MP Vaddiraju Ravi Chandraకేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ప్రజా పరీక్షలు (అక్రమ మార్గాల నివారణ) సవరణ బిల్లు 2026కు తమ పార్టీ సంపూర్ణంగా మద్దతు తెలుపుతుదని బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ లీడర్ వద్దిరాజు రవిచంద్ర తెలిపారు. రాజ్యసభలో యాంటీ పేపర్ లీక్ బిల్లుపై చర్చ సందర్భంగా మాట్లాడిన వద్దిరాజు నీట్ పరీక్ష రద్దుతో ఆత్మహత్య చేసుకున్న విద్యార్థులకు బీఆర్ఎస్ నివాళులు అర్పిస్తోందని చెప్పారు. నీట్ మృతుల కుటుంబాలకు వెంటనే తగిన నష్టపరిహారం చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు.
ఒక పరీక్ష అనేది ఒక ప్రశ్నాపత్రం మాత్రమే కాదని, అది ఒక విద్యార్థి జీవిత లక్ష్యం అని, ఒక కుటుంబం ఎన్నో సంవత్సరాలుగా పడిన కష్టమని, ఒక తల్లి కన్నీరు, ఒక తండ్రి చెమట, ఒక యువకుడి భవిష్యత్తు అని బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ లీడర్ వద్దిరాజు రవిచంద్ర అన్నారు. అలాంటి పరీక్షల్లో ప్రశ్నాపత్రాలు లీక్ కావడం, అక్రమాలు జరగడం వంటివి చట్టాన్ని ఉల్లంఘించడం మాత్రమే కాదని, దేశ యువత నమ్మకాన్ని దెబ్బతీయడమని ఆయన వ్యాఖ్యానించారు. నీట్ లీకేజి తర్వాత 20 మందికి పైగా విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడ్డారని ఎంపీ రవిచంద్ర ఆవేదన వెలిబుచ్చారు.
ప్రజా పరీక్షలు (అక్రమ మార్గాల నివారణ)సవరణ -2026 బిల్లుపై గురువారం రాజ్యసభలో జరిగిన చర్చ సందర్భంగా ఎంపీ రవిచంద్ర మాట్లాడారు. ఆత్మహత్యలు చేసుకున్న విద్యార్థుల కుటుంబ సభ్యుల శోకం అందరి హృదయాలను కలచి వేసిందన్నారు. అమరులైన విద్యార్థులకు తమ పార్టీ బీఆర్ఎస్ ఘనంగా నివాళులర్పిస్తోందని, ఆత్మహత్య చేసుకున్న కుటుంబాలకు తగిన నష్ట పరిహారంతో పాటు ఉద్యోగాలివ్వాలని డిమాండ్ చేశారు. విద్యార్థులు, యువత ఆకాంక్షల కనుగుణంగా స్పందించే పార్టీ బీఆర్ఎస్ అని,
నీట్ లీకేజికి వ్యతిరేకంగా సాగిన ఉద్యమానికి తాము సంఘీభావం ప్రకటించామని ఆయన తెలిపారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తన పుట్టిన రోజు వేడుకలను కూడా రద్దు చేసుకుని జూలై 24వ తేదీన హైదరాబాద్‌లో విద్యార్థులతో కలిసి నిరసన దీక్షలో పాల్గొన్నారని ఎంపీ వెల్లడించారు. ఛలో పార్లమెంట్ సందర్భంగా విద్యార్థులు, యువతపై పోలీసుల లాఠాఛార్జికి వ్యతిరేకంగా కేటీఆర్ విద్యార్థులతో కలిసి గళమెత్తారని సభకు నివేందించారు వద్దిరాజు. పోలీసుల లాఠీచార్జీ, భాష్పవాయువు ప్రయోగంలో గాయపడిన వారి వైద్య ఖర్చులు ప్రభుత్వమే భరించాలని , విద్యార్థులపై పెల్లెట్స్‌తో కాల్పులు జరిపిన ఘటనలను ప్రభుత్వం తీవ్రంగా పరిగణించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఎంపీ రవిచంద్ర కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా గట్టి చర్యలు తీసుకోవాలని ఎంపీ కోరారు.
