రాచరికం అంతరించినా ఆనాటి కట్టడాలు మాత్రం సంస్కృతి, సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలకు ఆనవాళ్లుగా కనిపిస్తూనే ఉన్నాయి. భావి తరాలకు నాటి చరిత్రను వివరిస్తున్నాయి. అలాంటి కట్టడాలు జాతికి అందించిన గొప్ప రాజులు కాకతీయులు. నాటి పాలకుల కళాతృష్ణకు నిలువుటద్దంలా నిలిచిన ఉమ్మడి వరంగల్ జిల్లాలోని రామప్ప దేవాలయం యునెస్కో గుర్తింపును సొంతం చేసుకుంది. అదే వరుసలో రామప్ప కోవెల ఉపాలయాలకూ జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. శివ తారకేశ్వరాలయానికి జాతీయ సంపదగా, గొల్లాల గుడి జాతీయ ప్రాధాన్య ప్రాంతంగా గుర్తింపు లభించడం విశేషం. ఇంతటి ఖ్యాతిని పొందిన ఆ వారసత్వ సంపదపై ఓ లుక్కేద్దాం రండి..

అడవులు, కొండలు, కోనలు, వాగులు, వంకలతో పాటు సైన్స్‌కు అందని వింతలు, విశేషాలెన్నో తెలంగాణలోని ములుగు జిల్లా సొంతం. ప్రపంచ దేశాల మేధావులను సైతం ఆలోచింపజేసే కాకతీయ రాజుల శిల్పకళలను చాటిచెప్పి యునెస్కో గుర్తింపును పొందిన రామప్ప దేవాలయం ఉన్నది ఈ జిల్లాలోనే. కాకతీయుల పాలనలో శిల్ప కళా నైపుణ్యాన్ని భవిష్యత్ తరాలకు తెలియజేసేందుకు కేంద్ర పురావస్తు శాఖ అధికారులు వెంకటాపూర్ మండలం పాలంపేటలో ఉన్న రామప్పతో పాటు రామప్ప పరిధిలోని 10 ఉప ఆలయాలను పరిరక్షించేందుకు ముందుకు సాగుతున్నారు.
రామప్ప ఆలయానికి 2021 జూలై 25వ తేదిన ప్రపంచ వారసత్వ కట్టడంగా యునెస్కో గుర్తింపు లభించింది. ఈ ప్రధాన ఆలయ ప్రాంగణంలోని ఉప ఆలయాలైన గొల్లల గుడి, శివతారకేశ్వరస్వామి (శివాలయం) జాతీయ ప్రాముఖ్యత స్మారక చిహ్నాలుగా భారత పురావస్తు సర్వేక్షణ (ఏఎస్ఐ) సంస్కృతి మంత్రిత్వ శాఖ పరిధిలోకి వెళ్లాయి. ప్రస్తుతం ఈ రెండు ఆలయాల్లో కొంత భాగం కూలిపోగా పురావస్తు శాఖ అధికారులు జీర్ణోద్ధరణ చేపట్టారు.
త్రికూటాలయంగా రామప్ప ఆలయానికి నైరుతి దిశలో తూర్పు ముఖంగా ఉన్న గొల్లల గుడి మంటపంతో పాటు దాని చుట్టూ మూడు గర్భాలయాలతో కూడిన త్రికూటాలయం కనిపిస్తుంది. దీని ప్రహరీ శిల్పాలంకృతమై పైకప్పు అంచు నిర్మాణం, ద్వార బంధాల వద్ద హంసల వరుసతో చెక్కిన ‘సునిశిత రంధ్రాల వల’ నాటి శిల్పకారుల చతురతకు సాక్ష్యంగా దర్శనమిస్తుంది. ప్రధాన గుడికి ముందు వైపున రెండు ప్రత్యేక ఉప ఆలయాలు ఎంతో అందంగా చెక్కిన ద్వార పాలకుల విగ్రహాలు అబ్బురపరుస్తాయి. వీటి ముందు గల అంతరాలయాల అంచులు కూడా చక్కని తెరలతో శోభాయమానంగా కనిపిస్తుంటాయి. ప్రాణాలయ నిర్మాణం ముందు భాగంలో ఉన్న మంటపంలో అడుగడుగునా అద్భుతాలు గోచరిస్తాయి. దీనికి ఉత్తర, దక్షణ పశ్చిమ దిశలలో అంతరాలయాలతో మూడు గర్భాలయాలు కూడా ఉంటాయి. ఆలయ కుడ్యాలపై విష్ణుమూర్తి, లక్ష్మీదేవి, గణపతి, దుర్గాదేవి విగ్రహాలు దర్శనిమిస్తాయి. జంతువుల ఆకారాలు, పుష్పాలతో కూడిన ఎత్తయిన వేదికపై గొల్లల గుడి నిర్మితమై ఉంది.

అక్రమ నిర్మాణాలకు అడ్డుకట్ట
కాకతీయుల కాలం నిర్మాణ చాతుర్యాన్ని భవిష్యత్తు తరాలకు తెలియజేసే విధంగా కేంద్ర పురావస్తు శాఖ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన రెండు ఆలయాల చుట్టూ ఉన్న భూమిని తమ అధీనంలోకి తీసుకొని పూర్తిగా కేంద్ర రక్షిత ప్రాంతంగా మార్చుతున్నారు. ఆలయ జీర్ణోద్ధరణ, అభివృద్ధి పనులు, భద్రతా బాధ్యతలను ఇక నుంచి ఏఎస్‌ఐనే పర్యవేక్షించనున్నది. చారిత్రక కట్టడాల పరిరక్షణలో భాగంగా ఆలయ పరిసరాల్లో ఎలాంటి అక్రమ నిర్మాణాలు జరగకుండా కఠిన నిబంధనలను అమలు చేయనున్నారు. ఉప ఆలయాల ప్రాశస్త్యాన్ని భవిష్యత్తు తరాలకు అందించేందుకు కట్టుదిట్టమైన చర్యలను అమలు చేయనున్నారు. రామప్ప పరిసర ప్రాంతాల్లోని అన్ని ఉప ఆలయాలను సైతం వినియోగంలోకి తీసుకువచ్చినట్లయితే ఈ ప్రాంతం పర్యాటకంగా మరింత అభివృద్ధి చెందుతుంది అనడంలో సందేహం లేదు.
బోయినపల్లి శ్రీధర్‌రావు ములుగు
ఫొటోలు: కోరె అరవింద్
