Swatantra Bhardwaj : సీజేపీ ఉద్యమకారుడు నిషు ఆజాద్ తండ్రిపై దాడి కేసులో రైట్ వింగ్ నేత స్వతంత్ర భరద్వాజ్‌కు ఊరట లభించింది. ఈ కేసులో అతడికి కోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. మూడు వారాల మధ్యంతర బెయిల్ ఇస్తూ ఢిల్లీ, పాటియాలా హౌజ్ కోర్టు మంగళవారం ఆదేశాలు జారీ చేసింది. గత జూన్‌లో ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద సీజేపీ ఆధ్వర్యంలో ఆందోళన జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఆందోళనలో విద్యార్థి ఉద్యమకారుడు నిషు ఆజాద్ తండ్రి సంజయ్ కుమార్ పాల్గొన్నాడు.
ఈ సందర్భంగా నిషు సంజయ్ కుమార్‌పై స్వతంత్ర భరద్వాజ్ దాడికి పాల్పడ్డాడు. ఈ విషయాన్ని అతడే మీడియాకు వెల్లడించాడు. తాను ఒక వ్యక్తి తల పగులగొట్టానని, అయినా అరెస్టు కాలేదని మీడియా ఇంటర్వ్యూలో చెప్పాడు. తనకు కపిల్ మిశ్రా, చిరాగ్ పాశ్వాన్ మద్దతు ఉందని కూడా తెలిపాడు. నిజానికి ఈ ఘటన జరిగిన తర్వాత అతడిని అరెస్టు చేసిన ఢిల్లీ పోలీసులు వెంటనే విడుదల చేశారు. కపిల్ మిశ్రా ఫోన్ చేయడం వల్లే తాను విడుదలయ్యానని, తనకు అందరి ఆశీస్సులు ఉన్నాయని చెప్పుకొచ్చాడు. దీంతో ఈ కేసు మరోసారి తెరమీదకు వచ్చింది.
సంజయ్‌కుమార్‌పై హత్యా యత్నానికి పాల్పడ్డ నిందితుడు భరద్వాజ్‌పై చర్యలు తీసుకోవాలని సీజేపీ సహా రాజకీయ ప్రముఖులు డిమాండ్ చేశారు. సీజేపీ ఆధ్వర్యంలో ఆందోళన కూడా చేశారు. దళితుడిపై దాడి చేసిన భరద్వాజ్‌పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ఈ అంశంపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కూడా స్పందించారు. దీంతో ఢిల్లీ పోలీసులు భరద్వాజ్‌పై హత్యాయత్నం, ఎస్సీ ఎస్టీ యాక్ట్ సహా పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అతడిని మూడు రోజుల్లోగా పట్టుకుంటామని హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో స్వతంత్ర భరద్వాజ్ యూపీ పారిపోగా.. అక్కడ అతడిని సెప్టెంబర్ 4న అరెస్టు చేశారు.
ప్రస్తుతం జైలులో ఉన్న అతడు బెయిల్ పిటిషన్ దాఖలు చేయగా విచారణ జరిగింది. తాను ఆత్మరక్షణ కోసమే దాడి చేశానని బెయిల్ పిటిషన్ సందర్భంగా పేర్కొన్నాడు. ఈ కేసులో ఇరుపక్షాల వాదనలు విన్న కోర్టు.. స్వతంత్ర భరద్వాజ్‌కు మూడు వారాల మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది.