Rythu Bima | తెలంగాణలో రైతుబీమా పథకం అమలుపై అనిశ్చితి నెలకొంది. 2026–27 సంవత్సరానికి రైతుబీమా ప్రీమియం చెల్లించాల్సిన గడువు గురువారంతో ముగిసినా.. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు ప్రీమియం చెల్లించలేదు. దీంతో పథకం కొనసాగుతుందా? లేదా? అనే ఆందోళన రైతుల్లో వ్యక్తమవుతోంది.
అకాల మరణం చెందిన రైతు కుటుంబాలను ఆదుకునేందుకు గత బీఆర్ఎస్ ప్రభుత్వం 2018లో రైతుబీమా పథకాన్ని ప్రారంభించింది. ఎల్ఐసీతో కలిసి ఈ పథకాన్ని అమలు చేస్తూ వస్తోంది. పథకం కింద రైతు మరణిస్తే వారి కుటుంబానికి రూ.5 లక్షల బీమా పరిహారం అందుతుంది. ప్రతి ఏడాది ఆగస్టు 14న ప్రభుత్వం ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. ఇందుకోసం సుమారు రూ.1,400 కోట్ల వరకు వ్యయం అవుతోంది.
ప్రస్తుతం రాష్ట్రంలో సుమారు 42.16 లక్షల మంది రైతులు రైతుబీమా పథకం పరిధిలో ఉన్నారు. ఇప్పటివరకు రైతుల కుటుంబాలకు ఆపత్కాలంలో ఈ పథకం అండగా నిలిచింది. అయితే 2026–27 సంవత్సరానికి ప్రీమియం చెల్లింపు జరగకపోవడంతో పథకం భవిష్యత్తుపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
రైతుబీమా ప్రీమియాన్ని ప్రభుత్వం వెంటనే చెల్లించి పథకాన్ని కొనసాగించాలని రైతులు కోరుతున్నారు. అనుకోని పరిస్థితుల్లో రైతు కుటుంబానికి రూ.5 లక్షల ఆర్థిక భరోసా కల్పించే ఈ పథకం నిలిచిపోతే.. ఆ కుటుంబాలు తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం దీనిపై స్పష్టత ఇవ్వాలని కోరుతున్నారు.