Ram Charan | గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, ప్రముఖ దర్శకుడు సుకుమార్ కాంబినేషన్లో వస్తున్న ‘RC17’ సినిమాపై టాలీవుడ్లో భారీ అంచనాలు ఉన్నాయి. ‘రంగస్థలం’ లాంటి పెద్ద హిట్ తర్వాత ఈ ఇద్దరి కలయికలో సినిమా వస్తుండటంతో అభిమానులు చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే తాజా సమాచారం ప్రకారం, దసరా పండగ సందర్భంగా అక్టోబర్ 20న ఈ సినిమా పూజా కార్యక్రమాలను ఘనంగా నిర్వహించబోతున్నట్లు తెలుస్తుంది. ఆ తర్వాత నవంబర్ నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలుపెట్టాలని సుకుమార్ ప్లాన్ చేస్తున్నారు.
ఈ సినిమా కోసం రామ్ చరణ్ తన లుక్‌ను మార్చుకుంటున్నారు. ‘పెద్ది’ సినిమా కోసం ఒక ప్రత్యేక లుక్‌లో కనిపించిన ఆయన, సుకుమార్ సినిమా కోసం మరింత బరువు తగ్గుతూ స్లిమ్‌గా మారుతున్నారు. ఇటీవల బేగంపేట ఎయిర్‌పోర్ట్‌లో ఆయన కనిపించిన తీరు చూసి అభిమానులు ఈ మేకోవర్ గురించి మాట్లాడుకుంటున్నారు. సుకుమార్ సినిమాలను చాలా పకడ్బందిగా తెరకెక్కిస్తారు కాబట్టి, షూటింగ్ మరియు పోస్ట్ ప్రొడక్షన్ పనులకు తగినంత సమయం కేటాయించి సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని చూస్తున్నారు. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను అధికారికంగా వెల్లడించనున్నారు.