నీట్ ఆందోళనలు విరమించేందుకు సీజేపీ, విద్యార్థులు లేవనెత్తిన డిమాండ్లకు అంగీకరించిన ప్రభుత్వం .. వాటిని చిత్తశుద్ధితో అమలు చేయాలని వద్దిరాజు సూచించారు. కొన్నేళ్లుగా దేశవ్యాప్తంగా ఎన్నో నియామక పరీక్షలు, ప్రవేశ పరీక్షల్లో ప్రశ్నాపత్రాల లీకేజీలు జరిగాయని, లక్షలాది మంది విద్యార్థులు పరీక్షలు రాసినా, కొద్దిమంది అక్రమాలకు పాల్పడిన కారణంగా మళ్లీ రాయాల్సిన పరిస్థితి రావడం శోచనీయమని ఆయన అన్నారు. విద్యార్థుల సమయంతో పాటు మానసిక స్థైర్యం దెబ్బతినడమే కాకుండా వారి కుటుంబాలకు ఆర్థిక భారం పెరిగుతుందని ఎంపీ రవిచంద్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం 2024 చట్టాన్ని మరింత బలోపేతం చేయడానికి ఈ సవరణ బిల్లును తీసుకురావడాన్ని ఆయన స్వాగతించారు.
ఈ బిల్లులో శిక్షలను పెంచడం, ప్రత్యేక ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేయడం, రెండు నెలల్లో దర్యాప్తు పూర్తి చేయాలని నిర్దేశించడం, మూడు నెలల్లో విచారణ పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకోవడం, ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయడం వంటి అంశాలు ఉన్నాయని ఎంపీ అన్నారు. ఇవి సరైన దిశలో వేసిన అడుగులే అని, ఈ బిల్లులో వ్యక్తులకు విధించే జైలు శిక్షను పెంచారని, భారీ జరిమానాలు విధించే అవకాశం కల్పించారని ఎంపీ వద్దిరాజు వివరించారు. కొత్త బిల్లుతో పరీక్షల నిర్వహణలో భాగమైన సర్వీస్ ప్రొవైడర్లపై మరింత కఠిన చర్యలు తీసుకునేలా చేశారని ఎంపీ తెలిపారు. పరీక్షల్లో అక్రమాలకు పాల్పడిన సంస్థలను 8 ఏళ్ల వరకు డిబార్ చేసే నిబంధన తీసుకొచ్చారని, సంఘటిత నేరాలకు కనీసం ఏడేళ్ల జైలు శిక్ష, భారీ జరిమానాలు విధించే అవకాశం కల్పించారని, ఇవన్నీ కఠిన చర్యలేనని ఎంపీ రవిచంద్ర పేర్కొన్నారు. అయితే బీఆర్ఎస్ అభిప్రాయం చాలా స్పష్టంగా ఉందని, శిక్షలు పెంచితేనే సమస్య పూర్తిగా పరిష్కారం కాదని, నీట్ లీకేజీ నేపథ్యంలో 2024 లో ఇస్రో మాజీ ఛైర్మన్ రాధాకృష్ణన్ నేతృత్వంలో కమిషన్ ఏర్పాటు చేస్తే, 101 ప్రతిపాదనలతో నివేదిక ఇచ్చిందని, ఆ ప్రతిపాదనల అమలు పై ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటే లీకేజి సమస్య ఉత్పన్నమయ్యే పరిస్థితి తలెత్తేది కాదని బీఆర్ఎస్ గట్టిగా నమ్ముతున్నదని వద్దిరాజు పేర్కొన్నారు.
