రాయపోల్ : రైతుల అమాయకత్వాన్ని ఆసరా చేసుకుని నకిలీ విత్తనాలు ( Fake seeds ) విక్రయిస్తే ఫర్టిలైజర్ వ్యాపారులపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని తొగుట సీఐ షేక్ లతీఫ్ (CI Latif ) , దౌల్తాబాద్ ఎస్సై శ్రీరామ్ ప్రేమ్ దీప్ , మండల వ్యవసాయ అధికారి సత్య అన్వేష్ అన్నారు. దౌల్తాబాద్ మండల కేంద్రంలోని ఫర్టిలైజర్ దుకాణాలను వారు శనివారం తనిఖీ చేశారు.
అనంతరం విత్తన దుకాణ వ్యాపారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నకిలీ విత్తనాలను అమ్మితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రైతులు ఎరువులు, విత్తనాలు, పురుగుమందులు తీసుకునే ముందు ఫర్టిలైజర్ వ్యాపారుల వద్ద ఎమ్మార్పీ ధరల పట్టిక చూసి తీసుకోవాలని సూచించారు. ప్రతి షాపు నుంచి కచ్చితంగా రసీదులు తీసుకోవాలని సూచించారు.
ఫర్టిలైజర్ వ్యాపారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తే సహించే ప్రసక్తి లేదని హెచ్చరించారు. నాణ్యమైన విత్తనాలు వానాకాలం సీజన్లో రైతులకు అందించాలని, కాలం చెల్లిన విత్తనాలు అందించి రైతులను మోసం చేసే ఫర్టిలైజర్ వ్యాపారులపై కఠిన చర్యలు తప్పవని మరోసారి హెచ్చరించారు. ప్రతి ఫర్టిలైజర్ దుకాణంలో ధరల పట్టిక ఉండాలని, స్టాక్ రిజిస్టర్ మెయింటెనెన్స్ చేయాలని, ఎరువులు, విత్తనాలు బ్లాక్ మార్కెటుకు తరలిస్తే చూస్తూ ఊరుకోబోమని తెలిపారు.