప్రాంతీయ పాస్‌పోర్టు కార్యాలయానికి ఉత్తర్వులు జారీచేసినట్టు ప్రచార మాధ్యమాల్లో వార్తలను ఆయన తరఫు న్యాయవాది జక్కుల లక్ష్మణ్ ఖండించారు. ఆ వార్తల్లో ఏలాంటి నిజంలేదని మంగళవారం మీడియా సమావేశంలో వెల్లడించారు. ఈ కేసు విచారణ నిమిత్తం కేటీఆర్ క్రమం తప్పకుండాకోర్టుకు హాజరవుతున్నారని, ఆయన పాస్‌పోర్టును ప్రొటెక్ట్ చేయాలని మాత్రమే ఏసీబీ అధికారులు కోరారని, దీనిపై కోర్టు ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని వివరించారు.
ఈ వాస్తవాన్ని తెలుసుకోకుండా తప్పుడు వార్తలు ప్రసారం చేయడం కోర్టు ధిక్కరణ కిందికి వస్తుందని హెచ్చరించారు. ఇప్పటికే బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలను తప్పుదోవ పట్టించేలా ప్రచురించిన తప్పుడు వార్తలను వెంటనే తొలగించాలని మీడియా సంస్థలను డిమాండ్ చేశారు. కేటీఆర్ పాస్‌పోర్టు ప్రొటెక్షన్ కోసం ఏసీబీ అధికారులు ఎందుకు కోరుతున్నారో పరిశీలించాక ఆ అంశా న్ని కోర్టులో సవాలు చేస్తామని తెలిపారు. ఒకవేళ పాస్‌పోర్టు సీజ్ చేయాలని అధికారులు కోర్టులో పిటిషన్ దాఖలు చేసినట్టయితే తమకు నోటీసులు జారీచేయాల్సి ఉం టుందని లక్ష్మణ్ పేర్కొంటూ.. ఏసీబీ అధికారులు ఇప్పటివరకు తమకు ఎలాంటి నోటీసులు అందజేయలేదని స్పష్టం చేశారు.