Ustaad Bhagat Singh | పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా, దర్శకుడు హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ విడుదలకు ఇక కేవలం రెండు రోజులే మిగిలాయి. దీంతో అభిమానుల్లో ఉత్సాహం మరింత పెరిగింది. ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొనగా, విడుదలకు ముందు వస్తున్న అప్డేట్లు మరింత హైప్ క్రియేట్ చేస్తున్నాయి. తాజాగా దర్శకుడు హరీష్ శంకర్ సోషల్ మీడియా వేదికగా సినిమా ఫైనల్ అవుట్‌పుట్‌పై తన ఆనందాన్ని పంచుకున్నారు. మూవీ పూర్తిగా సిద్ధమైందని, ఫైనల్ వెర్షన్ చూసిన తర్వాత తాను చాలా సంతృప్తిగా ఉన్నానని తెలిపారు. ఈ సినిమా అభిమానులకు మాస్ ఎంటర్టైన్మెంట్ అందిస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
ఇక మరోవైపు ఓవర్సీస్ మార్కెట్లో కూడా ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ఇప్పటికే ప్రభంజనం సృష్టిస్తోంది. ముఖ్యంగా నార్త్ అమెరికాలో ప్రీ-సేల్స్ వేగంగా పెరుగుతున్నాయి. విడుదలకు ముందే అక్కడి అడ్వాన్స్ బుకింగ్స్ 250K డాలర్ల మార్క్ దాటాయి. ఇంకా ప్రీమియర్ షోలకు ఒక రోజు సమయం ఉండగానే ఈ స్థాయి వసూళ్లు రావడం ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యపరుస్తోంది. ఈ ట్రెండ్ కొనసాగితే ప్రీమియర్లతోనే భారీ ఓపెనింగ్స్ నమోదయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తోంది. సినిమాలో శ్రీలీల, రాశీ ఖన్నా హీరోయిన్లుగా నటిస్తుండగా, పార్థిబన్, గౌతమి, రావు రమేష్, కేఎస్ రవికుమార్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. పవన్ కళ్యాణ్ మాస్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నట్టు ఇప్పటికే ప్రచారం జరుగుతోంది.
సంగీత పరంగా కూడా ఈ సినిమా మంచి హైప్ వచ్చింది. దేవి శ్రీ ప్రసాద్ అందించిన పాటలు ఇప్పటికే అభిమానులను ఆకట్టుకుని చార్ట్బస్టర్లుగా నిలిచాయి. ఇక బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌ను థమన్ అందించడం సినిమాకు మరో ప్లస్ పాయింట్‌గా మారింది. థమన్ ఇచ్చిన పవర్ఫుల్ స్కోర్ యాక్షన్ సన్నివేశాలను మరింత ఎలివేట్ చేస్తుందని చిత్ర బృందం చెబుతోంది. మరో ముఖ్యమైన అంశం టికెట్ ధరలు. సాధారణ ప్రేక్షకులకు అందుబాటులో ఉండేలా ధరలను నిర్ణయించడంతో సినిమా మరింత పెద్ద ఓపెనింగ్స్ సాధించే అవకాశాలు ఉన్నాయని ట్రేడ్ విశ్లేషకులు భావిస్తున్నారు. భారీ క్రేజ్, ఫ్యాన్స్ ఉత్సాహం, అడ్వాన్స్ బుకింగ్స్ అన్ని కలిసివస్తే ‘ఉస్తాద్ భగత్ సింగ్’ బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టించే అవకాశాలు ఉన్నాయని సినీ వర్గాలు అంచనా వేస్తున్నాయి.