హుస్నాబాద్ టౌన్, జూన్ 2: నియోజకవర్గాన్ని సస్యశ్యామలం చేసే గౌరవెల్లి రిజర్వాయర్ పనులు నత్తనడక సాగుతున్నాయని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే వొడితల సతీశ్ కుమార్ (Vodithala Satish Kumar) విమర్శించారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం పురస్కరించుకొని హుస్నాబాద్‌లోని పార్టీ కార్యాలయంలో సోమవారం జాతీయ జెండా, బీఆర్ఎస్ పతాకాన్ని ఆయన ఆవిష్కరించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ గౌరవెల్లి రిజర్వాయర్‌తో మెట్ట ప్రాంతం సస్యశ్యామలమవుతుందని భావించి రిజర్వాయర్ ఎత్తును పెంచడం జరిగిందన్నారు. మంత్రి పొన్నం ప్రభాకర్ ఎన్నికల సమయంలో భూములు కోల్పోయిన రైతులకు ఎకరాకు రూ.30 లక్షలు ఇస్తామని ప్రకటించాడని, తీరా చర్చల్లో మాత్రం రూ.17 లక్షలు మాత్రమే ఇస్తామని చెప్పడం ఏమిటని ప్రశ్నించారు.
సీఎం రేవంత్ రెడ్డి నియోజకవర్గంలో భూములు కోల్పోతున్న రైతులకు ఇస్తున్న పరిహార మాదిరిగానే హుస్నాబాద్ ప్రాంతంలో భూములు కోల్పోతున్న రైతులకు పరిహారం ఇల్లు, ఇంటికో ఉద్యోగం ఇవ్వాలని సతీష్ కుమార్ డిమాండ్ చేశారు. నియోజవర్గంలో బీఆర్ఎస్ మంజూరు చేసిన పథకాలు మాత్రమే కొనసాగుతున్నాయని మంత్రిగా ఈ నియోజకవర్గంలో కొత్తగా చేపట్టిన పథకాలు ఏవీ కనిపించడం లేదన్నారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం కోసం ఉద్యమించి, నిధులు, నియామకాలు చేసుకొని ప్రజల సంక్షేమం కోసం బీఆర్ఎస్ ప్రభుత్వం కృషి చేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఇంజినీరింగ్ కళాశాల సైతం ప్రజలకు అందుబాటులో కాకుండా విద్యార్థులకు ఇబ్బందికరంగా మారిన ప్రాంతంలో నిర్మాణం చేపట్టడాన్ని మానుకోవాలని సూచించారు. ఈ విలేకరుల సమావేశంలో హనుమకొండ జడ్పీ మాజీ చైర్పర్సన్ సుధీర్ కుమార్, బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి కర్ర శ్రీహరి, పార్టీ నాయకులు పాల్గొన్నారు.