Hyderabad : ఎవరెస్టు నుంచి దిగుతూ మరణించిన హైదరాబాద్ పర్వతారోహకుడు అరుణ్ కుమార్ తివారి (53) కుటుంబం సంచలన నిర్ణయం తీసుకుంది. అతడి మృతదేహాన్ని ఎవరెస్ట్ పర్వతంపైనే ఉంచాలని నిర్ణయించింది. అరుణ్ హిమాలయాలకే అంకితం అని, అందుకే అతడి మృతదేహాన్ని అక్కడే వదిలేయాలని అతడి కుటుంబం నిర్ణయించినట్లు తెలిపింది. ఈ మేరకు అరుణ్ బంధువు సుధీర్ ఉపాధ్యాయ బుధవారం వెల్లడించారు.
హైదరాబాద్‌కు చెందిన అరుణ్ కుమార్ తివారితోపాటు మరి కొందరు పర్వతారోహకుల బృందం ఇటీవల ఎవరెస్టును అధిరోహించారు. ఈ నెల 21న ఎవరెస్టు శిఖరాన్ని చేరుకున్నారు. అనంతరం పర్వతం దిగుతుండగా, హిల్లరీ స్టెప్ వద్ద అరుణ్ కుమార్‌తోపాటు మరొకరు గతవారం మరణించారు. ఈ విషయంపై కుటుంబ సభ్యులకు సమాచారం అందింది. దీంతో అరుణ్ కుమార్ మృతదేహాన్ని అక్కడి నుంచి తీసుకొచ్చే విషయంపై కుటుంబ సభ్యులు తాజాగా ఈ నిర్ణయం తీసుకున్నారు. ఎవరెస్టును అధిరోహించడం కష్టమనే సంగతి తెలిసిందే. ఇది ప్రాణాలకే రిస్క్. అలాంటి పర్వతాన్ని అరుణ్ కుమార్ చేరుకున్నాడు.
అనంతరం దిగి వస్తుండగా ప్రాణాలు కోల్పోయాడు. అతడు మరణించిన హిల్లరీ స్టెప్‌ను అందరూ డెత్ జోన్ అంటుంటారు. ఇలాంటి చోట మరణించడంతో అతడి మృతదేహాన్ని తీసుకురావడం చాలా ఖర్చుతో, అంతకుమించి శ్రమతో కూడుకున్న పని. 8 నుంచి 12 మంది నిపుణులు వెళ్లి మృతదేహాన్ని తీసుకురావాల్సి ఉంటుంది. ఈ పరిస్థితుల్లో అరుణ్ కుమార్ తివారి కుటుంబం అతడి మృతదేహాన్ని అక్కడే వదిలేయాలని నిర్ణయించుకుంది. అతడికి ఎవరెస్ట్, హిమాలయాలు అంటే ఇష్టమని, అతడు ఆ పర్వతానికే చెందుతాడని కుటుంబం తెలిపింది. అలాగే, అరుణ్ కుమార్ శివుడి ఒడిలో చేరినట్లు భావిస్తున్నామని, అందుకే ఆ మృతదేహాన్ని అక్కడే వదిలేస్తున్నామని అతడి కుటుంబం వివరించింది.