MLA Kotha Prabhakar Reddy | సిద్దిపేట అర్బన్, జూన్ 02 : కాంగ్రెస్ ప్రభుత్వం పథకాల పేరుతో ప్రజలను మోసం చేస్తుందని, కాంగ్రెస్ పథకాలను ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి అన్నారు. సోమవారం తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సిద్దిపేట అర్బన్ మండల పరిధిలోని పొన్నాల వద్ద గల బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో జాతీయ జెండాను ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి ఆవిష్కరించారు. ఈ మేరకు ప్రజలకు, బీఆర్ఎస్ నాయకులకు కొత్త ప్రభాకర్‌రెడ్డి ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.
అనంతరం బీఆర్ఎస్ నాయకులతో కలిసి బీఆర్ఎస్ పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కొత్త ప్రభాకర్‌రెడ్డి మాట్లాడుతూ.. రేవంత్‌రెడ్డి ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అట్టర్ ఫ్లాఫ్ అవుతున్నాయని, యువతకు దగ్గరవుదామని రాజీవ్ యువ వికాసం పేరుతో డ్రామా మొదలు పెట్టారన్నారు. రాజీవ్ యువ వికాసం పథకం వాయిదా వేయడమంటే ప్రభుత్వం సరిగా పని చేయడం లేదని అర్థమన్నారు.
ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రి నడుపుతున్నాడా..? మంత్రులు నడుపుతున్నారా..? లేక ఎమ్మెల్యేలు నడుపుతున్నరా..? అర్థం కాని పరిస్థితి ఉందన్నారు. ఎంతో మంది యువత ఎన్నో డబ్బులు ఖర్చు పెట్టుకొని యువ వికాసానికి దరఖాస్తు చేసుకున్నట్లు తెలిపారు. గ్రామాల్లో ఇందిరమ్మ ఇండ్లు కాంగ్రెస్ నాయకులు మాత్రమే తీసుకుంటున్నారని, ఇందిరమ్మ ఇండ్లు చిన్నగా ఉండటంతో ప్రజలు తిరస్కరిస్తున్నట్లు తెలిపారు. కాంగ్రెస్ వాళ్లకు దమ్ము, ధైర్యం ఉంటే బీఆర్ఎస్ నాయకులతో పోరాటం చేయాలి కానీ, ప్రజలను మోసం చేయకూడదన్నారు. మీకు చేతకాకపోతే మమ్మల్ని సూచనలు అడగండి.. లేదంటే ముఖ్యమంత్రిని మార్చి కొత్త ముఖ్యమంత్రిని తెచ్చుకోవాలని ధ్వజమెత్తారు.
మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీశ్‌రావుల ఆదేశాలతో 14 సంవత్సరాలు సుధీర్ఘ పోరాటం చేసిన ఘనత సిద్దిపేట గడ్డకే దక్కుతుందన్నారు. బీఆర్ఎస్ పార్టీ వస్తేనే తెలంగాణ అభివృద్ది చెందుతుందని ప్రజలు నమ్ముతున్నారని అన్నారు. వచ్చే స్థానిక ఎన్నికల్లో అన్ని స్థానాల్లో గులాబీ జెండా ఎగురువేసేలా నిరంతరం పని చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ కడవేర్గు మంజుల రాజనర్సు, సిద్దిపేట పట్టణ అధ్యక్షుడు కొండం సంపత్‌రెడ్డి, బీఆర్ఎస్ నాయకులు వేలేటి రాధాకృష్ణశర్మ, రణం శ్రీనివాస్, వెంకట నర్సింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Medak | ఉద్యోగ, ఉపాధ్యాయుల హామీలను ప్రభుత్వం నెరవేర్చాలి: టీజీసీపీఎస్ ఈయూ నేత నర్సింహులు
Textbooks | పాపన్నపేట మండలంలో పాఠ్య పుస్తకాలు పంపిణీ చేసిన ఎంఈవో ప్రతాప్ రెడ్డి