కోర్టు ఉత్తర్వులను ప్రభుత్వ అధికారులు పదేపదే ధిక్కరిస్తున్నారు. ఒకరిపై మరొకరు బాధ్యతను నెట్టివేసుకుంటూ కోర్టును తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. పాలనావ్యవస్థ వైఫల్యాన్ని ఇది స్పష్టంగా ప్రతిబింబిస్తున్నది. ప్రైవేట్ వ్యక్తులు కోర్టులను తప్పుదోవ పట్టించడంలేదు.. అధికారులే ఆ పనిచేస్తున్నారు. హైడ్రా వ్యవహారంలో ఇటీవల జస్టిస్ అనిల్‌కుమార్ వెలువరించిన అభిప్రాయాలు, ఇచ్చిన ఉత్తర్వులు పూర్తిగా సమర్థనీయమే.
హైదరాబాద్, జూలై 30 (నమస్తే తెలంగాణ) : ప్రైవేట్ వ్యక్తులు కోర్టులను తప్పుదోవ పట్టించడంలేదని, అధికారులే ఆ పనిచేస్తున్నారని హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసింది. ఎవరిని ఎవరు తప్పుదోవ పట్టిస్తున్నారో చెప్పేందుకు ఇది స్పష్టమైన ఉదాహరణ అని పేర్కొన్నది. హైడ్రా వ్యవహారంలో ఇటీవల జస్టిస్ అనిల్‌కుమార్ వెలువరించిన అభిప్రాయాలు, ఇచ్చిన ఉత్తర్వులు పూర్తిగా సమర్థనీయమేనని జస్టిస్ ఎన్వీ శ్రవణ్‌కుమార్ స్పష్టం చేశారు. ఈ అంశంలో కోర్టులను ప్రైవేట్ వ్యక్తులు తప్పుదోవ పట్టిస్తున్నారనే ప్రచారం పూర్తిగా అవాస్తవమని తెలిపారు. ప్రభుత్వ అధికారుల చర్యల వల్లే ఇలాంటి పరిస్థితులు తలెత్తుతున్నాయని తప్పుబట్టారు. రాజ్యాంగబద్ధ బాధ్యతలను కోర్టులు నిర్వర్తిస్తున్నాయని, అధికారులు చట్టప్రకారం వ్యవహరించకపోవడం వల్ల ప్రజలు న్యాయస్థానాలను ఆశ్రయించాల్సి వస్తున్నదని పేర్కొన్నారు.
రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం కొండాపూర్‌లోని సర్వే నంబర్ 60లో ఉన్న 350 చదరపు గజాల ప్రైవేట్ స్థలానికి చెందిన ప్రహరీ, వాచ్‌మన్ గదిని హైడ్రా కూల్చివేయడాన్ని సవాల్ చేస్తూ పెమ్మసాని సుధారాణి దాఖలు చేసిన పిటిషన్‌పై జస్టిస్ ఎన్వీ శ్రవణ్ కుమార్ ధర్మాసనం గురువారం మరోసారి విచారణ జరిపింది. మంగళవారం విచారణ నిర్వహించిన సమయంలో పిటిషనర్ తరఫున న్యాయవాది ఎస్ శ్రీధర్ వాదనలు వినిపించారు. సర్వే నంబర్ 59లోని ప్రభుత్వ భూమి పరిరక్షణకు సంబంధించి శేరిలింగంపల్లి తహసీల్దార్ నిరుడు అక్టోబర్ 1న కలెక్టర్‌కు లేఖ రాశారని తెలిపారు. ఈ అంశంలో పోలీస్ కమిషనర్ సహకారం కోరుతూ కలెక్టర్ అక్టోబర్ 3న లేఖ రాయడంతోపాటు దాని ప్రతిని హైడ్రాకు పంపారని చెప్పారు. కానీ హైడ్రా అధికారులు నవంబర్ 1న సర్వే నంబర్ 60లోని పట్టా భూమిలో ఉన్న పిటిషనర్ ఆస్తిని ఎలాంటి నోటీసు ఇవ్వకుండానే కూల్చివేశారని వెల్లడించారు. ఇదే భూ వివాదానికి సంబంధించి హైకోర్టు 2022లోనే సర్వే నెంబర్ 59 ప్రభుత్వ భూమి అని, సర్వే నెంబర్ 60 పట్టా భూమి అని స్పష్టం చేసిందని గుర్తుచేశారు.
