Singireddy Niranjan Reddy : షాద్ నగర్ గడ్డ మీద పుట్టి, తెలంగాణ మట్టిలో పెరిగిన బక్కని నర్సింహులు చంద్రబాబు మెప్పుకోసం ‘డిక్షనరీ’లో తెలంగాణ అనే పదం లేదు అని వ్యాఖ్యానించడం దుర్మార్గం, దురదృష్టకమని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి మండిపడ్డారు. మహానాడులో చెత్త వాగిన ఆయన ఓ అజ్ఞాని అని ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. డిక్షనరీలో తెలంగాణ పదం లేదనడం తెలంగాణ ఆత్మగౌరవాన్ని, తెలంగాణ చరిత్రను, తెలంగాణ ఉద్యమాన్ని అవమానించడమేనని నిరంజన్ రెడ్డి విమర్శించారు.
మహానాడులో బక్కని నర్సింహులు వ్యాఖ్యలను ఖండించిన సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి తెలంగాణ అనే పదం చరిత్రలో ఎన్నో శాసనాల్లో, సాహిత్యంలో, రాజ్యాల చరిత్రలో ఉందని తెలిపారు. క్రీ.శ.1417 తెల్లాపూర్ శాసనం నుండి కాకతీయుల కాలవకు కొనసాగిన త్రిలింగదేశం అనే పదం నుండి తెలంగాణ వచ్చిందని ఆయన గుర్తు చేశారు. ‘తెలంగాణ అనే పదం డిక్షనరీలో లేదు’ అన్న మాటను పదం ఏ డిక్షనరీలో చూసి చెప్పాడో బక్కని నర్సింహులు చెప్పాలని నిరంజన్ రెడ్డి డిమాండ్ చేశారు.
‘తెలంగాణ ఉద్యమం, అమరుల ఆత్మ బలిదానాల ఫలితంగా 2014లో పార్లమెంటులో చేసిన చట్టం ఫలితంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని గుర్తు చేశారు. చంద్రబాబు మెప్పుకోసం బక్కని నర్సింహులు మాట్లాడిన మాటలు తెలంగాణ ప్రజల ఉద్యమాన్ని, అమరుల త్యాగాలను అవమానించడమే. మీలాంటి వాళ్లు చరిత్రలో తెలంగాణ ద్రోహులుగా మిగిలిపోతారు. తెలంగాణ మీ డిక్షనరీలో లేకపోవచ్చు కానీ అది మా ఆత్మగౌరవం. మా రక్తంలో, మా గుండెల్లో, మా భూమిలో, మా భాషలో, మా యాసలో, మా సంస్కృతిలో దాగి ఉంది. మీలాంటి ద్రోహుల మాటలు మా ప్రజలను మరింత బలోపేతం చేస్తాయి. తెలంగాణ తేజాన్ని, వైభవాన్ని విశ్వవీధుల్లో ఎగరేస్తాయి’ అని బక్కని నర్హింహులుకు మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు.