సూర్యాపేట, మార్చి 04 : బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలపై కాంగ్రెస్ నాయకులు దాడులు ఆపకపోతే పెద్దఎత్తున ఉద్యమిస్తామని మాజీ ఎంపీ, బీఆర్ఎస్ సూర్యాపేట పార్టీ జిల్లా అధ్యక్షుడు బడుగుల లింగయ్య యాదవ్ హెచ్చరించారు. కాంగ్రెస్ నాయకుల దాడిలో తీవ్రంగా గాయపడ్డ నీలాల లక్ష్మయ్య అనే వ్యక్తిని చికిత్స కోసం హైదరాబాద్ గాంధీ ఆస్పత్రికి తరలించారు. బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సూర్యాపేటలో కాంగ్రెస్ పార్టీ నాయకుల వరుస దాడులను ఖండిస్తూ మాజీ ఎంపీ సూర్యాపేట జిల్లా కేద్రంలోని క్యాంప్ కార్యాలయంలో బుధవారం విలేకరులతో మాట్లాడారు. సూర్యాపేటలో బీఆర్ఎస్ నాయకులపై కాంగ్రెస్ దాడులు రెండు రోజుల్లో నాలుగు చోటుచేసుకున్నట్లు చెప్పారు.
దౌర్జన్యాలకు పాల్పడుతున్న కాంగ్రెస్ అరాచక శక్తులను ప్రోత్సాహించడం సరికాదని హితవు పలికారు. రెండేళ్ల పాలనలో అరాచకాలు తప్ప అభివృద్ధి శూన్యం అని దుయ్యబట్టారు. బీఆర్ఎస్ నాయకులపై దాడులు చేస్తామంటే సహించేది లేదని హెచ్చరించారు. మొన్న 24, 26, నిన్న 9వ వార్డు ఇలా వరుస దాడులకు పాల్పడటం హేయనీయమన్నారు. స్థానిక మంత్రులు ఆ పార్టీ నాయకులపై క్రమశిక్షణ చర్యలు చేపట్టాలని, పోలీసులు సరైన విచారణ చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు.
ఈ సమావేశంలో జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్ గౌడ్, ఉప్పల ఆనంద్, మున్సిపల్ మాజీ చైర్పర్సన్ పెరుమాళ్ల అన్నపూర్ణ, మాజీ వైస్ చైర్మన్ పుట్ట కిశోర్, మాజీ ఎంపీపీ నెమ్మాది భిక్షం, మాజీ జడ్పీటీసీ జీడీ భిక్షం, పట్టణ అధ్యక్ష, కార్యదర్శులు సవరాల సత్యనారాయణ, బూర బాల సైదులు గౌడ్, మాజీ కౌన్సిలర్లు తాహేర్ పాషా, భత్తుల జానీ, మాజీ సర్పంచ్ శ్యామ్, అమరవాది శ్రవణ్ పాల్గొన్నారు.