హైదరాబాద్, ఫిబ్రవరి 14(నమస్తే తెలంగాణ) : బీఆర్ఎస్ ప్రభుత్వంలో మున్సిపల్ చైర్మన్లుగా, కౌన్సిలర్లుగా, మేయర్లుగా పదవులను అనుభవించి, కాంగ్రెస్ అధికారంలోకి రాగానే కారు దిగారు. హస్తం పార్టీ కండువాను కప్పుకున్నారు. తాజా మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ టిక్కెట్‌పై బరిలో నిలిచారు. వారిలో రాష్ట్రవ్యాప్తంగా చాలా మందికి భంగపాటు తప్పలేదు. పార్టీ మారిన మాజీ మేయర్లకూ, మాజీ చైర్మన్లకు, మాజీ కౌన్సిలర్లకు కర్రుకాల్చి వాత పెట్టినట్టు ఓటుతో బుద్ధి చెప్పారు. నిజామాబాద్ జిల్లా భీమ్‌గల్ మున్సిపాలిటీలో బీఆర్ఎస్ పార్టీలో చైర్మన్ పదవి అనుభవించిన మల్లెల రాజశ్రీ అటు తర్వాత కాంగ్రెస్‌లో జంప్ అయ్యారు. భీమ్‌గల్‌లో 9వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థి రాజశ్రీని ప్రజలు ఓడించారు. 75 ఓట్ల మెజారిటీతో బీఆర్ఎస్ అభ్యర్థి నీలం రవిని గెలిపించారు.
గజ్వేల్‌లో 2014 నుంచి 2020 వరకు బీఆర్ఎస్లో మున్సిపల్ చైర్మన్ పదవి అనుభవించి గాడిపల్లి భాసర్ ఆ తర్వాత బీజేపీలో చేరారు. తాజా ఎన్నికల్లో బీజేపీ తరఫున ఆయన భార్య కల్యాణిని పోటీలో నిలబెట్టగా ప్రజలు తిరస్కరించారు. బీజేపీ ఎంపీ రఘునందన్‌రావు ఎంత ప్రచారం చేసినా ప్రజలు పట్టించుకోలేదు. 529 ఓట్ల మెజారిటీ ఇచ్చి బీఆర్ఎస్ అభ్యర్థి గోలి మమతకు పట్టంగట్టారు. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీకి మారిన చౌటుప్పల్ మున్సిపల్ చైర్మన్ వెంరెడ్డి రాజుకు సైతం ప్రజలు షాక్ ఇచ్చారు. బీఆర్ఎస్ నుంచి గెలిచి మున్సిపల్ చైర్మన్ పదవి అనుభవించిన రాజు ఇటీవల కాంగ్రెస్‌లో చేరా రు.
తాజా ఎన్నికల్లో ఆయన భార్య వేంరెడ్డి సంధ్యను 16వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో నిలిపారు. కానీ 374 ఓట్ల తేడాతో ప్రజలు ఓడించారు. మెదక్ జిల్లా తూప్రాన్‌లోనూ బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్ పార్టీలోకి మారిన ఇద్దరు కౌన్సిలర్లను సైతం ప్రజలు తిరసరించారు. తూప్రాన్ మాజీ చైర్మన్ మామిండ్ల కృష్ణా జ్యోతి, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ నందాల శ్రీనివాస్‌ను ఓడించారు.
బీఆర్ఎస్ అభ్యర్థి చెలిమెల రాములుకు 311 ఓట్ల మెజారిటీని, చెలిమెల ప్రియాంకకు 64 ఓట్ల మెజారిటీతో పట్టంగట్టారు. కరీంనగర్ జిల్లా జడ్పీ అధ్యక్షురాలిగా వ్యవహరించిన కనుమల్ల విజయగణపతి బీజేపీలో చేరారు. జమ్మికుంట మున్సిపల్ 17వార్డు నుంచి బరిలో నిలిచి ప్రజల చేతిలో భంగపడ్డారు. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరి, 19వ వార్డు నుంచి బరిలో నిలిచిన దేశిని కోఠి సైతం పరాభవాన్ని మూటగట్టుకున్నారు.