ఆనంద స్వరూపంతో అలరారే శివ సౌందర్యానికీ, అప్రమేయమైన పరమశివుడి తత్వానికీ ఆలంబనగా నిలిచే శుభపర్వమే శివరాత్రి. పరమశివుడు ఆవిర్భవించిన రోజు, దేవ గణానికి సృష్టి, స్థితి, లయల తత్వసారాన్ని వివరించిన మహోన్నతమైన రోజు మహా శివరాత్రి.
శివం శివకరం శాంతం
శివాత్మానం శివోత్తమం
శివమార్గ ప్రణేతారం
ప్రణతోస్మి సదాశివమ్
ఈ విశ్వాన్ని ఆనందధామం చేసి, జీవజాతికి మోక్షాన్ని ప్రసాదించే సద్యోజాతుడే శివుడూ.. భవుడు.. శంకరుడు. శివుడంటే శక్తి కలిగిన వాడని అర్థం. తనను తానే ఉద్భవించుకునే మహాశక్తిమంతుడు పరమశివుడు. సమస్త జగత్తునూ తనలో లీనం చేసుకునే అద్భుతమూర్తి స్వరూపం ఆయన. ఆ శివమూర్తి పరతత్వంతో లోకానికి బోధ చేస్తూ లింగాకారుడై ఉద్భవించిన మహత్తర పర్వదినం శివరాత్రి. మాఘమాసంలో వచ్చే బహుళ చతుర్దశి నాడు శివరాత్రి జరుపుకోవడం ఆనవాయితీ. ప్రతి నెలా బహుళ చతుర్దశి శివుడికి ప్రీతిపాత్రమైంది. అందుకే దానిని మాస శివరాత్రి అంటారు. వాటిలో మణివంటి రోజు మహా శివరాత్రి. అదే మాఘ బహుళ చతుర్దశి.
అన్ని పండుగలూ పగటిపూట జరుపుకోవడం మన సంప్రదాయం. అయితే రాత్రి పర్వంగా పేరుగాంచినదే మహాశివరాత్రి. అంతర్ముఖమైన ధ్యానస్థితిలో బయటి ప్రపంచాన్ని మరచి శివైక్యం చెందే జాగృత చైతన్య ప్రయాణమే రాత్రి. అలసిన జీవితం రాత్రిపూట సేదతీరుతుంది. జ్ఞాన ధ్యాన చైతన్యం కూడా రాత్రిలోనే సాధ్యపడుతుంది. రాత్రి సాధన జరుపవలసిన ప్రధానమైన ఈ పండుగ ‘శివ-రాత్రి’ శివుడి రాత్రిగా పేరుగాంచింది. శివనామ స్మరణ, బిల్వదళార్చన, అభిషేకం, జాగరణ… శివరాత్రి రోజు మనం సమర్పించుకోగల నీరాజనాలు. జగత్సరూపుడైన భోళాశంకరుడు ఫలం, పత్రం, పుష్పం, తోయం.. ఏది భక్తితో సమర్పించినా స్వీకరిస్తాడు.. దీవిస్తాడు. పత్రాలు, నీరే ఆయనకు ప్రియం. భక్తి నిండిన హృదయం ఉంటే చాలు.. పరమేశ్వరుడి హృదయంలో చోటు దక్కినట్టే!
ఓం నమః శంభవేచ
మయోభవేచ నమః శంకరాయచ
మయస్కరాయచ నమః
శివాయచ శివతరాయచ
యజుర్వేదంలో వచ్చే మహామంత్రం ఇది. ‘ఓం నమఃశివాయ’ అనే పంచాక్షరీ మంత్రం సకల ప్రాణులకూ సర్వశుభాలూ అందించే పరమేశ్వరుడి దీవెనలు పొందే సోపానం. బిల్వదళం, రుద్రాక్ష, భస్మం, అభిషేకం శివుడికి ప్రీతిపాత్రాలు. సర్వలోకాధిపతి అయినా, ఐశ్వర్యాలు అందించే దేవదేవుడైనా విభూతిని ధరించి, చర్మవస్ర్తాలు చుట్టుకొని ప్రపంచానికి వైరాగ్య బోధ చేస్తుంటాడు. శివమయమైన శివరాత్రి రోజు మనం చేసే ఈశ్వరారాధన సకల కార్యసిద్ధికీ సోపానం.. మోక్షమార్గం.
