అమరావతి : భక్తుల మనోభావాలతో ఆడుకుంటున్న ఏపీ సీఎం చంద్రబాబు( Chandra Babu ) కు దేవుడి పట్ల భక్తి లేదని, శ్రద్ధ అంతకన్నా లేదని వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ( YS Jagan Mohan Reddy ) ఆరోపించారు. పవిత్రమైన తిరుమల( Tirumala ) ను స్వార్ధ రాజకీయాలకు వేదికగా మార్చారని ట్విట్టర్లో విమర్శించారు.
ఒక బాధిత మహిళ ఎన్నికలకు ముందే చంద్రబాబుకు లేఖ రాస్తూ, బీఆర్ నాయుడు మోసం చేశాడని, తన జీవితంతో ఆడుకున్నాడని ఫిర్యాదు చేస్తే ఆరోపణలున్న వ్యక్తికే టీటీడీ చైర్మన్‌గా నియమించారని పేర్కొన్నారు. ఆలయ ప్రతిష్ఠను, పవిత్రతను కాపాడే వ్యక్తులు, దేవుడి పట్ల భక్తి ఉన్నవారు ఎవరైనా ఇలా చేస్తారా? ఆలయ పవిత్రతను కాపాడాలన్న ఉద్దేశం ఉంటే ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటారా? అంటూ ప్రశ్నించారు.
దేవుడిపట్ల భయం కూడా లేదని చంద్రబాబుతో మరోసారి రుజువైందని వెల్లడించారు.
లడ్డూలో వాడే నెయ్యి క్వాలిటీ బాగోలేదని చంద్రబాబుగారి హయాంలోనే టీటీడీ ల్యాబ్ తిప్పి పంపినా, మళ్లీ అవే క్వాలిటీలేని నెయ్యి ట్యాంకర్లు టీటీడీకి తరలించి లడ్డూలో వాడారని సీబీఐ సిట్ నివేదికలో పేర్కొన్నారని వివరించారు.
తిరుమల లడ్డూ ప్రసాదం విషయంలో తప్పు చేసి, దాన్ని వేరొకరిమీదకు నెట్టి, మళ్లీ దానిమీద రాజకీయ దుమారం రేపుతూ, ఆ నెయ్యితోనే స్కాంలు చేస్తున్నాడని ఆరోపించారు. హెరిటేజ్‌కి చెందిన మాన్యుఫ్యాక్చరింగ్ కంపెనీ, ఇందాపూర్ డెయిరీకి, కిలో నెయ్యి రూ.658లకు, 2025లో అమ్ముకునేందుకు కట్టబెట్టి, లాభాలు ఆర్జిస్తూ, స్కాంలు చేస్తూ టీటీడీకి నెయ్యి సరఫరాను తన సొంత ఆదాయ మార్గంగా మార్చుకున్నారని విమర్శించారు.