రాయపోల్, మే27 : రాయపోల్ మండలంలోని కొత్తపల్లి బస్టాండ్ వద్ద రైతులు వరి ధాన్యం కొనుగోలు చేయడం లేదని నిరసిన చేపట్టారు. ధాన్యం కొనడంలో జాప్యంపై ఆగ్రహం వ్యక్తం చేసిన రైతన్నలు బుధవారం రోడ్డుపై బైఠాయించి రెండు గంటల పాటు రాస్తారోకో నిర్వహించారు. రైతులు భారీగా రదీంతో ప్రధాన రోడ్డుపై వాహనాల రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి.
వరి ధాన్యం కొనుగోలులో ఆలస్యంపై మండిపడిన రైతులు కొత్తపల్లి బస్టాండ్ వద్ద నిరసనకు దిగారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా.. సీం డౌన్ డౌన్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. లంచాలు తీసుకుంటున్న అధికారులు తమ వద్దకు వచ్చి లారీల కొరతను తీరుస్తానని స్పష్టమైన హామీ ఇచ్చే వరకు ఆందోళన విరమించేది లేదని రైతులు ఆగ్రహంతో ఆందోళన కార్యక్రమాన్ని కొనసాగించారు. ఐకేపీ కొనుగోలు కేంద్రంలో వరి ధాన్యం నిల్వలు పేరుకుపోవడంతో తమ పంటను ఎప్పుడు తరలిస్తారో తెలియక రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

రైతుల రాస్తారోకో విషయం తెలుసుకున్న పోలీసులు, సంబంధిత అధికారులు వెంటనే ఘటన స్థలానికి చేరుకుని రైతులతో చర్చలు జరిపారు. వరి ధాన్యం కొనుగోలు ప్రక్రియలో ఆలస్యం జరుగుతుండటంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని రైతులు అధికారులకు తెలిపారు.
ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకుని కొనుగోలు కేంద్రాలకు సరిపడా లారీలు అందుబాటులో ఉంచాలని రైతులు డిమాండ్ చేశారు. ధాన్యం తరలింపునకు తక్షణమే లారీలు పంపిస్తామని తహశీల్దార్, సీఐ, ఎపీఏంలు హామీ ఇవ్వడంతో రైతులు తమ ఆందోళనను విరమించారు.