పరమశివుడు అంతులేని ఆకాశరూప నిరాకార సాకార సర్వాకార ఓంకార స్వరూపం. ఒకసారి బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు కుర్చుని ఉన్నప్పుడు వారిలో ‘ఎవరు గొప్ప?’ అనే ప్రశ్నవచ్చింది. బ్రహ్మ విష్ణువులు సంభాషణ నుంచి చర్చకు దిగారు. అంతలో శివుడు వారికి పరతత్వం అర్థమవ్వాలని అంతర్దానుడై అనంత లింగాకారుడిగా ఆవిర్భవించాడు. విశ్వవాణి గంభీర నాదంతో ఆ మహాలింగం ఆది-అంతం తెలుసుకోగలవారే మహామహులని పలుకుతుంది. వెంటనే బ్రహ్మదేవుడు హంస రూపంలో ఆ లింగం పైభాగాన్ని అందుకోవాడానికి బయలుదేరుతాడు.
విష్ణువు వరాహ రూపంలో ఆది కనుక్కోవడానికి బయలుదేరుతాడు. చాలాకాలం తర్వాత బ్రహ్మవిష్ణువులు తిరిగొచ్చి.. అనంతమైన మహాలింగం ఆద్యంతాలు తెలుసుకోలేక పోయామని, పరమేశ్వరుడినే ఈశ్వర తత్వమేమిటో తెలియ చెప్పమని కోరుతారు. శంకరుడు వారితో విష్ణువు స్థితికర్తగా, బ్రహ్మ సృష్టికర్తగా, తాను లయకారుడిగా విధులు నిర్వర్తించాలని, లోక కల్యాణమే మన కర్తవ్యమని పరతత్వం పరమార్థాన్ని వివరిస్తాడు. అలా సమస్త దేవగణమంతా ఈశ్వరుని ఎదుట వినమ్రులై నిలిచి సమస్త సృష్టి తత్వం పరమశివుడి పరతత్వమేనని గ్రహించిన గొప్ప సమయమే లింగోద్భవకాలం. ఆ రోజే మహా శివరాత్రి. మహాపుణ్యకాలమిది.
‘కోటి జన్మార్జితైః పుణ్యేశ్శివే భక్తి ప్రజాయతే’ అనేక జన్మల నుంచి ఆర్జించిన పుణ్యఫలం వల్లే పరమేశ్వరునిపై భక్తి అందిస్తుందనేది జగమెరిగిన సత్యం. శివుడు- భవుడు, ఈశ్వరుడు, ఈశానుడు, పశుపతి, ఉగ్రుడు, రుద్రుడు, భీముడు, మహాదేవుడనే అష్టమూర్తులుగా అనుగ్రహిస్తుంటాడు. పరమేశ్వరుడి రూపాలు అనేకం. అవన్నీ ప్రేరణ పూర్వకాలే, నిరాకార సౌందర్యమూర్తులు, భక్తి భావోద్భవకరాలు.
‘మంగళం కరోతి ఇతి శివః స్వయం ప్రకాశయతి’ స్వయం ప్రకాశుడై శుభాలు కలిగించువాడు శివుడు. కష్టాలు తనవంతు, సుఖాలు ఇతరుల వంతు అనే భావన. ఎంతో ఉన్నతమైన త్యాగచింతన కలవాడు భవుడు. అడిగిన వరాలిచ్చే భోళాశంకరుడు. క్షీరసాగర మథనంలో వచ్చిన గరళాన్ని మింగి లోకానికి అమృతాన్ని పంచి నీలకంఠుడు అయ్యాడు. సకారాత్మకం, సక్రియాత్మకం, సమయాత్మకం, సఫలాత్మకం, సుఖాత్మకం, సంతోషాత్మకం అనే ఐశ్వర్యాలు గుణాలుగా కలవాడు ఈశ్వరుడు. లోకాలను కాచే చిత్కళారూపుడు. అటువంటి పరమశివుడిని ‘తన్మే మనః శివ సంకల్పమస్తు’ అంటూ హృదయ మందిరంలో ఆరాధించే మహదవకాశం హహాశివరాత్రి పర్వం.
– డా॥ ఇట్టేడు అర్కనందనాదేవి