హనుమకొండ చౌరస్తా, సెప్టెంబర్ 11: కాకతీయ యూనివర్సిటీలో దొంగలు పడ్డారు. గుర్తుతెలియని వ్యక్తులు బిల్డింగ్‌పై ఉన్న వెంటిలేటర్ నుంచి డెవలప్మెంట్ ఆఫీస్‌లో లోపలికి చొరవబడి అన్ని చిందరవందర చేశారు. గురువారం అర్ధరాత్రి సమయంలో యూనివర్సిటీ డెవలప్మెంట్ ఆఫీస్‌లోకి గుర్తుతెలియని వ్యక్తులు ప్రవేశించినట్లు అధికారులు గుర్తించారు. శుక్రవారం ఉదయం కార్యాలయాన్ని పరిశీలించిన అధికారులు ఈ విషయాన్ని కేయూ పోలీసులకు సమాచారం అందించారు.
యూనివర్సిటీ డెవలప్మెంట్ ఆఫీస్‌లో చోరీ యత్నం కలకలం రేపింది. ఆఫీస్‌లో వస్తవులన్నీ చిందరవందరగా ఉడడం, గుర్తు తెలియని వ్యక్తుల ప్రవేశంపై కేయూ పోలీసులు విచారణ చేపట్టారు. క్లూస్ టీంతో కలిసి సంఘటనా స్థలానికి చేరుకుని ఫింగర్ ప్రింట్స్, ఇతర ఆధారాలను సేకరించారు. అయితే.. కార్యాలయంలోని కొన్ని వస్తువులను చిందరవందర చేసినప్పటికీ. ఎలాంటి వస్తువులు చోరీకి గురైనట్లు ప్రాథమికంగా గుర్తించలేదని అధికారులు చెబుతున్నారు. గతంలోనూ యూనివర్సిటీలో పలు చోరీ ఘటనలు చోటుచేసుకోవడంతో ఈ ఘటనపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

ఇదివరకు న్యూ పీజీ హాస్టల్లో చోరీకి గురైన ఫ్యాన్లును కనిపెట్టలేదు. అలాగే కేయూ ఆడిటోరియంలో ఏసీలకు సంబంధించిన గ్యాస్ పైపులు, కాపర్ వైర్లు అపహరణ ఘటనలోనూ ఇప్పటివరకు రికవరీ జరగలేదని విద్యార్థులు చెబుతున్నారు. కేయూ మహిళా ఇంజినీరింగ్ కళాశాలలో రెండు ప్రొజెక్టర్లు మాయమైన ఘటన కూడా వెలుగులోకి వచ్చింది. తాజాగా డెవలప్మెంట్ ఆఫీస్‌లో చోరీ యత్నం నేపథ్యంలో సీసీ కెమెరాలు సక్రమంగా పని చేస్తున్నాయా? సెక్యూరిటీ గార్డులు, నైట్ పెట్రోలింగ్ నిర్వహించే సిబ్బంది విధులు సక్రమంగా నిర్వహిస్తున్నారా? అనే సందేహాలను వ్యక్తం చేస్తున్నారు.
వరుస చోరీల నేపథ్యంలో ఇవన్నీ బయటి వ్యక్తుల పనా? లేక యూనివర్సిటీ అంతర్గత వ్యవస్థపై అవగాహన ఉన్న వ్యక్తుల ప్రమేయం ఉందా? అనే కోణంలోనూ విచారణ జరపాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. ఇటీవలే డెవలప్మెంట్ ఆఫీసర్‌గా వాసు దేవరెడ్డి నుంచి వెంకయ్య బాధ్యతలు చేపట్టారు. కేయూకు సంబంధించిన విలువైన ఫైళ్లు ఈ ఆఫీస్‌లోనే ఉన్నాయి. దాంతో, దుండగులు వీటి కోసం వచ్చినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే కేయూ భూములు అన్యాకాంత్రమవుతున్నా అధికారులు చర్యలు తీసుకోకపోవడం, ఇంకా కేయూ చుట్టూ ప్రహారీ గోడ నిర్మించకపోవడంతో అధికారుల తీరుపై విద్యార్థులు మండిపడుతున్నారు.