Low Blood Pressure | బీపీ 120/80 కన్నా అధికంగా ఉంటే దాన్ని హైబీపీ అంటారన్న విషయం అందరికీ తెలిసిందే. హైబీపీ ఉన్నవారు ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. గుండె పోటు వచ్చే ప్రమాదం ఉంటుంది కనుక బీపీని తరచూ చెక్ చేయించుకోవాలి. బీపీని అదుపులో ఉంచుకోవాలి. ప్రస్తుతం చాలా మంది హైబీపీ బారిన పడుతున్నారు. అయితే బీపీ ఉండాల్సిన దాని కన్నా మరీ తక్కువగా ఉంటే దాన్ని లో బీపీ అని అంటారు. 90/60 కన్నా తక్కువగా బీపీ ఉంటే దాన్ని లోబీపీ అంటారు. లోబీపీ వచ్చేందుకు కూడా అనేక కారణాలు ఉంటాయి. హైబీపీ మాదిరిగానే లోబీపీని కూడా ఒక వ్యాధిగానే చూడాలి. లోబీపీ వచ్చిన వారిలో తరచూ పలు లక్షణాలు కనిపిస్తుంటాయి. తల తిరగడం, వికారంగా ఉండడం, వాంతికి వచ్చినట్లు అనిపించడం, తూలి పడిపోవడం, కంటి చూపు మసకగా ఉండడం, తీవ్రమైన అలసట, నీరసం ఉంటాయి.
లోబీపీ ఉంటే కొందరికి ఆందోళన, కంగారు, ఏకాగ్రత నశించడం, ఎల్లప్పుడూ నిద్ర మత్తులో ఉండడం వంటి లక్షణాలు కూడా కనిపిస్తాయి. కొందరికి గుండె మరీ అధికంగా లేదా మరీ తక్కువగా కొట్టుకున్నట్లు అనిపిస్తుంది. చర్మం చల్లగా ఉంటుంది. పాలిపోయి కనిపిస్తుంది. పల్స్ అసలు లభించదు లేదా తక్కువగా ఉంటుంది. కొందరికి చర్మం నీలి రంగులోకి మారుతుంది. పెదవులు కూడా అదే రంగులో కనిపిస్తాయి. లోబీపీ వచ్చేందుకు పలు కారణాలు ఉంటాయి. డీహైడ్రేషన్ బారిన పడడం, తీవ్రంగా రక్త స్రావం జరగడం, గుండె సమస్యలు ఉండడం, థైరాయిడ్ సమస్యల బారిన పడడం, తీవ్రమైన ఇన్ఫెక్షన్లు ఉండడం, అలర్జీలు, పోషకాహార లోపం ఏర్పడడం, మందులను వాడడం, మహిళలు గర్భంతో ఉన్న సమయంలో.. ఇలా పలు కారణాల వల్ల లోబీపీ వస్తుంది.
లోబీపీ వచ్చిన వారు డాక్టర్ సూచన మేరకు మందులను కచ్చితంగా వాడాలి. అలాగే ఆహారంలోనూ పలు మార్పులు చేసుకోవాలి. దీంతో బీపీ నియంత్రణలో ఉంటుంది. లోబీపీ వచ్చేందుకు ప్రధాన కారణాల్లో ఒకటి నీళ్లను సరిగ్గా తాగకపోవడం. దీని వల్ల డీహైడ్రేషన్ ఏర్పడి లోబీపీ వస్తుంది. కనుక నీళ్లను కచ్చితంగా మోతాదులో తాగాలి. రోజుకు కనీసం 10 నుంచి 12 గ్లాసుల నీళ్లను లేదా 3 లీటర్ల వరకు నీళ్లను తాగితే లోబీపీ రాకుండా చూసుకోవచ్చు. కొబ్బరినీళ్లు కూడా బాగానే పనిచేస్తాయి. ఇవి శరీరం కోల్పోయిన ఎలక్ట్రోలైట్స్‌ను తిరిగి పొందేలా చేస్తాయి. దీంతో లోబీపీ తగ్గిపోతుంది. నారింజ, దానిమ్మ పండ్ల రసం తాగడం వల్ల కూడా లోబీపీ నుంచి బయట పడవచ్చు. వీటిల్లో ఉండే సహజసిద్ధమైన చక్కెరలు లోబీపీ సమస్యను తగ్గిస్తాయి.
శరీరంలో సోడియం స్థాయిలు తగినంతగా లేకపోయినా కూడా లోబీపీ వస్తుంది. సోడియం మనకు ఉప్పులో లభిస్తుంది. కొందరు ఉప్పు తినడాన్ని ప్రమాదంగా భావిస్తారు. ఉప్పును పూర్తిగా మానేస్తారు. దీంతో లోబీపీ వస్తుంది. కానీ అలా చేయకూడదు. ఉప్పును పూర్తిగా మానేయడం మంచిది కాదు. రోజుకు ఒక టీస్పూన్ మోతాదులో లేదా 5 గ్రాముల వరకు ఉప్పు మనకు అవసరమే. కనుక ఉప్పు మోతాదులో లభించేలా చూసుకోవాలి. దీంతో లోబీపీ ఏర్పడకుండా ఉంటుంది. అలాగే విటమిన్లు బి9, బి12 ఉండే ఆహారాలను అధికంగా తినాలి. కోడిగుడ్లు, చేపలు, పాలు, పాల ఉత్పత్తులను తీసుకోవాలి. ఇవన్నీ లోబీపీ సమస్య రాకుండా చూస్తాయి. ఆకుకూరలు, బ్రోకలీ, పప్పు దినుసులు, బీన్స్, సిట్రస్ ఫలాలు, నట్స్, మటన్ లివర్ వంటి ఆహారాలను తినాల్సి ఉంటుంది. ఇవన్నీ బీపీ సమస్యకు పరిష్కారం చూపిస్తాయి.
చికెన్, టర్కీ, చేపలు, కోడిగుడ్లు, పనీర్, పప్పు దినుసులను తరచూ ఆహారంలో భాగం చేసుకుంటే లోబీపీ సమస్య రాదు. శరీరానికి కావల్సిన ప్రోటీన్లు, ముఖ్యమైన ఫ్యాటీ యాసిడ్లు లభిస్తాయి. ఇవన్నీ గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి. హార్ట్ ఎటాక్ రాకుండా చూస్తాయి. లోబీపీ ఉన్నవారు ఎట్టి పరిస్థితిలోనూ ఉదయం బ్రేక్‌ఫాస్ట్ మానేయకూడదు. ఇది బీపీని స్థిమితంగా ఉండనివ్వదు. కనుక ఉదయం కచ్చితంగా ఏదో ఒకటి తినాలి. టీ, కాఫీలను తాగడం వల్ల కూడా లోబీపీని తగ్గించుకోవచ్చు. అయితే మరీ అధికంగా తాగితే శరీరంలో కెఫీన్ అధికంగా చేరి బీపీ మరీ ఎక్కువవుతుంది. కనుక రోజుకు 2 లేదా 3 కప్పులకు మించకుండా టీ, కాఫీలను సేవిస్తుండాలి. అలాగే కిస్మిస్లను నానబెట్టి తింటున్నా ఫలితం ఉంటుంది. బీపీని నియంత్రించడంలో బీట్రూట్ అద్భుతంగా పనిచేస్తుంది. రోజూ ఒక కప్పు మోతాదులో తాగాలి. బాదంపప్పులను నీటిలో నానబెట్టి తింటున్నా ఫలితం ఉంటుంది. ఇలా లోబీపీ సమస్య నుంచి బయట పడవచ్చు.