హైదరాబాద్, మార్చి 9 (నమస్తే తెలంగాణ) : అక్రెడిటేషన్ల సంఖ్య పెంపుతోపాటు రాష్ట్ర కమిటీ మొదటి సమావేశంలో చర్చించిన పలు అంశాలపై ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించామని తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. మనమంతా వర్కింగ్ జర్నలిస్టులమని.. డెస్క్, ఫీల్డ్ అనే తేడా ఏమీ లేదని స్పష్టంచేశారు. సోమవారం డెస్క్ జర్నలిస్టుల సంఘం(డీజేఎస్) బాధ్యులు శ్రీనివాస్‌రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. రెండోసారి మీడియా అకాడమీ చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టిన ఆయనను శుభాకాం క్షలు తెలిపారు.
మీడియా అకాడమీ చైర్మన్ మాట్లాడుతూ.. అర్హులందరికీ గుర్తింపు కార్డులు అందజేస్తామని తెలిపారు. అయితే, కొన్ని మీడియా సంస్థలు అక్రెడిటేషన్ల కేటాయింపులో అక్రమాలకు పాల్పడుతున్నట్టు తమ దృష్టికి వచ్చిందని, వీటికి అడ్డుకట్ట వేసేందుకు తగిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. అక్రెడిటేషన్ కార్డుల జారీలో మహిళా జర్నలిస్టులకు 33 శాతం కోటా వర్తింపజేస్తామని స్పష్టంచేశారు. జర్నలిస్టు హెల్త్‌కార్డులు ప్రైవేట్ దవాఖానల్లో చెల్లుబాటయ్యేలా చర్యలు తీసుకోవాలని, జిల్లా అక్రెడిటేషన్ కమిటీల్లో డెస్క్ జర్నలిస్టులకు స్థానం కల్పించాలని డీజేఎస్ బాధ్యులు కోరగా, హెల్త్‌కార్డుల విషయం ప్రభుత్వ పరిశీలనలో ఉన్నదని, జిల్లా కమిటీల్లో డెస్క్ జర్నలిస్టులకు స్థానంపై పరిశీలిస్తామని తెలిపారు. కార్యక్రమంలో డీజేఎస్ ప్రతినిధులు ఉపేందర్, రాజారాం, వెంకటరమణ, సైదిరెడ్డి, వెంకటేశ్, నరేందర్ పాల్గొన్నారు.