ఇంజినీరింగ్ పట్టాతో బయటకు వస్తున్నరు. కానీ వాళ్లకు ఉద్యోగం చేసే స్కిల్ లేదు. తెల్లకాగితం ఇస్తే దరఖాస్తు ఫారం కూడా నింపలేరు. ఇది క్రిమినల్ వేస్ట్. వాడు ఇంజినీరింగ్ చదువుకున్నానని చిన్న జాబ్‌కు పోడు. స్కిల్స్ నేర్చుకోడు. పెద్ద చదువు చదివిండని పేరెంట్స్ అనుకుంటరు.
నాకు తెలిసి జైపాల్‌రెడ్డి, కేశవరావు (కేకే) ఇద్దరు మాత్రమే తెలంగాణలో మేధావులు. వీరిద్దరికే తెలంగాణ సమాజంపై సంపూర్ణమైన అవగాహన ఉన్నది. నాకు తెల్వని వాళ్లు మేధావులు ఉంటే ఉండొచ్చు.
టీచర్ల కుటుంబాలు ఆర్థికంగా బాగానే ఉన్నాయి కదా. అత్యంత దారుణమైన స్థితిలో ఏమీలేవు. ఆకలితో చచ్చిపోతలేవు. ఐఏఎస్‌లను ట్రాన్స్ఫర్ చేయడం ఈజీ.. కానీ, టీచర్లను ట్రాన్స్ఫర్ చేయగలమా? దేశ ప్రధానే స్వయంగా నాతో కలిసి పనిచెయ్ భవిష్యత్తు బాగుంటుందని చెప్పే పరిస్థితి వచ్చిందంటే కారణం ఉపాధ్యాయులే.
– సీఎం రేవంత్ రెడ్డి
హైదరాబాద్, జూలై 30(నమస్తే తెలంగాణ) : మన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మళ్లీ తన నోటికి పనిచెప్పారు. ‘పనిచేయరు కానీ జీతాలు మాత్రం తీసుకుంటారని మొన్న బీఎల్వోలపై నోరుపారేసుకున్న ఆయన.. ఇప్పుడు ఇంజినీరింగ్ స్టూడెంట్స్‌ను ‘క్రిమినల్ వేస్ట్’ అంటూ వాళ్ల ఇజ్జత్ తీసే వ్యాఖ్యలు చేశారు. ‘సంవత్సరానికి1.10 లక్షల మంది విద్యార్థులు ఇంజినీరింగ్ పట్టాతో బయటకు వస్తారు కానీ ఒక్కడికీ జాబ్ చేసే స్కిల్ లేదు. వాళ్లపై పెట్టిన ఖర్చంతా వృథా. తెల్లకాగితం ఇచ్చి ఉద్యోగం కోసం అప్లికేషన్ ఫారం ఇస్తే పూరించే పరిస్థితిలో లేరు’ అంటూ కించపరిచేలా మాట్లాడారు. విదేశాలకు వెళ్లొచ్చిన ఉపాధ్యాయులతో గురువారం హైదరాబాద్ ఎంసీఆర్హెచ్ఆర్డీలో నిర్వహించిన సమావేశంలో సీఎం రేవంత్‌రెడ్డి ఈ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇంజినీరింగ్ స్టూడెంట్స్‌ను తీసిపారేసినట్టు సీఎం చేసిన వ్యాఖ్యలపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇంత దారుణంగా అవమానిస్తారా అంటూ నిప్పులు చెరుగుతున్నారు.
యాదవ, కురుమ సోదరులను సైతం సీఎం రేవంత్‌రెడ్డి అవమానించారు. వారికి ఆస్తులుంటాయి కానీ చదువు, జ్ఞానం ఉండదనేలా వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ‘మా యాదవ, కురుమ సోదరులు వారి వద్ద 30-40 ఎకరాల భూమి, 100-200 మేకలు ఉంటాయి. కొందరి వద్ద కేజీ బంగారం కూడా ఉంటుంది. కానీ పిల్లల్ని చదివించకపోవడం వల్ల సమాజం ఎటువైపు పోతుందో తెలుసుకునే అవకాశమే వారికి లేకుండా పోయింది.’ అంటూ వ్యాఖ్యానించారు. సీఎం వ్యాఖ్యలపై యాదవ, కురుమ సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. తమ కుల వృత్తిని అవమానించేలా సీఎం వ్యాఖ్యలు చేయడంపై మండిపడుతున్నాయి.
