నేను ట్యూషన్ చెప్పే పిల్లలు నాకంటే మహా అయితే మూడు నాలుగు ఏండ్లు చిన్నవాళ్లు. అందువల్ల వాళ్లు నన్ను ‘టీచర్’ అని పిలిచినా నా దగ్గర చాలా చనువుగా ఉండేవాళ్లు. ఇక నేను మొదలే కోతిని అని అప్పటికే పేరు ప్రఖ్యాతులు పొంది ఉన్నాను. ఒక దగ్గర కుదురుగా చాలా సేపు కూర్చొని బుద్ధిమంతురాలిలాగా ఉండటం నావల్ల దాదాపు అసాధ్యం. అందుకని నేను ఆ పిల్లలతో బాగా ఆడేదాన్ని.
వాళ్లు స్కూల్ నుంచి రాగానే కాళ్లు చేతులు కడుక్కొని దుస్తులు మార్చుకుని ఏదైనా ఇంత నోట్లో పడేసుకునే వారో లేదో గానీ, వెంటనే మా ఇంటికి పరిగెత్తుకుని వచ్చేవారు. నిజానికి ట్యూషన్ ఐదింటి నుంచి ఏడింటి దాకా ఓ రెండు గంటలు ఉండేది. అయినా కూడా వాళ్లు నాలుగున్నరకే మా ఇంటికి వచ్చేసేవాళ్లు. ఆ పిల్లలందరితో నేను క్రికెట్ గానీ, షటిల్ గానీ, టెన్నికైట్ గానీ ఆడుతూ ఉండేదాన్ని. మగపిల్లలు, ఆడపిల్లలు తేడా జాన్తా నై అన్నమాట. మేము అలా ఆడుకుంటున్నది చూసి మా నాన్న అంత పెద్ద వాకిట్లో గడ్డి ఏమీ లేకుండా బాగా చెక్కించి శుభ్రంగా ఉంచేవాడు. పాపం.. రోజూ పొద్దున్నే ఊడ్చి సానిపి చల్లే మాలిమ్ బీ ‘పోరగాండ్లు సదువుకునుడెందో గానీ, వాకిలంత పొక్కిలి జేస్తాన్లు. ఒక్కనాడు అందర్ని ఒంగవెట్టి ఊడిపిస్త!’ అని గులుగుతూ ఉండేది. ‘సరే, వారానికో రోజు నేను ఊడుస్త తియ్యి’ అనేదాన్ని. నిజానికి నాకు ఊడ్వడం కన్నా సానిపి జల్లడం ఇష్టంగా ఉండేది.
పిల్లలు బాగా ఆడాక మా ఇంటి వెనకున్న చేదబాయి దగ్గరికి వెళ్లి అక్కడున్న బకెట్లలో, గోలెంలో ఉన్న నీళ్లతో చేతులు కాళ్లు శుభ్రంగా కడుక్కొని అప్పుడు వచ్చి ట్యూషన్లో కూర్చునేవారు. ఈ నీళ్లు కూడా మాలీంబీ మర్నాటి కోసం చేది పెట్టుకున్నవే. ఆమె విసుక్కోవడంతో పిల్లలు బావిలో చేద వేసి నీళ్లు చేదుదామని చూసేవారు. కానీ చిన్నపిల్లలు గనుక పొరపాటున బావిలో పడితే కష్టమని అమ్మా, నాన్న వద్దనేవారు. అయినా నేను కూడా చేదుతూ ఉండేదాన్ని. పెద్దపిల్లలు ఒక్కోసారి డబుల్స్ చేదేవారు. మా జీతగాళ్లు ఆ సమయానికి గానీ వస్తే నాన్న వాళ్లతో నీళ్లు చేదించేవాడు.
ఈ లోపల మా నానమ్మ గానీ, అమ్మ గానీ వంటింట్లో ఏవైనా చిరుతిళ్లు తయారు చేస్తే.. ఉదాహరణకు మక్కజొన్న కంకులు కాల్చడమో, చేగోడీల్లాంటివి చేయడమో, పల్లి కాయ వేయించడమో.. ఇలాంటివి ఉంటే గనుక ‘పాపం, ఎంతకని చదువుతరు? ఊరికే చదువుతుంటే ఆకలి గాదా! ఆ పిల్లగాండ్లకు పెట్టు’ అంటూ బయటికి ఇచ్చేవాళ్లు. నేను ఓ పెద్ద ప్లేట్లో అవి పట్టుకొచ్చి పిల్లలందరికీ పెట్టేదాన్ని. వాళ్లందరూ ఆకలితో ఆవురావురని నమిలి పారేసే వాళ్లు. ఆ తర్వాతనే ఉత్సాహంగా వాళ్లకి చదువు చెప్తూ ఉండేదాన్ని. చదువు చెప్తున్నప్పుడు మాత్రం ఎవరూ గుసగుసలు కూడా పెట్టడానికి వీల్లేదు. వాళ్లు కూడా చాలా శ్రద్ధగా వింటూ ఉండేవారు.
