Collector Hymavathi | రాయపోల్, ఫిబ్రవరి 18 : సిద్ధిపేట జిల్లా రాయపోల్ మండల కేంద్రంలో బుధవారం జిల్లా కలెక్టర్ హైమావతి ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా వైద్య సేవలు, విద్యార్థినుల భోజనంపై లెక్టర్ హైమావతి మండల అధికారులను అడిగి తెలుసుకున్నారు.
అలాగే ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా సందర్శించి రోగులకు అందుతున్న వైద్య సేవలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఓపీ రిజిస్టర్, అటెండెన్స్ రిజిస్టర్ను పరిశీలించి మెడికల్ ఆఫీసర్ నుంచి కింది స్థాయి సిబ్బంది వరకు ఆసుపత్రి సమయాలను పాటిస్తూ ప్రతి రోజు అందుబాటులో ఉండి మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు.
అనంతరం రాయపోల్ మండలంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాన్ని సందర్శించిన జిల్లా కలెక్టర్ మధ్యాహ్న భోజన ప్రక్రియను పరిశీలించి ఆహార పదార్థాలను తనిఖీ చేశారు. భోజన నాణ్యతను మెరుగుపరిచి రుచికరంగా వండాలని వంట సిబ్బందికి సూచించారు. విద్యార్థుల హాజరు ప్రకారం సరుకులు అందిస్తూ రిజిస్టర్లలో నమోదు తప్పనిసరి చేయాలని, భోజనం-వసతి విషయంలో ఎలాంటి కొరత లేకుండా చూడాలని ఉపాధ్యాయులను ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో మండల పరిషత్ అభివృద్ధి అధికారి శ్రీనివాస్, గ్రామ సర్పంచ్ మాసంపల్లి రాజు, కస్తూర్బా ప్రిన్సిపల్ సుగంధ లత, ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్యాధికారి డాక్టర్ బల్ల మహారాజు వివిధ శాఖల అధికారులు, తదితరులు ఉన్నారు.