రెండేళ్ల కిందట పార్లమెంటు వేదికగా ప్రధాని నరేంద్ర మోడీ పరీక్షల లీకేజి జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చినా లాభం లేకపోవడం శోచనీయమన్నారు. వరుస పేపర్ లీకేజీల ఘటనలతో విసిగి వేసారిన విద్యార్థులు, యువత విధి లేని పరిస్థితుల్లోనే వీధుల్లోకి రావలసి వచ్చిందని ఎంపీ రవిచంద్ర చెప్పారు. ఓపిక, సహనం నశించడం వల్లే ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు జెన్ జీ తరం ప్రజాస్వామ్య పద్ధతుల్లో ఉద్యమించిందని ఆయన వెల్లడించారు. ఈ బిల్లు మొత్తం “పేపర్ లీక్ జరిగిన తర్వాత ఏం చేయాలి?” అనే దానిపై ఎక్కువ దృష్టి పెట్టిందని, కానీ “పేపర్ లీక్ జరగకుండా ఎలా అడ్డుకోవాలి?” అనే అంశంపై కూడా సమానమైన దృష్టి ఉండాలని ఎంపీ సూచించారు. ఈరోజు పరీక్షల నిర్వహణ పూర్తిగా డిజిటల్ వ్యవస్థలపై ఆధారపడి ఉందని, ప్రశ్నాపత్రాలు డిజిటల్‌గా తయారవు తున్నాయని, పంపిణీ కూడా అవుతున్నాయని, అదేవిధంగా భద్రపర్చడం కూడా జరుగుతున్నదని ఎంపీ వద్దిరాజు వివరించారు. అందువల్ల సైబర్ సెక్యూరిటీ, ఎన్క్రిప్టెడ్ డిజిటల్ ట్రాన్స్మిషన్, బయోమెట్రిక్ యాక్సెస్, జియో-ట్యాగింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత పర్యవేక్షణ వంటి ఆధునిక భద్రతా వ్యవస్థలను తప్పనిసరిగా అమలు చేయాలని ఆయన అభిప్రాయపడ్డారు.
ప్రతి పరీక్షకు ముందు స్వతంత్ర సైబర్ సెక్యూరిటీ ఆడిట్ నిర్వహించాలని ఎంపీ కోరారు. పేపర్ లీక్ అయితే విద్యార్థులే నష్టపోతున్నారని, సంవత్సరాల పాటు కష్టపడి చదివిన అభ్యర్థులు మళ్లీ పరీక్షలు రాయాల్సి వస్తోందని, కానీ చాలా సందర్భాల్లో ప్రశ్నాపత్రాల భద్రతలో నిర్లక్ష్యం చేసిన అధికారులు మాత్రం ఎలాంటి చర్యలకు గురికావడం లేదని ఎంపీ రవిచంద్ర చెప్పారు. అందుకే ఈ చట్టంలో పరిపాలనా బాధ్యత కూడా స్పష్టంగా ఉండాలని ఆయన సూచించారు. ఎవరి నిర్లక్ష్యం వల్ల పేపర్ లీక్ జరిగిందో, వారిపై కూడా కఠిన చర్యలు తీసుకోవాలని వద్దిరాజు తెలిపారు. ఆధార్‌ను విజయవంతంగా నిర్వహించిన టెక్ దిగ్గజం నందన్ నీలేకని నేతృత్వంలో టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయడాన్ని బీఆర్ఎస్ పార్టీ స్వాగతిస్తున్నదని ఎంపీ రవిచంద్ర చెప్పారు. రాధాకృష్ణన్ కమిషన్ సిఫార్సుల అమలును పట్టించుకోని పరిస్థితిని నీలేకని విషయంలో చేయొద్దని ఆయన స్పష్టం చేశారు. పరీక్షల నిర్వహణ పై విద్యార్థులు, యువతలో కోల్పోయిన నమ్మకాన్ని తిరిగి పునరుద్ధరించడం లో నీలేకని మంచి సిఫార్సులు చేస్తారనే నమ్మకం ఉందని ఎంపీ రవిచంద్ర చెప్పారు.
ఈ బిల్లు ప్రకారం రెండు నెలల్లో దర్యాప్తు, మూడు నెలల్లో విచారణ పూర్తి చేయాలని చెబుతున్నదని, ఇది మంచి నిర్ణయమని ఆయన అన్నారు. అయితే ఈ లక్ష్యాలు సాధించాలంటే రాష్ట్ర ప్రభుత్వాలకు తగినంత మంది దర్యాప్తు అధికారులు, డిజిటల్ ఫోరెన్సిక్ నిపుణులు, ప్రత్యేక ప్రభుత్వ న్యాయవాదులు, ఫాస్ట్ ట్రాక్ కోర్టులకు అవసరమైన మౌలిక వసతులు కల్పించడం మంచిదని ఎంపీ వద్దిరాజు సలహా ఇచ్చారు.
లేదంటే చట్టంలో రాసిన గడువులు కాగితాలకే పరిమితమవుతాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
ఈ బిల్లులో హైకోర్టులో ఇద్దరు న్యాయమూర్తుల ధర్మాసనం ముందు అప్పీల్ చేసే అవకాశం కల్పించడం కూడా మంచి అంశమేనని ఎంపీ అన్నారు. దీని వల్ల న్యాయపరమైన పర్యవేక్షణ మరింత బలపడుతుందని ఎంపీ రవిచంద్ర అభిప్రాయపడ్డారు.
