Dune 3 First Look | హాలీవుడ్ సెన్సేషనల్ మూవీ ‘డూన్’ (Dune) ఫ్రాంచైజీ నుంచి అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ‘డూన్: పార్ట్ త్రీ’ (Dune: Part Three) ఫస్ట్ లుక్ వచ్చేసింది. ఈ చిత్రంలో ప్రధాన నటుడు ఆస్కార్ నామినేటేడ్ టిమోతీ చాలమెట్ తన ఇన్స్టాగ్రామ్ వేదికగా ఈ క్రేజీ అప్డేట్ను పంచుకున్నారు. ఈ మూడవ భాగం ఫ్రాంక్ హెర్బర్ట్ రాసిన ‘డూన్ మెస్సయ్య’ (Dune Messiah) నవల ఆధారంగా తెరకెక్కుతోంది. ఫస్ట్ లుక్ పోస్టర్లో టిమోతీ చాలమెట్ (పాల్ అట్రిడెస్) చాలా ఇంటెన్స్ లుక్‌లో కనిపిస్తున్నారు. మునుపటి భాగాల కంటే ఇందులో ఆయన పాత్ర మరింత వైల్డ్‌గా ఉండబోతున్నట్లు, ముఖంపై యుద్ధ గాయాలతో గంభీరంగా కనిపిస్తోంది. దర్శకుడు డెనిస్ విల్నెయువ్ ఈ కథను రెండో భాగం ముగిసిన 12 ఏళ్ల తర్వాత నుంచి చూపించబోతున్నట్లు సమాచారం.
ఈ సినిమాలో మరో ప్రధాన ఆకర్షణ ట్విలైట్ ఫేమ్ రాబర్ట్ ప్యాటిన్సన్ (Robert Pattinson). ఆయన ఈ చిత్రంలో విలన్‌గా కనిపించబోతున్నట్లు తెలుస్తుంది. ఫస్ట్ లుక్ పోస్టర్లలో ఆయన లుక్ కూడా నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది. వీరితో పాటు, జెండయా, రెబెక్కా ఫెర్గూసన్, ఫ్లోరెన్స్ పగ్, అన్యా టేలర్-జాయ్, జాసన్ మోమోవా తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రం డిసెంబర్ 18న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.