Yash | కన్నడ స్టార్ హీరో యశ్ ప్రస్తుతం ‘టాక్సిక్’ సినిమాతో బిజీగా ఉన్నారు. ‘కేజీఎఫ్’ సినిమాలతో పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగిన యశ్.. ఇప్పుడు దేశవ్యాప్తంగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ క్రమంలోనే ప్రముఖ జర్నలిస్ట్ రజత్ శర్మ నిర్వహించే ‘ఆప్ కీ అదాలత్’ కార్యక్రమానికి యశ్‌కి ఆహ్వానం అందింది. ఈ షోలో పాల్గొన్న తొలి కన్నడ నటుడిగా యశ్ నిలిచారు. ఈ కార్యక్రమంలో యశ్ తన సినీ ప్రయాణంతో పాటు వ్యక్తిగత జీవితానికి సంబంధించిన పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు. అయితే ఓ అభిమాని మరణానికి సంబంధించిన ప్రశ్నకు ఆయన ఇచ్చిన సమాధానం ఇప్పుడు సోషల్ మీడియాలో విస్తృతంగా చర్చనీయాంశంగా మారింది.
గతంలో యశ్‌కు చెందిన ఓ అభిమాని ఆత్మహత్య చేసుకున్న ఘటన తీవ్ర విషాదాన్ని కలిగించింది. తన అంత్యక్రియలకు హీరో యశ్, అప్పటి కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య హాజరు కావాలని తన సూసైడ్ నోట్లో ఆ అభిమాని చివరి కోరికగా రాసినట్లు సమాచారం.ఆ అభిమాని అంత్యక్రియలకు సిద్ధరామయ్య హాజరయ్యారు. అయితే యశ్ మాత్రం వెళ్లలేదు. ఇదే విషయాన్ని రజత్ శర్మ తన కార్యక్రమంలో యశ్‌ను ప్రశ్నించారు. అభిమాని చివరి కోరికగా తనను అంత్యక్రియలకు రావాలని కోరినప్పటికీ ఎందుకు వెళ్లలేదని నేరుగా ప్రశ్నించారు. .
రజత్ శర్మ ప్రశ్నకు యశ్ ఎంతో ఆలోచనాత్మకంగా సమాధానం ఇచ్చారు. తాను ఆ అంత్యక్రియలకు వెళ్లి ఉంటే సమాజానికి ఒక తప్పుడు సందేశం వెళ్లే అవకాశం ఉండేదని చెప్పారు.తన అభిమాని తనను కలవాలనే కోరికతో ఆత్మహత్య చేసుకున్నాడనే భావన ఇతరుల్లో ఏర్పడకూడదని యశ్ స్పష్టం చేశారు. తన చర్య వల్ల మరికొందరు కూడా ఇలాంటి నిర్ణయం తీసుకునే ప్రమాదం ఉందని, అలాంటి ప్రేరణను తాను ఎట్టి పరిస్థితుల్లోనూ ఇవ్వలేనని తెలిపారు. యశ్ చేసిన మరో కామెంట్ అందరి దృష్టిని ఆకర్షించింది. ఎవరైనా జీవితంలో ఏదైనా గొప్ప విషయం సాధించి, తనను వచ్చి చూడమని ఆహ్వానిస్తే తప్పకుండా వెళ్తానని చెప్పారు. వారిని అభినందించడం ద్వారా ఇతరులకు కూడా స్ఫూర్తి లభిస్తుందని అన్నారు.
అయితే మరణం మాత్రం ఎవరికీ ఆదర్శంగా మారకూడదని యశ్ స్పష్టం చేశారు. తనను అభిమానించే వారిలో ఎవరూ తన కోసం ప్రాణాలు తీసుకునే పరిస్థితి రావడం తనకు ఏమాత్రం ఇష్టం లేదని ఆయన వ్యాఖ్యల సారాంశం. యశ్ సమాధానాన్ని రజత్ శర్మ కూడా ప్రశంసించారు. సోషల్ మీడియాలో ఈ వ్యాఖ్యలకు నెటిజన్ల నుంచి కూడా పెద్ద ఎత్తున స్పందన వస్తోంది. రజత్ శర్మ నిర్వహించే ఈ కార్యక్రమం ప్రత్యేకమైన కోర్టు సెటప్‌లో సాగుతుంది. ప్రముఖులను నిందితుల బోనులో కూర్చోబెట్టి, రజత్ శర్మ లాయర్ తరహాలో ప్రశ్నలు అడుగుతారు. వారి సమాధానాల ఆధారంగా కార్యక్రమం చివర్లో జడ్జి తీర్పు ఇస్తారు.ఈ కార్యక్రమంలో యశ్ పాల్గొనడం, ముఖ్యంగా తన అభిమాని మరణానికి సంబంధించిన సున్నితమైన ప్రశ్నకు ఆయన ఇచ్చిన సమాధానం ఇప్పుడు వైరల్‌గా మారింది.