సిటీబ్యూరో, జూలై 30 (నమస్తే తెలంగాణ): స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(సర్) ప్రక్రియ నగరలో మరింత వెనుకబడిపోతున్నది. గడువు సమీస్తున్నా ఇప్పటి వరకు బీఎల్వోల వద్దకు ఎన్యుమరేషన్ ఫారాలు 60 శాతం కూడా చేరలేదు. అన్ని జిల్లాల్లో బీఎల్వోలు ఇంటింటికీ తిరిగి ఎన్యుమరేషన్ ఫారాల పంపిణీ, స్వీకరణ చేపట్టారు. కానీ నగరంలో మాత్రం అందుకు భిన్నంగా పోలింగ్ కేంద్రాలకే ఓటర్లను రప్పించుకుని పంపిణీ చేశారు. వివరాలు నమోదు చేసిన ఫారాలను ఓటర్ల ఇంటికి వెళ్లి తీసుకోకుండా వారినే వచ్చి ఇవ్వాలని చెప్తున్నారు. దీంతో సర్ ప్రక్రియ నగరంలో మరింత మందకొడిగా సాగుతున్నది.
ఎలక్షన్ కమిషన్ అధికారులు, ప్రభుత్వ ఉన్నతాధికారులు బీఎల్వోలు పూర్తిస్థాయిలో సర్ ప్రక్రియకే సమయం కేటాయించాలని ఆదేశించారు. అయినా బీఎల్వోలు క్షేత్రస్థాయిలో పర్యటించకుండా పోలింగ్ కేంద్రాలకే పరిమితమవుతున్నారు. ఎన్యురేషన్ ఫారాలు ఓటర్లు తీసుకొచ్చి ఇస్తేనే తీసుకుని వివరాలు యాప్‌లో నమోదు చేస్తున్నారు. కానీ వారికి కేటాయించిన బూత్‌లో ఎంత మంది ఓటర్లు ఉన్నారు? వాళ్లంతా ఎన్యుమరేషన్ ఫారాలు తీసుకున్నారా? వాటిని తిరిగి ఎంతమంది ఇచ్చారనే వివరాలను ఏమాత్రం చూసుకోవడం లేదనే ఆరోపణలు వస్తున్నాయి. బీఎల్వోల నిర్లక్ష్యం వల్లే మిగతా జిల్లాల కంటే సిటీ వెనుకబడి ఉండటానికి కారణమనే ఆరోపణలు వస్తున్నాయి.
55 శాతానికే పరిమితమైంది..
ఎన్యుమరేషన్ ఫారాలను ఓటర్ల నుంచి స్వీకరించి ఎప్పటికప్పుడు వాటిని సంబంధిత యాప్‌లో నమోదు చేస్తున్నారు. గ్రామీణ జిల్లాల్లో ఈ ప్రక్రియ 80 శాతానికి పైగా పూర్తయ్యింది. కానీ నగరంలో 55 శాతానికే పరిమితమైంది. ఎన్యుమరేషన్ ఫారాల స్వీకరణ గడువు ఈనెల 25కే ముగిసినా.. చాలా ప్రాంతాల్లో సగానికి పైగా పూర్తికాకపోవడంతో ఆగస్టు 3 వరకు పెంచారు. దీంతో ఆయా జిల్లాల్లో ఫారాల స్వీకరణ, ఓటర్ల వివరాల నమోదు 80 శాతం కంటే ఎక్కువే పూర్తయ్యింది. ఆయా జిల్లాల్లో బీఎల్వోలు ప్రతి ఓటరును తమ బాధ్యతగా తీసుకుని వివరాల స్వీకరణ, నమోదును పకడ్బందీగా నిర్వహిస్తున్నారు.
కానీ నగరంలో దానికి పూర్తి విరుద్ధంగా బీఎల్వోలు వ్యవహరిస్తుండటంతో నాలుగు రోజుల సమయానికి ఇంకా 45 శాతం డిజిటలీకరణ పెండింగ్‌లో ఉంది. ఇదే పరిస్థితి కొనసాగితే గడువు ముగిసే సమయానికి 60 శాతం కూడా పూర్తయ్యే పరిస్థితులు కనిపించడంలేదు. ఇప్పటికైనా అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ ఈనాలుగు రోజుల్లో సాధ్యమైనంత వరకు ఓటర్ల వివరాలు స్వీకరించాలని నగర ప్రజలు కోరుతున్నారు.