బదోహి: పురిటి నొప్పులతో విలవిల్లాడుతూ దవాఖాన మెట్లెక్కిన ఒక నిరుపేద దళిత మహిళకు చేదు అనుభవం ఎదురైంది. కనీస మానవత్వం చూపకుండా వైద్యులు ఆమెను దవాఖానలో చేర్చుకునేందుకు నిరాకరించారు. దీంతో ఆమె అత్యంత దయనీయ స్థితిలో రోడ్డుపైనే బిడ్డకు జన్మనివ్వాల్సిన దుస్థితి ఏర్పడింది. ఈ అమానుష ఘటన బీజేపీ పాలిత ఉత్తరప్రదేశ్లోని బదోహి జిల్లా దవాఖానలో గత నెల 30న చోటుచేసుకుంది. ముసహర్ తెగకు చెందిన రాణి వనవాసి(20) అనే గర్భిణి ప్రసవ వేదనతో మహారాజా చేత్ సింగ్ ప్రభుత్వ జిల్లా దవాఖానకు వచ్చింది.
అయితే ఆమె రక్తహీనతతో బాధపడుతున్నదని, దవాఖానలో రక్తం లేదనే సాకుతో అక్కడి వైద్యులు ఆమెను చేర్చుకునేందుకు నిరాకరించారు. అయితే తాము అత్యంత వెనుకబడిన ముసహర్ తెగకు చెందిన దళితులమైనందునే వైద్యులు కనీస చికిత్స కూడా అందించకుండా గెంటివేశారని బాధితురాలి కుటుంబసభ్యులు మీడియా ఎదుట ఆరోపించారు. ఇక చేసేదేమీ లేక నిస్సహాయ స్థితిలో తనతో పాటు వచ్చిన మహిళల సాయంతో బాధితురాలు రోడ్డు పైననే ప్రసవించింది.
ఈ దారుణంపై జిల్లా మేజిస్ట్రేట్ ఆదేశాల మేరకు విచారణ చేపట్టిన ముగ్గురు సభ్యుల కమిటీ.. విధుల్లో ఉన్న నలుగురు వైద్యులు, ఒక నర్సు తీవ్ర నిర్లక్ష్యం వహించినట్లు నిర్ధారించింది. ఈ ఘటనపై లోక్ జనశక్తి పార్టీ(రామ్ విలాస్) జాతీయ అధికార ప్రతినిధి రితేష్ కుమార్ స్పందిస్తూ రాష్ట్రంలోని బీజేపీ ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు. ఇది రాష్ట్రంలో పాలనా వ్యవస్థ ఘోరంగా కుప్పకూలిందనడానికి నిదర్శనమని ధ్వజమెత్తారు. ప్రభుత్వం ఈ ఘటనకు బాధ్యులైనవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.