దేశానికి ఇప్పుడు అవసరమైంది కేవలం కొత్త శిక్షలు కాదు. “జాతీయ పరీక్షల సమగ్రత విధానం”.. ఇందులో
సైబర్ భద్రతా ప్రమాణాలు, ప్రశ్నాపత్రాల ఎన్క్రిప్టెడ్ నిర్వహణ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత పర్యవేక్షణ, స్వతంత్ర భద్రతా ఆడిట్లు, అన్ని పరీక్షా సంస్థలకు ఒకే విధమైన భద్రతా ప్రమాణాలు
తప్పనిసరి” ఆయన చెప్పారు. తెలంగాణ దేశంలో ఉన్నత విద్యకు, ఇంజినీరింగ్‌కు, ఫార్మసీకి, మెడికల్ విద్యకు, పోటీ పరీక్షలకు ప్రధాన కేంద్రంగా ఎదిగిందని, ప్రతి ఏడాది తెలంగాణ నుంచి లక్షలాది మంది యువత యుపీఎస్సీ, ఎస్ఎస్సీ, రైల్వే, బ్యాంకింగ్, ఎన్టీఏ వంటి పోటీ పరీక్షలు రాస్తున్నారని ఎంపీ తెలిపారు.
అభ్యర్థులందరికీ నిజాయితీగా చదివితే ఉద్యోగం వస్తుందనే నమ్మకం కల్పించడమనేది ప్రభుత్వ బాధ్యత అని ఎంపీ వద్దిరాజు చెప్పారు. పరీక్షల సంస్కరణలు శిక్షలతో ముగియకూడదని, ప్రభుత్వోద్యోగాల భర్తీ కూడా సమయానికి జరగాలని ఎంపీ సలహా నిచ్చారు. పరీక్షలు పూర్తయిన తర్వాత ఫలితాలు నెలలు, సంవత్సరాల తరబడి ఆలస్యం కాకూడదని ఎంపీ రవిచంద్ర వ్యాఖ్యానించారు. ఖాళీ పోస్టులను వెంటనే భర్తీ చేయాలి.
ఎందుకంటే పేపర్ లీక్ ఎంత ప్రమాదకరమో.. ఉద్యోగాల భర్తీలో జాప్యం కూడా అంతే ప్రమాదకరమని ఆయన అన్నారు. అలాగే, పరీక్షలు రద్దయినప్పుడు విద్యార్థులు తీవ్ర మానసిక ఒత్తిడికి గురవుతున్నారని,
వారికి ప్రభుత్వం ప్రత్యేకంగా కౌన్సెలింగ్, మానసిక ఆరోగ్య సహాయం కూడా అందించాలని ఎంపీ రవిచంద్ర సూచించారు. “మా కష్టాన్ని దోచుకోవద్దు. మా భవిష్యత్తుతో ఆటలాడొద్దు”అని ఈ దేశ యువత స్పష్టం చేస్తోందని ఎంపీ చెప్పారు. బీఆర్ఎస్ ఈ బిల్లు ఉద్దేశాన్ని సమర్థిస్తున్నదని ఎంపీ రవిచంద్ర చెప్పారు.
అయితే.. ప్రభుత్వం శిక్షలు పెంచడం వద్ద ఆగిపోకుండా, పరీక్షలు జరగకముందే లీకులను అరికట్టే వ్యవస్థను, అత్యాధునిక సాంకేతిక భద్రతను, అధికారుల బాధ్యతను, వేగవంతమైన నియామకాలను,
విద్యార్థుల మానసిక భద్రతను కూడా సమానంగా ప్రాధాన్యనివ్వాలని ఈ సభ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నానని ఎంపీ తెలిపారు. చట్టాన్ని బలపరచడం మంచి విషయమని, కానీ పరీక్షా వ్యవస్థను మరింత బలపరచడం ఇంకా గొప్ప దని నిజాయితీగా చదివే ఒక్క విద్యార్థి కూడా వ్యవస్థ వైఫల్యానికి బలి కాకూడదని ఎంపీ వద్దిరాజు స్పష్టం చేశారు.