Trisha | దేశవ్యాప్తంగా 80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్న వేళ తమిళనాడులో జరిగిన కార్యక్రమం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించి అధికారాన్ని చేపట్టిన తమిళగ వెట్రి కళగం (TVK) ప్రభుత్వానికి ఇది తొలి స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు కావడం విశేషం. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత దళపతి విజయ్ తొలిసారి జాతీయ జెండాను ఎగురవేశారు. చెన్నైలోని చారిత్రాత్మక సెంట్ జార్జ్ కోట ప్రాంగణంలో శనివారం ఉదయం స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు వైభవంగా నిర్వహించారు. ముఖ్యమంత్రి విజయ్ జాతీయ జెండాను ఆవిష్కరించి, అనంతరం పోలీసు బలగాల గౌరవ వందనం స్వీకరించారు.
రాష్ట్ర మంత్రులు, వివిధ రాజకీయ పార్టీల నేతలు, ఉన్నతాధికారులు, సినీ ప్రముఖులు తదితరులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. సంగీత కార్యక్రమాలు, పోలీసు బలగాల మార్చ్పాస్ట్తో వేడుకలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ సందర్భంగా సీఎం విజయ్ మాట్లాడుతూ తమిళనాడు అభివృద్ధి కోసం తమ ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తుందని తెలిపారు. ప్రజల సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తామని పేర్కొన్నారు. ఈ వేడుకల్లో ప్రముఖ నటి త్రిష పాల్గొనడం ఇప్పుడు సినీ, రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. తన తల్లితో కలిసి కార్యక్రమానికి వచ్చిన త్రిష.. వీఐపీ విభాగంలో కూర్చున్నారు.అక్కడ విజయ్ తండ్రి, ప్రముఖ దర్శకుడు ఎస్.ఏ. చంద్రశేఖర్, ఆయన తల్లి శోభ పక్కనే త్రిష కూర్చోవడం అందరి దృష్టిని ఆకర్షించింది. దీంతో ఈ వేడుకలకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ అవుతున్నాయి.
విజయ్ రాజకీయాల్లోకి ప్రవేశించినప్పటి నుంచి ఆయన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన పలు ఊహాగానాలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ముఖ్యంగా త్రిష పేరు తరచూ వార్తల్లో వినిపిస్తోంది.అయితే ఈ ప్రచారాలపై ఇద్దరూ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. మరోవైపు విజయ్ రాజకీయ ప్రయాణంలో త్రిష పలుమార్లు ఆయనకు మద్దతు తెలిపిన సందర్భాలు అభిమానుల దృష్టిని ఆకర్షించాయి. విజయ్ ఎన్నికల్లో విజయం సాధించిన సమయంలో త్రిష ఆయన ఇంటికి వెళ్లి అభినందించినట్లు వార్తలు వచ్చాయి. అనంతరం విజయ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన కార్యక్రమంలోనూ ఆమె పాల్గొన్నారు. ఇటీవల తమిళనాడులో జరిగిన కొన్ని రాజకీయ పరిణామాల నేపథ్యంలో కూడా త్రిష పేరు చర్చలోకి వచ్చింది. కావేరీ జలాల అంశంపై జరిగిన నిరసనల్లో కొందరు కార్యకర్తలు త్రిష పేరును ప్రస్తావిస్తూ నినాదాలు చేసినట్లు వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో రాజకీయ నేతల మధ్య కూడా ఈ అంశంపై మాటల యుద్ధం జరిగింది. తాజాగా ముఖ్యమంత్రి విజయ్ అధికారిక స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో త్రిష పాల్గొనడం మరోసారి చర్చకు దారితీసింది.