‘క్రోధాద్భవతి సమ్మోహః…
సమ్మోహాత్ స్మృతి విభ్రమః…
స్మృతిభ్రంశాద్ బుద్ధినాశో…
బుద్ధినాశాత్ప్రణశ్యతి’ అని వేల ఏళ్ల క్రితమే భగవద్గీత చెప్పింది.
కోపం ఒక్కో స్థాయినీ దాటుకుంటూ ఎలా వినాశనానికి దారితీస్తుందో చెప్పుకొచ్చింది. ఈ చివర స్థాయిని తరచూ చూడాల్సి రావడటమే ఇప్పటి దురదృష్టం.
‘ఇంటి బయటకి అడుగుపెడితే దారి పొడవునా తాగుబోతులు కనిపిస్తుంటే… సమాజంలో తాగుడు సమస్య పెరిగిందని అర్థమవుతుంది. అలాగే ఎక్కడ విన్నా దారుణమైన హత్యల
గురించిన వార్తలు వినిపిస్తుంటే… సమాజంలో హింస పెరిగిందని అర్థం’ అంటారు హరీష్ షెట్టి అనే సైకియాట్రిస్ట్.
జర్మన్ తాత్వికుడు పీటర్ స్లార్జ్ తన పుస్తకం ‘రేజ్ అండ్ టైం’లో కోపాన్ని రెండురకాలుగా విభజిస్తాడు. మొదటిది ‘అణిచిపెట్టుకున్న కోపం’. ఎన్నో రోజులుగా అసమానతను, అవమానాన్ని భరించి… అందుకు బదులు కోసం ఎదురుచూసే పరిస్థితి. అది వ్యక్తిగతం అయితే ఇంటివరకే పరిమితం అవుతుంది. కానీ సామాజికం అయితే ఉద్యమంగా మారుతుంది. ఈ ‘అణిచిపెట్టుకున్న కోపాని’కి ఓ లక్ష్యాన్ని చూపించి, అందరినీ సంఘటితం చేయగలిగే సత్తా ఉన్నవాడు నాయకుడిగా మారతాడు. కానీ కోపానికి స్పష్టమైన కారణం, లక్ష్యం అంటూ లేకపోతే! దాన్ని ‘చెదిరిన కోపం’ అంటాడు పీటర్. దీనికి ఓ స్పష్టత ఉండదు. అసహనం ఉంటుంది కానీ, అది తీరే మార్గం తోచదు. అసలు దానికి కారణం ఏంటో కూడా అర్థం కాదు. సోషల్ మీడియాలో ద్వేషపు రాతలు, ఒక్కసారిగా అపరిచితులతో గొడవ పెంచుకోవడం, చిన్నపాటి వాదనకే భౌతిక దాడికి దిగడం… లాంటి చర్యలకు ఈ అలక్షిత కోపమే మూలం. ఇంతకీ ఇలా ఎందుకు జరుగుతోంది అన్న ప్రశ్నకు సామాజిక నిపుణుల నుంచి స్పష్టమైన జవాబులు వినిపిస్తున్నాయి.
సామాజిక అసమానత: సంపద పెరుగుతున్నది, సౌకర్యాలు పెరుగుతున్నాయి అంటూ అంతా ఊదరగొట్టేస్తున్నారు. కానీ వాటితో పాటు వ్యత్యాసం పెరిగిపోతున్నదన్నది వాస్తవం. పెరుగుతున్న ఖర్చులకు సరిపడా వేతన జీవుల ఆదాయం పెరగడం లేదని నివేదికలు చెబుతున్నాయి. ఈ అసమానత తీవ్రమైన ఒత్తిడికి, ఉక్రోషానికీ గురిచేస్తున్నది.
అసహనం: ప్రపంచీకరణ పుణ్యమా అని లోకం భౌతికత దిశగా జారిపోయింది. ఓ అయిదువేలు పెట్టి ఫోన్ కొంటే అవసరం తీరుతుంది. కానీ అందులో లక్షన్నర పెట్టినా కూడా మరో కొత్త మాడల్ ఏదో ఊరిస్తున్నది. నువ్వు సమర్థుడివి, ‘మగాడివి’ అని నిరూపించుకోవాలంటే ఉన్నతమైన ఉత్పత్తులే వాడాలని ప్రకటనలు ఊదరగొట్టేస్తున్నాయి. వెరసి కష్టపడి దక్కించుకున్న వస్తువులు కూడా సంతృప్తిని ఇవ్వడం లేదు. కొనుగోళ్ల పరుగులో వెనుకడుగు వేసేందుకు పోలికలు అడ్డు వస్తున్నాయి.