గతంలో మాదిరిగానే తమ ఈ ప్రభుత్వంలోనూ సంక్షేమానికి ఉన్న ప్రాధాన్యత విద్యకు లేదని సీఎం చెప్పుకొచ్చారు. ఓట్లను సాధించుకొనే ఆలోచనలకు అనుగుణమైన నిర్ణయాలు ప్రభుత్వ మొదటి ప్రాధాన్యత, కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా విద్యను నిర్లక్ష్యం చేయొద్దన్నారు. అందుకే విద్యాశాఖను తన వద్ద పెట్టుకున్నానని, సమూల సంస్కరణలు తీసుకొస్తున్నానని పేర్కొన్నారు. తన కృషి వల్లే ప్రభుత్వ పాఠశాలల్లో అడ్మిషన్లు పెరిగాయని కితాబిచ్చుకున్నారు. పిల్లలను ప్రైవేట్ స్కూల్లో చదివించే తల్లిదండ్రులు ఏటా గరిష్ఠంగా రూ.50వేలకు మించి ఖర్చు చేయడం లేదని, కానీ ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులపై ప్రభుత్వం ఏటా రూ.1.08 లక్షలు ఖర్చు చేస్తున్నదని తెలిపారు. అయితే ప్రైవేట్ పాఠశాలల్లో ఫీజులు ఏ స్థాయిలో ఉన్నాయనే విషయంపై సీఎం రేవంత్‌రెడ్డికి అవగాహన లేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అదే విధంగా ప్రభుత్వ పాఠశాలల పిల్లలపై సీఎం చెప్పిన లెక్క గురుకుల విద్యాలయాల్లోనిదని, చదువు, హాస్టల్‌తో కలిపి రూ.1.08 లక్షలు ఖర్చవుతుందని, కేవలం డే స్కాలర్‌కు కాదనే విషయం తెలుసుకోవాలని సూచిస్తున్నారు. తనను విద్యాశాఖ నుంచి తప్పుకోవాలని డిమాండ్ చేస్తున్నారని, తాను ఎందుకు రాజీనామా చేయాలని ప్రశ్నించారు. మంచిగా పర్ఫామెన్స్ చేసినందుకు రాజీనామా చేయాలా? అని ప్రశ్నించారు. తిట్టు తినడానికే విద్యాశాఖ తీసుకున్నట్టు ఉన్నదంటూ వ్యాఖ్యానించారు.

ఇంజినీరింగ్ విద్యార్థులు, ఉపాధ్యాయులను కించపరిచే వ్యాఖ్యలు చేసిన సీఎం రేవంత్‌రెడ్డి మరో అడుగు ముందుకేసి ఏకంగా తెలంగాణ మేధావులను సైతం కించపరిచే వ్యాఖ్యలు చేయడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. తనకు తెలిసి జైపాల్‌రెడ్డి, కేశవరావు(కేకే) ఇద్దరు మాత్రమే తెలంగాణ మేధావులంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. వీరిద్దరికి మాత్రమే తెలంగాణ సమాజంపై సంపూర్ణమైన అవగాహన ఉన్నదంటూ కితాబిచ్చారు. తనకు తెలియని వాళ్లు మేధావులు ఉండొచ్చంటూ మరోసారి తన నోటి దురుసును ప్రదర్శించారు. సీఎం రేవంత్‌రెడ్డి తన నోటి దురుసుతో తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ సార్‌ను తీవ్రంగా అవమానించారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
తన పెద్దన్న తర్వాత అన్న అంటూ అందెశ్రీని సీఎం రేవంత్‌రెడ్డి కొనియాడారు. అలాంటి వ్యక్తికి కూడా తెలంగాణపై సమాజంపై అవగాహన లేదా అనే ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. తెలంగాణ కోసం సర్వం త్యాగం చేసిన ఎంతోమంది ప్రొఫెసర్లు, కవులు, కళాకారులు, ఉద్యమవీరులందరినీ కించపరిచేలా, వారి త్యాగాన్ని తక్కువ చేసేలా సీఎం రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలు చేశారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అసలు సీఎం రేవంత్‌రెడ్డికి తెలంగాణ గురించి తెలిస్తే కదా తెలంగాణ మేధావుల గురించి తెలిసేదనే మండిపడుతున్నారు. ఆయన ఏనాడైనా జై తెలంగాణ అన్నారా?, తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారా? అంటూ నిలదీస్తున్నారు. అందుకే నిజమైన తెలంగాణ మేధావులు, పోరాట యోధులెవరూ ఆయనకు కనిపించబోరని మండిపడుతున్నారు.
