న్యూఢిల్లీ: పండుగల సీజన్ ప్రారంభమవడంతో ఆన్లైన్ షాపింగ్ సంస్థలు భారీ సేల్స్‌కు సిద్ధం అవుతున్నాయి. అమెజాన్, ఫ్లిప్‌కార్డ్, మింత్ర తదితర వేదికల్లో ఇప్పటికే ముందస్తు ఆఫర్లు అందుబాటులోకి వచ్చాయి. భారీ తగ్గింపులు, పరిమిత కాల ఆఫర్లు, ప్రత్యేక డీల్స్ అంటూ వినియోగదారులను ఆకర్షిస్తున్నారు. అయితే ‘ఇప్పుడే కొనకపోతే ఆఫర్ పోతుంది’ అనే భావన కలిగించే సందేశాలు కనిపించినప్పుడు.. నిజంగానే అంత అత్యల్ప ధరకు వస్తువు లభిస్తుందా? అనే ప్రశ్న తలెత్తుతున్నది.
ఒక ఫోన్‌పై 30 శాతం తగ్గింపు, మరోవైపు 30 నిమిషాల్లో ముగుస్తుంది అనే కౌంట్‌డౌన్ కనిపించిందనుకోండి. ఆఫర్ మిస్ అవుతుందేమోనని కొందరు వెంటనే కొనుగోలు చేసే అవకాశం ఉంది. అయితే కొద్ది రోజుల తర్వాత అదే ఫోన్ రెండు వారాల క్రితం 50 శాతం తగ్గింపుతో లభించిందని తెలిసినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఎందుకంటే డిస్కౌంట్ శాతం మాత్రమే గత ధరలతో పోలిస్తే ఆదా ఎంత అనేది వెల్లడికాదు. తగ్గింపు శాతం ఏ సూచిక ధరతో పోల్చి చెప్పారన్నదీ కీలకమే. ‘ఇంకా రెండు మాత్రమే మిగిలాయి. 10 నిమిషాల్లో ఆఫర్ ముగుస్తుంది’ వంటి సందేశాలు కొనుగోలు దారులను త్వరగా నిర్ణయం తీసుకునేలా ప్రభావితం చేయవచ్చని పరిశోధనలు చెబుతున్నాయి.
2023లో 195 మంది వయోజనులపై జరిగిన ఒక అధ్యయనంలో తక్కువ స్టాక్ సందేశాలు, కౌంట్‌డౌన్ టైమర్లు, పరిమిత కాల ఆఫర్లు వంటి నాలుగు రకాల ‘డార్క్ ప్యాటర్న్స్’ను పరిశీలించారు. ఇవి ఉత్పత్తుల ఎంపికపై గణనీయమైన ప్రభావం చూపినట్లు అధ్యయనం వెల్లడించింది. 2026లో డేటమ్స్ ఇంటెలిజెన్స్ అధ్యయనం 50 నగరాల్లో 2,590 మంది వినియోగదారులను, ఈ కామర్స్, క్విక్ కామర్స్, ఆన్లైన్ ట్రావెల్‌కు చెంది 12 ప్రముఖ వేదికలను పరిశీలించింది. ఇందులో వినియోగదారులు డార్క్ ప్యాట్రన్ కారణంగా ఏటా రూ.25 వేల కోట్ల నుంచి రూ. 28 వేల కోట్ల వరకు నష్టపోతున్నారని అంచనా వేసింది. 81 శాతం మందికి వీటిపై అవగాహన ఉన్నప్పటికీ, తాము తప్పుదోవ పట్టినట్టు తెలిపారు.
అయితే ప్రతీ అత్యవసర సందేశం డార్క్ ప్యాటర్న్ అని దీని అర్థం కాదు. నిజమైన స్టాక్ పరిమితులు, సమయపరిమిత ఆఫర్లు కూడా ఉంటాయి. వినియోగదారులను అమితంగా ప్రభావితం చేసే 13 రకాల డార్క్ ప్యాటర్స్న్ను కేంద్ర వినియోగదారుల పరిరక్షణ ప్రాధికార సంస్థ గుర్తించింది. వాటిని అరికట్టేందుకు 2027 నుంచి అమల్లోకి వచ్చే కొత్త నిబంధనల్లో డార్క్ ప్యాటర్న్స్‌ను పరిష్కరించడం, వార్షిక స్వీయ ఆడిట్లను నిర్వహించడం, అనుసరణ ప్రకటనలను సమర్పించడంపై దృష్టి సారించనుంది. ఈ పండుగ సీజన్లో ఏదైనా వస్తు కొనుగోలులో మోసం జరిగిందని నిర్థారణకు వస్తే, దాని రుజువులతో జాతీయ వినియోగదారుల హెల్ప్‌లైన్ 1915కు ఫిర్యాదు చేయాలని అధికారులు తెలిపారు.