నేను ట్యూషన్ చెప్పడం మొదలు పెట్టినప్పుడు పిల్లలకు లెక్కలు, ఇంగ్లీషు, సైన్సు చెప్పాల్సి ఉండింది. నేను పొద్దున్నే 7, 8, 9, 10… మొత్తానికి నాలుగు తరగతుల వాళ్లకి విడివిడిగా లెక్కలు, ఇంగ్లీషు, సైన్సు చెప్పే ఒప్పందం. కానీ, నేను వాళ్లడిగినందుకు తెలుగు, సోషల్ స్టడీస్, హిందీతో సహా అన్ని సబ్జెక్టులు చెప్పేదాన్ని. ఆ రోజు స్కూల్లో ఏం చెప్పారో తెలుసుకొని ఆ పాఠం అర్థమైందా లేదా అని అడిగి, దాన్ని ఎట్లా చదువుకోవాలి, ఎట్లా అర్థం చేసుకోవాలి అంటూ వివరంగా పిట్ట కథలు, ఇతర కథలతో కలిపి చెప్తూ ఉండేదాన్ని. తర్వాత పాఠాన్ని ఒక డ్రామాలాగా అనుకోమని ఒక పేరాగ్రాఫ్ ఓ స్టూడెంట్‌తో చదివించి దాంట్లో మిగతా వాళ్లకు ఏం అర్థమైందో వివరించమనేదాన్ని.
వనజ అనే అమ్మాయి పాఠం చదివేటప్పుడు దాన్ని డ్రమెటిక్‌గా చదువుతూ ఉండేది. ఒకసారి చంద్రహాసుడు అనే తెలుగు పాఠం చదవాల్సి వచ్చింది. దాన్ని ఆ అమ్మాయి చదివే విధానం చాలా నవ్వు తెప్పించేలాగా ఉండేది. సురేష్ అని క్లాసులో మహా అల్లరి పిల్లవాడు. అందర్నీ బాగా ఏడిపిస్తూ ఉండేవాడు. వనజ ఆ పాఠం చదివేటప్పుడు ‘కేరళ దేశమును ఏలే రాజుకు లేక లేక ఒక పుత్రుడు కలిగెను’ అని మొదలుపెట్టగానే ‘ఓహో!’ అనేవాడు సురేష్. ‘ఆ బాలుని జన్మ నక్షత్రము మూల. కొడుకు పుట్టిన కొలదినాళ్లకే కేరళరాజు శత్రువులతో యుద్ధము చేయుచు వీర మరణము పొందెను’ అనగానే ‘అయ్యో! ఎంత పని జరిగెను!’ అనేవాడు మెల్లగా. ‘రాణియు దుఃఖముతో సహగమనము చేసెను’ అని చదువుతూండగానే ‘ఇప్పుడెట్లా మరి ?’ అనేవాడు. సురేశ్ వంక చురచుర చూస్తూనే ‘దాదులు ఆ బాలుని అల్లారుముద్దుగా పెంచసాగిరి’ అనేది వనజ. ‘ఎవరైతే ఏందిలే పాపం! బతికిండు గద!’ అనేవాడు సురేశ్. ఇట్లా ఆ అమ్మాయి చాలా ఎక్స్‌ప్రెషన్స్‌తో చదువుతూ ఉంటే సురేశ్ అడుగడుగునా ఏడిపిస్తూ ఉండేవాడు. మిగతా పిల్లలంతా నోటికి చెయ్యి అడ్డం పెట్టుకుని నవ్వుతూ ఉంటే ‘ఏయ్, సురేష్ ఊరుకో! ఎందుకు పాపం వనజను అట్ల అంటున్నవు?’ అని స్వయంజ్యోతి మాత్రం ఆ పిల్లవాడిని వారిస్తూ ఉండేది.
నాక్కూడా నవ్వొచ్చినా టీచర్‌గా పెద్దరికం ఏడ్చింది గనుక నవ్వు దాచుకుని ‘సురేశ్! నువ్విట్ల జేస్తే నిన్ను ట్యూషన్‌కి అలో చెయ్యను’ అనేదాన్ని అప్పుడప్పుడూ అతిగా ప్రవర్తించిన శాసనసభ్యులను వారం రోజులపాటు బర్తరఫ్ చేసే స్పీకర్ లాగా. సురేశ్ దీనికి మాత్రం వెంటనే స్పందించి ‘అయ్యయ్యో! తప్పయింది టీచర్! నన్ను ట్యూషన్‌కు రావొద్దని అనకండి. వనజ సిన్మా డైలాగుల్లెక్క పాఠం చదువుతుంటె అట్ల అనబుద్ది అయింది’ అనేవాడు. ఏదో పైకి అలా అన్నా పెదవుల మీద నవ్వు అలానే వుండేది. ‘నిన్ను కొడతా సురేశ్!’ అంటూనే వనజ కూడా నవ్వేసేది. చదువులో బాగా ఇంటెలిజెంట్ అయిన సురేశ్ ఇప్పుడు మంచి బిజినెస్‌మ్యాన్‌గా ఎదిగాడు. మొన్నీ మద్య కొడుకు పెళ్లి చేసి పిలిస్తే వెళ్లాను కూడా. ఇక వనజ కూడా పెళ్లయ్యాక బట్టల బిజినెస్ చేస్తూ సంగారెడ్డిలో అనుకుంటా.. బాగానే ఉందని తెలిసింది. రెండు మూడు సార్లు కలిసింది. స్వయం జ్యోతి, ఉమా మహేశ్వరి ఇద్దరూ పెళ్లిళ్లయి ఒకరు హైదరాబాదులోనూ, మరొకరు వరంగల్లోనూ స్థిరపడ్డారు.
నెల్లుట్ల రమాదేవి
రచయిత్రి