సమావేశంలో టీచర్లు, వారి కుటుంబాలపైనా సీఎం రేవంత్‌రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఐదేండ్లపాటు టీచర్ల పూర్తి సమయాన్ని ఉద్యోగానికే కేటాయించాలని కోరిన సీఎం.. వారి కుటుంబాలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. టీచర్ల కుటుంబాలు ఆకలితో చచ్చిపోయే స్థితిలో ఏం లేవు కదా? అంటూ వ్యాఖ్యలు చేశారు. ‘మనం ఇబ్బందుల్లో ఏం లేము.. ఆకలితో ఏం చచ్చిపోతలేం.. కుటుంబాలు కూడా అత్యంత దారుణమైన స్థితిలో ఏం లేవు. టీచర్లంతా సమాజంలో గౌరవంగా, ఆర్థికంగా ఉన్నారు.’ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం వ్యాఖ్యలపై ఉపాధ్యాయులు, ఉపాధ్యాయ సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేస్తున్నాయి. తమ కుటుంబాలు ఆకలితో చావాలని కోరుకుంటున్నారా? అంటూ ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. ముఖ్యమంత్రి హోదాలో ఇలాంటి వ్యాఖ్యలు చేయడం దారుణమంటున్నారు.
ఇంకా సీఎం మాట్లాడుతూ… ఐఏఎస్‌లను ట్రాన్స్ఫర్ చేయడం ఈజీ అని, కానీ టీచర్లను ట్రాన్స్ఫర్ చేయగలమా? అంటూ ప్రశ్నించారు. తాను ఏమైనా చెబితే ఉపాధ్యాయ సంఘాలు తనపై కోపానికొస్తాయని అన్నారు. కాబట్టి ఉపాధ్యాయులు సంఘాల మాటలు కూడా వినొద్దని, వారి సమస్యలన్నీ తనకు అప్పగించాలని సూచించారు. దేశ ప్రధానే స్వయంగా తనతో కలిసి పనిచెయ్ భవిష్యత్ బాగుంటుందని చెప్పే పరిస్థితికి కారణం ఉపాధ్యాయులేనని అని పేర్కొన్నారు. ఒక మండల్‌ను ఒక క్లస్టర్‌గా తీసుకొని, ఆ మండలానికి బెస్ట్ ఎడ్యుకేషన్ కోసం ఏం చేయాలో డిసెంబర్‌లోగా నివేదిక ఇవ్వాలని సూచించారు. ఇక విద్య నైపుణ్యం కాదని, లాంగ్వేజ్ నాలెడ్జ్ కాదని సెలవిచ్చారు. అమెరికాలో బిచ్చమెత్తుకునేటోడు కూడా ఇంగ్లిష్ మాట్లాడుతాడని.. అయితే అమెరికాలో వారి భాష ఇంగ్లిష్ కాబట్టి బిచ్చమెత్తుకునేవాడైనా, ఇంట్లో పని మనుషులైనా ఇంగ్లిషే మాట్లాడుతారని, తెలుగు మాట్లాడరంటూ సోషల్ మీడియాలో సెటైర్లు వేస్తున్నారు.