RS Praveen Kumar | హైదరాబాద్ : కాంగ్రెస్ పార్టీ అంటేనే కుంభకోణాల పార్టీ, కమీషన్ల పార్టీ అని బీఆర్ఎస్ సీనియర్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. తాజాగా కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన జీవో 17పై ఆయన మండిపడ్డారు. తెలంగాణ భవన్లో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గురుకులాలు, వివిధ స్కూళ్ల ఫుడ్ కాంట్రాక్టర్లతో కలిసి మీడియాతో మాట్లాడారు.
కేసీఆర్ తెలంగాణ తొలి సీఎంగా సంపద పేద వాళ్ళ చేతిలో ఎలా పెట్టాలి అని ఆలోచించే వారు. రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రజల కళ్ళు కప్పి కుంభకోణాలకు పాల్పడుతూ సంపదనంతా ధనవంతుల చేతిలో పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. తాజాగా జీవో 17 తెచ్చి కోడిగుడ్ల కుంభకోణానికి పాల్పడ్డారు. దాదాపు రూ. 600 కోట్ల కుంభ కోణం ఇది. 20 వేల మంది చిరు వ్యాపారుల పొట్ట కొట్టేందుకు జీవో 17 తెచ్చారు. గురుకులాలు, కేజీవీబీ, ఇతర స్కూళ్లల్లో ఫుడ్ కాంట్రాక్టర్లను మార్చేందుకు నిబంధనలను సడలిస్తూ జీవో 17 ఇచ్చారు. ఈ జీవో తో 20 వేల మంది వాళ్ళ మీద ఆధారపడే లక్ష మంది రోడ్ల మీద పడతారు. ఫుడ్ కాంట్రాక్టర్లు 50 లక్షల ఈఎండీ కట్టాలట.. పది తరాలు కష్టపడ్డా చిరు వ్యాపారులకు అంత డబ్బు రాదు. మండలం ఒక యూనిట్‌గా ఓకే బడా కాంట్రాక్టర్‌కు కాంట్రాక్టు కట్టబెట్టే ప్రయత్నం జరుగుతోంది. ఎస్సీ, ఎస్టీ కాంట్రాక్టర్లకు కేసీఆర్ హయంలో రాయితీ ఉండేది అని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గుర్తు చేశారు.
మల్లికార్జున్ ఖర్గే ఎక్కడున్నారు, దళిత మంత్రులు ఎక్కడ ఉన్నారు. చేవెళ్ల డిక్లరేషన్‌లో 25 శాతం దళితులకు కాంట్రాక్టులు ఇస్తామని చెప్పారు. అది అమలు కాకపోగా వాళ్ళ నుంచి ఉన్నవి లాక్కుంటున్నారు. కోడి గుడ్లు సరఫరా చేసేందుకు రూ. 3 కోట్ల టర్నోవర్ ఉండాలట. కేసీఆర్ హాయంలో ఈ నిబంధనలు లేవు. జానారెడ్డి బంధువులో రేవంత్ బంధువులకో కాంట్రాక్టులు ఇచ్చేందుకు కుట్ర చేస్తున్నారు. టెండర్ ఆప్లికేషన్కు ఐదు వేల నుంచి రూ. 25 వేల వసూల్ చేస్తున్నారు. కోడి గుడ్డు రేటు గతంలో మార్కెట్ రేటు కన్నా 30 పైసలు ఎక్కువ ఉండేది. ఇప్పుడు కోడి గుడ్డు ధర ఏడు రూపాయలుగా నిర్ణయించారు. కాంట్రాక్టర్ల నుంచి బ్యూరోక్రాట్లు, కాంగ్రెస్ నేతలు కమిషన్లు వసూలు చేస్తున్నారు. ఘోరమైన నేరాలు సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో జరుగుతున్నాయని ఆర్ఎస్పీ పేర్కొన్నారు.
కేసీఆర్ పది సంవత్సరాల్లో పేద వాళ్ళ గురించి ఆలోచించారు. గురుకులాల్లో రేవంత్ పాలనలో ఇప్పటి వరకు 103 మంది విద్యార్థులు చనిపోయారు. ఈ విద్యార్థుల మరణాల గురించి పట్టించుకునే శ్రద్ధ సీఎం రేవంత్‌కు లేదు. కాంగ్రెస్ నేతలను మరింత ధనవంతులుగా మార్చేందుకు జీవో 17 తెచ్చారు. టెండర్లకు ఈ నెల 14 దాకా గడువు విధించారు. టెండర్ నిబంధనలు ఇంగ్లీష్‌లో రాసి ఆన్లైన్లో పెట్టారు. చిరు వ్యాపారులకు అవి అర్థం కావు. ఈ జీవో 17ను రద్దు చేయాల్సిందే. జీవో 17 రద్దుకు బీఆర్ఎస్ ఉద్యమిస్తోంది. జీవో 17 రద్దు కోసం కోర్టుకు కూడా వెళతాం. గురుకులాల్లో వ్యవస్థలను ధ్వంసం చేసే కుట్ర జరుగుతోంది. కలెక్టర్లు, అదనపు కలెక్టర్ల కమీషన్ల మా దగ్గర ఆధారాలు ఉన్నాయి. త్వరలోనే సీఎస్‌ను కలిసి మా దగ్గరున్న ఆధారాలు సమర్పిస్తాం అని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు.