MLA Harish Rao | నారాయణరావుపేట, మే 31 : బీఆర్ఎస్ పార్టీ హయాంలో కేసీఆర్ ఆశీస్సులతో సిద్దిపేటలోని ప్రతీ గ్రామాన్ని అభివృద్ది చేసుకున్నామని, గుర్రాలగొంది గ్రామాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుకున్నామని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు అన్నారు.
శనివారం మండల పరిధిలోని గుర్రాలగొంది గ్రామంలో జరుగుతున్న మహంకాళీ దేవాలయ ఉత్సవాల్లో హరీశ్‌రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రేవంత్‌రెడ్డి ప్రభుత్వానికి మాటలు ఎక్కువ చేతలు తక్కువ అయ్యాయన్నారు. రుణమాఫీ అయిందని అబద్దాలు చెబుతున్న రేవంత్‌రెడ్డి అబద్దాలు కూడా నిర్భయంగా మాట్లాడగలడన్నారు. వానాకాలం రైతుబంధు ఎగ్గొట్టి, యాసంగి పావలా మందికి మాత్రమే ఇచ్చాడన్నారు.
కేసీఆర్ ప్రభుత్వంలో రైతు చనిపోతే దశదినకర్మ అయ్యేలోపే రైతుభీమా ఇచ్చే వాళ్లమని రేవంత్‌రెడ్డి వచ్చాక అది కూడా బంద్ అయ్యిందన్నారు. రూ.200 ఉన్న ఫించన్‌ను కేసీఆర్ రూ.2 వేలు చేశారని, రూ.4 వేలు ఇస్తానన్న రేవంత్‌రెడ్డి పాత ఫించన్ ఇచ్చుకుంట రెండు నెలలు ఎగ్గొట్టారన్నారు. కాళేశ్వరం రాకముందు 400 ఫీట్ల బోరేసినా నీళ్లు పడకపోవని, ఇవాళ కాళేశ్వరం వల్లనే ఎండాకాలంలో కూడా చెరువులు మత్తళ్లు దూకుతున్నాయన్నారు. కేసీఆర్ లేని లోటు స్పష్టంగా కనిపిస్తుందన్నారు.
కేసీఆర్ హయాంలో ఎకరం రూ.40 లక్షలు ఉంటే, ఇపుడు రూ.20 లక్షలకు కూడా అమ్ముడు పోని దుస్థితి ఉందన్నారు. ప్రజలకు పాలేందో నీళ్లేందో అర్థం అయిందన్నారు. మాట మీద నిలబడే వాళ్లు ఎవరో.. ఉత్త మాటలు చెప్పేవాళ్లు ఎవరో ప్రజల మదిలో ఉందని, మళ్లీ మంచి రోజులు వస్తాయన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ ఆంజనేయులు, మాజీ ఎంపీటీసీ హరీశ్, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.
Fake Seeds | నకిలీ విత్తనాలు విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవు : తొగుట సీఐ లతీఫ్
Ramayampet | లారీ – బైక్ ఢీ.. ఒకరికి తీవ్రగాయాలు
రామాయంపేటలో పాఠ్య పుస్తకాలు సిద్దం.. విద్యాసంవత్సరం ప్రారంభానికి ముందే అందజేత