– గత జాబు మేళాపై శ్వేత పత్రం విడుదల చేయాలి
– లష్కర్ ఉద్యోగాల నియామకాల్లో అవినీతి ఊట
– నిరుద్యోగ యువత వాస్తవాలను గమనించాలి
– కోదాడ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్
కోదాడ, సెప్టెంబర్ 15 : కాంగ్రెస్ ప్రభుత్వం, స్థానిక ఎమ్మెల్యేపై ప్రజల్లో పెరుగుతున్న వ్యతిరేకతను, వారి వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే 19న ‘జాబ్ మేళా’ అని నాటకానికి తెరతీశారని కోదాడ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ తీవ్రంగా విమర్శించారు. మంగళవారం కోదాడలోని తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తీరుపై, కాంగ్రెస్ ప్రభుత్వ మోసాలపై ధ్వజమెత్తారు. జాబ్ మేళాలకు తాము వ్యతిరేకం కాదని, అయితే ఆ పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న రాజకీయ మోసాన్ని మాత్రం వ్యతిరేకిస్తామన్నారు. నిరుద్యోగులకు ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వకుండా, ప్రైవేట్ ఉద్యోగాల పేరుతో యువతను మభ్యపెట్టడానికే ఈ జాబ్ మేళా నిర్వహిస్తున్నారని మండిపడ్డారు. కేవలం సిమ్ కార్డుల విక్రయం, సూపర్ మార్కెట్లు, పెట్రోల్ బంకులు, సిమెంట్ ఫ్యాక్టరీల్లో రోజువారీ కూలీ ఉద్యోగాలు చూపిస్తూ యువతను మోసం చేస్తున్నారన్నారు.
ఎన్నో సంవత్సరాలుగా ఎమ్మెల్యేగా, ఎంపీగా, ఇప్పుడు మంత్రిగా కొనసాగుతున్న ఉత్తమ్ కుమార్ రెడ్డి హుజూర్నగర్ నియోజకవర్గంలోని సిమెంట్ పరిశ్రమల్లో స్థానిక నిరుద్యోగ యువతకు ఇప్పటివరకు ఎన్ని ఉద్యోగాలు ఇప్పించారో ప్రజలకు వెల్లడించాలని బొల్లం మల్లయ్య యాదవ్ డిమాండ్ చేశారు. ఒక ప్రైవేట్ కార్యక్రమమైన ఈ జాబ్ మేళా కోసం జిల్లా కలెక్టర్ ఎస్పీ మొదలుకొని కింది స్థాయి గ్రామ కార్యదర్శి వరకు ప్రభుత్వ అధికారులను వాడుకోవడం దారుణం అన్నారు. ప్రభుత్వ జీతాలు తీసుకునే అధికారులు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఎందుకు ఊడిగం చేస్తున్నారని ప్రశ్నించారు. సింగరేణి సంస్థ (CSR ఫండ్స్) నిధులతో జాబ్ మేళా నిర్వహిస్తూ రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్నారని విమర్శించారు.గతంలో హుజూర్నగర్లో నిర్వహించిన జాబ్ మేళాకు వేలాది మంది నిరుద్యోగులు వస్తే కేవలం 300 మందికే ఆఫర్ లెటర్లు ఇచ్చారని. అందులో 100 మంది కూడా నియామకం కాలేదు అన్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డికి చిత్తశుద్ధి ఉంటే, గత జాబ్ మేళాలో ఎంతమందికి, ఏయే కంపెనీల్లో ఉద్యోగాలు ఇచ్చారో వెంటనే శ్వేతపత్రం విడుదల చేయాలన్నారు.
నిరుద్యోగులకు నెలకు రూ. 4000 భృతి ఇస్తామని చెప్పిన కాంగ్రెస్, ఇంతవరకు ఒక్క రూపాయి ఇవ్వలేదన్నారు. ఏడాదికి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్న రేవంత్ రెడ్డి హామీ ఏమైందని పకోడీలు వేసుకోవడం, బజ్జీలు అమ్ముకోవడం ఉద్యోగం కాదని గతంలో ఎద్దేవా చేసిన నాయకులు, ఇప్పుడు చదువుకున్న యువతను చిన్న చిన్న కూలీ పనులకు పంపడాన్ని ఆయన వ్యతిరేకించారు. నీటిపారుదల శాఖలో 300 లష్కర్ పోస్టులను ఒక్కొక్కటి 3 లక్షల రూపాయల చొప్పున అమ్ముకొని అవినీతికి పాల్పడ్డారని తీవ్రస్థాయిలో విమర్శనాస్త్రాలు సంధించారు. కోదాడ పట్టణాన్ని శుభ్రం చేయడానికి 70 మంది మున్సిపల్ కార్మికులను పనిలోకి తీసుకుని, వారి వద్ద తలా రెండు లక్షలు వసూలు చేసి. ఇప్పుడు వారికి కనీసం జీతాలు ఇవ్వకుండా రోడ్డున పడేసి వారిని తీవ్ర నిరాశకు గురిచేసారని ఆవేదన వ్యక్తం చేశారు.కోదాడలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీపేరుతో నాణ్యత లేని పైపులు వేసి కోట్లు దండుకుంటున్నారన్నారు రైతులు సాగునీరు అందక, ప్రజలు కరెంటు కోతలతో ఇబ్బంది కొడుతుంటే సమీక్షల పేరుతో కాలయాపన చేస్తున్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు .కాంగ్రెస్ నాయకులు తమ అవినీతిని, వైఫల్యాలను దాచుకోవడానికి ఆడుతున్న ఈ జాబ్ మేళా నాటకాలను యువత, నిరుద్యోగులు గమనించాలని, వారి మాయమాటలకు మోసపోవద్దని మల్లయ్య యాదవ్ పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో బీఆర్ఎస్ మండల, పట్టణ నాయకులు షేక్ నయీమ్, నల్ల భూపాల్ రెడ్డి, చీమ నరేష్, ఉపేందర్, పట్టణ మాజీ సర్పంచ్ పైడిమర్రి సత్య బాబు, అనంతుల ఆంజనేయులు గౌడ్, పొట్ట కిరణ్ కుమార్, పిట్టల భాగ్యమ్మ, కోదాటి కృష్ణయ్య, హనుమానాయక్, పి.వీరయ్య, కరీం, బత్తుల ఉపేందర్ పాల్గొన్నారు.