ఎలాంటి చర్యలు తీసుకున్నా ముందుగా నోటీసులు జారీ చేసి, చట్టప్రకారం వ్యవహరించాలని ఆదేశించినట్టు తెలిపారు. ఈ ఉత్తర్వులను అధికారులు పూర్తిగా విస్మరించారని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. దీంతో ధర్మాసనం స్పందిస్తూ.. ప్రైవేట్ స్థలంలోని ప్రహరీని కూల్చివేయాలని హైడ్రాకు లేఖ ఎలా రాస్తారంటూ తహసీల్దార్‌పై ఆగ్రహం వ్యక్తంచేసింది. గురువారం వ్యక్తిగతంగా హాజరు కావాలని ఆదేశించింది. ఈ మేరకు శేరిలింగంపల్లి తహసీల్దార్ గురువారం వ్యక్తిగతంగా హాజరయ్యారు. ప్రభుత్వ న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. సర్వే నంబర్ 59 ప్రభుత్వ భూమేనని నిరుడు హైకోర్టు తీర్పు వెలువరించిన నేపథ్యంలో భూమి పరిరక్షణ కోసం మాత్రమే హైడ్రాకు తహసీల్దార్ సమాచారం ఇచ్చినట్టు తెలిపారు. కూల్చివేతలు చేపట్టాలని కోరలేదని పేర్కొన్నారు. హైడ్రా తరఫు న్యాయవాది సమీర్ అహ్మద్ స్పందిస్తూ, 2022లో హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వుల విషయం తమకు తెలియదని, రెవెన్యూ అధికారుల సమాచారంపైనే చర్యలు చేపట్టామని చెప్పారు.
నోటీసులు జారీ చేయాలని, ఆ తర్వాత మాత్రమే చర్యలు తీసుకోవాలని గతంలో హైకోర్టు స్పష్టంగా ఆదేశించినా, వాటిని అమలు చేయకుండా వ్యవహరించడం కోర్టు ఉత్తర్వుల ఉల్లంఘనేనని వ్యాఖ్యానించారు. ఒకవేళ ఆక్రమణ ఉన్నా కూడా చట్టప్రకారం నోటీసులు ఇచ్చి, వివరణకు అవకాశం కల్పించిన తర్వాతే చర్యలు తీసుకోవాలని తేల్చి చెప్పారు. కోర్టు ఉత్తర్వులను ప్రభుత్వ అధికారులు పదేపదే ధిక్కరిస్తూ, ఒకరిపై మరొకరు బాధ్యత నెట్టివేస్తూ కోర్టును తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని ఘాటుగా వ్యాఖ్యానించారు. ఇలాంటి వ్యవహారం పరిపాలనా వ్యవస్థలో ఉన్న వైఫల్యాన్ని స్పష్టంగా ప్రతిబింబిస్తున్నదని తప్పును ఎత్తి చూపించారు. ఇటీవల హైడ్రా వ్యవహారంపై సోదర న్యాయమూర్తి చేసిన వ్యాఖ్యలు, వెలువరించిన తీర్పు పూర్తిగా సమర్థనీయమేనని మరోసారి స్పష్టం చేశారు.
హైడ్రా ఇష్టం వచ్చినట్టు చేస్తున్నదని, విధానం పాటించకుండా కూల్చివేతలకు పాల్పడుతున్నదని హైకోర్టు అభిప్రాయపడింది. అవతలి వాళ్ల రికార్డులను పరిశీలించకుండా, కనీసం సర్వే చేయకుండా చివరకు కోర్టు ఆదేశాలను కూడా పట్టించుకోవడంలేదని తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘మీరు సంస్థల గురించి మాట్లాడలేరు. కోర్టులు దేని కోసం ఉన్నాయి?’ అని న్యాయమూర్తి ఘాటుగా వ్యాఖ్యానించారు. తమ ముందున్న ఈ వ్యవహారంలో తేదీల వారీగా జరిగిన చర్యలన్నింటిపై పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఆగస్టు 6కు విచారణను వాయిదా వేశారు. అప్పటి వరకు ప్రతి విచారణకూ శేరిలింగంపల్లి తహసీల్దార్ వ్యక్తిగతంగా హాజరుకావాలని ఆదేశించారు.
దీంతో ధర్మాసనం స్పందిస్తూ.. కేసు పూర్వాపరాలు చూస్తే రెవెన్యూ శాఖ, హైడ్రా మధ్య కనీస సమన్వయం కూడా లేదని స్పష్టమవుతున్నదని అన్నారు. పిటిషనర్ భూమి సర్వే నంబర్ 60లో ఉండగా, దానిని ప్రభుత్వ భూమిగా ఎలా పరిగణించారో అధికారులు ఇప్పటికీ స్పష్టమైన వివరణ ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తంచేశారు. ప్రభుత్వ భూమికి ప్రహరీ ఎంత దూరంలో ఉన్నదన్న వివరాలు కూడా రికార్డుల్లో లేవని ఆక్షేపించారు. ప్రభుత్వ భూమిలో పిటిషనర్ ప్లాట్ ఉన్నదని హైడ్రా అధికారులు ఎలా నిర్ధారణకు వచ్చారని ప్రశ్నించారు. నిర్మాణాన్ని కూల్చేముందు ఏమైనా విచారణ జరిపారా? పిటిషనర్‌కు నోటీసులు ఇచ్చారా? మూడు రోజుల్లో నిర్మాణాన్ని కూల్చివేయడానికి అంత తొందరెందుకు? అని నిలదీశారు. హైడ్రాపై బయటి ఒత్తిడి ఏమైనా ఉందా? కూల్చివేయడానికి జిల్లా కలెక్టర్ ఏమైనా లేఖ రాశారా? అని న్యాయమూర్తి పదేపదే అడిగారు.