ఒంటరితనం: స్నేహితులు లేనివారిలో కుంగుబాటు ఎక్కువ, పరాయి దేశంలో ఉండేవారిలో ఒంటరితనం జాస్తి, చిన్న కుటుంబాల్లో స్పర్ధలు పెరుగుతున్నాయనీ… ఇప్పటి జీవనశైలికి సంబంధించి రకరకాల విశ్లేషణలు వినిపిస్తున్నాయి. పిల్లల నుంచే ఒంటరితనం మొదలైపోతున్నది. కెరీర్లో పరుగులు పెట్టి తీరాల్సిన పరిస్థితిలో తల్లిదండ్రులు, మనోవికాసం కంటే విద్యకే ప్రాధాన్యత ఇస్తున్న గురువులు, నేస్తాలతో ఆడే సమయాన్ని కల్పించని చదువులు, సహోద్యోగులను పోటీదారులుగా మార్చేసిన ఆఫీసులు… వెరసి ఎటుచూసినా ‘నేను-నాది’ అనే ఉనికే మిగులుతున్నది. బాధ అయినా, సంతోషమైనా మరొకరితో పంచుకునే పరిస్థితి మాయమైపోయింది. ఇక మిగిలేది అసంతృప్తే కదా!
అపనమ్మకం : పేదవాడికి న్యాయం దక్కడం లేదు, అపరాధులు తప్పించుకుంటున్నారు, అవినీతి పెరిగిపోతున్నది, డబ్బున్నవాడిదే రాజ్యం… మనల్ని కాపాడాల్సిన వ్యవస్థల మీద అపనమ్మకం పెరిగిపోతున్నది. ఇందుకు విరుగుడుగా ఏం చేయాలో తెలియని అయోమయం. ఎవరినీ నిందించి లాభం లేదనే బాధ. వెరసి తెలియని కోపానికి ఆజ్యం పోస్తున్నది.
ఇవే కాదు! కాలుష్యం లాంటి తీవ్రమైన సమస్యలను నిస్సహాయంగా చూస్తుండిపోవడం, శ్రమదోపిడీని అడ్డుకోలేకపోవడం, విపరీతమైన ద్రవ్యోల్బణం… లాంటి ఎన్నో విషయాలు మనుషుల్లో అసహనాన్ని నింపుతున్నాయి. అది కోపంగా మారుతున్నది.
ఎటుచూసినా పెరుగుతున్న కోపాన్ని దాటేందుకు వ్యక్తిగతంగా ఎలాగూ ప్రయత్నిస్తాం. అదే సమయంలో మిగతా వ్యవస్థలన్నీ కూడా తమ వంతు బాధ్యత తీసుకోవాలి. న్యాయ వ్యవస్థ మీద నమ్మకం పెంచే అధికారులు; సామాజిక సమస్యల గురించి అవగాహన కల్పించి ఆ దిశగా ఓ లక్ష్యాన్ని కల్పించే సామాజిక కార్యకర్తలు; మార్కులే కాకుండా విలువలకు ప్రాధాన్యం ఇచ్చే ఉపాధ్యాయులు; పిల్లలతో తగినంత సమయం గడుపుతూ వారిని గమనించుకునే తల్లిదండ్రులు; అన్ని వాదనలనీ సమన్వయం చేసుకునే మేధావులు…. ఇలా ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యత తీసుకోవాల్సిందే. లేకపోతే ప్రతి ఇంట్లోనూ అణుచుకుని ఉన్న కోపం దేశం తీరునే మార్చేస్తుంది. గమ్యం లేకుండా చేస్తుంది.
ఫలితం అనర్థం!
లక్ష్యం లేని కోపం వల్ల అడుగడుగునా అనర్థమే! ప్రతి ఒక్కరితోను, ప్రతి సందర్భంలోను అసహనంగా ఉండటం. చిన్నపాటి గొడవకే భౌతిక దాడులకు సిద్ధపడటం, తనలో కోపానికి ఓ మార్గం చూపించేందుకు హింసాత్మక గుంపుల్లో చేరడం, వర్గరాజకీయాల్లో ఏదో ఒకవైపు చేరి ద్వేషంలో పాలుపంచుకోవడం, సోషల్ మీడియా వేదికగా తన అసహనాన్ని వెళ్లగక్కడం… ఇవన్నీ కూడా ‘సామాజిక కోపానికి’ ఫలితాలే. దాన్ని అణుచుకున్నా కూడా సమస్యలు తప్పవు. సమాజం అంతా విస్తరించి ఉన్న ఈ కోపం, వ్యక్తిగత జీవితాల మీద కూడా ప్రతికూల ప్రభావం చూపుతుంది.