Congress Govt | మార్పు రావాలంటే కాంగ్రెస్ రావాలన్న సీఎం రేవంత్ రెడ్డి పాలనలో మార్పు షురూ అయిందని, బస్తా యూరియా కోసం రైతులు అరిగోస పడుతున్నారని తొగుట మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు జీడిపల్లి రాంరెడ్డి పేర్కొన్నారు.. సిద్దిపేట జిల్లా తొగుట మండలంలోని స్థానిక రైతు ఆగ్రోస్ సేవా కేంద్రం వద్ద రైతులు యూరియా కోసం పడుతున్న ఇబ్బందులను చూసి ఆందోళన వ్యక్తం చేశారు. యూరియా కోసం రైతులు బారులు తీరగా.. జీడిపల్లి రాంరెడ్డి వారితో కలిసి మాట్లాడారు.
రైతులకు సరిపడా యూరియాను అందించడంలో రాష్ట్రప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మండిపడ్డారు. పత్తి చేలు గూడకు వొచ్చిందని, వరి కలుపు దశలో ఉందని, మొక్కజొన్న చేలు కంకి దశలో ఉందని ఈ సమయంలో యూరియా లేక పంట చేలు ఎదుగుదల ఆగిపోయిందన్నారు. రైతులకు సకాలంలో యూరియాను అందించకపోతే జిల్లా కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని ఆయన ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
గత ప్రభుత్వాన్ని బద్నామ్ చేస్తూ..
ప్రభుత్వ అసమర్థ పాలన వల్లనే నేడు మల్లన్నసాగర్‌లోకి నీటిని తరలించడం లేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం గత ప్రభుత్వాన్ని బద్నామ్ చేస్తూ కాలయాపన చేయడం తప్ప చేసిందేమి లేదన్నారు.. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉందని జబ్బలు చరిచే నాయకులకు రైతుల సమస్యలు కనిపించడం లేదా అని ప్రశ్నించారు. కేసీఆర్ ప్రభుత్వంలో ఏనాడు యూరియా కోసం రైతులు రోడ్డెక్కిన పరిస్థితులు లేవని గుర్తు చేశారు. కాంగ్రెస్ పాలనలో రైతులకు జీలుగ, జనుము విత్తనాలు దొరకడం లేదని, యూరియా, కరెంట్ సమస్యలు రాజ్యమేలుతున్నాయన్నారు.
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి ప్రజలు గుణపాఠం చెప్పడం ఖాయమన్నారు. మల్లన్నసాగర్ రిజర్వాయర్ నిర్మించిన గత ప్రభుత్వాన్ని విమర్శలు చేయడం మానుకొని అసంపూర్తిగా ఉన్న కాలువల నిర్మాణాన్ని పూర్తిచేసి రైతులకు సాగు నీరు అందించి చిత్తశుద్ధిని చాటుకోవాలన్నారు.
మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ దోమల కొమురయ్య మాట్లాడుతూ.. భార్యాభర్తలిద్దరూ యూరియా కోసం లైన్లో వేచి ఉండడం చూస్తే గతంలో కాంగ్రెస్ ప్రభుత్వ పాలన గుర్తుకొస్తుందన్నారు. ప్రజా పాలన అంటే రైతులకు కావాలసిన ఎరువులను, విత్తనాలను సకాలంలో అందించడం అని గుర్తు చేశారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుని రైతులకు కావాల్సిన యూరియాను అందించాలని కోరారు.
Dharmasthala: ధర్మస్థలిలో మృతదేహాల వెలికితీత.. డ్రోన్ ఆధారిత జీపీఆర్ టెక్నాలజీతో గుర్తింపు
RS Praveen Kumar | కోడి గుడ్ల కుంభకోణం రూ. 600 కోట్లు : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
Gunfire | చందానగర్‌లో దొంగల బీభత్సం.. ఖజానా జ్యువెలర్స్‌లో కాల్పులు