– శాతవాహనుల పూర్వకాలానికి చెందిన టెర్రకోట పురా వస్తువు
నల్లగొండ రూరల్, సెప్టెంబర్ 15 : నల్లగొండ మండలం, అప్పాజిపేట గ్రామంలో గత పదేళ్లుగా చరిత్ర పూర్వయుగం, ఆనవాళ్లు, కాకతీయ ద్వికూటాలయం, శాసనం వెలుగుచూశాయి. కొత్తగా మంగళవారం కొత్త తెలంగాణ చరిత్ర బృందం సభ్యులు, జర్నలిస్టు చిక్కుల యాదగిరి, మేక అశోక్ రెడ్డికి 2 వేల యేండ్లనాటి టెర్రకోట డాబర్ లభించింది. కుండలు చేసేందుకు ఉపయోగించే ఈ మట్టి పరికరం అప్పాజీపేట ఊరి చివర వడ్లవారిపాడులో, దోమలపల్లి వెళ్లే రహదారి సమీపంలో గల చెలకలో లభ్యమైంది. చరిత్రబృందం సభ్యులు ఇచ్చిన సమాచారంతో కొత్త తెలంగాణ చరిత్ర బృందం అధ్యక్షుడు రామోజు హరగోపాల్ పూర్తి వివరాలు తెలిపారు.
‘‘ఈ టెర్రకోట డాబర్ ను కుండలు చేసేటపుడు లోపలవైపు పెట్టుకుని, పైనుంచి మరో చెక్కబద్దతో కొడుతు కుండకు ఆకారాన్ని ఇస్తారు. ఈ కాల్చిన మట్టి డాబర్ కుండలు తయారీ చేసిన కాలం నుంచి ఉన్నదని అంటే దాదాపు 2 వేల యేండ్ల వయస్సు కలిగిన పురావస్తువులని’ అన్నారు. ఇటువంటి టెర్రకోట డాబర్స్ ఇండోర్ ఖెరాలో లభించినవి. అవి క్రీ.పూ.200సం.ల నుంచి క్రీ.శ.600సం.ల వరకు వయసు కలవి.
ఈ టెర్రకోట లభించిన చోటున సైంటిఫిక్ ఎక్స్ ఫ్లోరేషన్ చేస్తే మరిన్ని చారిత్రక పురావస్తువులు దొరుకుతాయని కొత్త తెలంగాణ చరిత్ర బందం విశ్వసిస్తున్నదని చరిత్ర బృందం అధ్యక్షుడు రామోజు హరగోపాల్ అభిప్రాయపడ్డారు.