హైదరాబాద్, ఫిబ్రవరి 20 (నమస్తే తెలంగాణ) : ఉద్యోగాలు పొందే స్థాయి నుంచి యువతులను ఉద్యోగాలిచ్చే స్థాయికి చేర్చడమే ‘క్యాంపస్ ప్రెన్యూర్’ లక్ష్యమని వీ-హబ్ సీఈవో సీత పల్లచోళ వెల్లడించారు. హైదరాబాద్ వీ-హబ్‌లో శుక్రవారం గ్రాస్‌రూట్ యూత్ ఇన్నోవేషన్ ప్రోగ్రామ్ (జీవైఐపీ)లో భాగంగా ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాల్లోని యువతులను ఆంథ్రప్రెన్యూర్లుగా తీర్చిదిద్దేందుకు ‘క్యాంపస్ ప్రెన్యూర్’ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సీత పల్లచోళ మాట్లాడుతూ.. యువతులకు సరైన నైపుణ్యాలు, మెంటర్షిప్, ఎకోసిస్టమ్ మద్దతు ఇచ్చి వారిలో ఆత్మవిశ్వాసాన్ని పెంచనున్నట్టు తెలిపారు.
వారి ఇన్నోవేషన్లను రియాల్టిలోకి తేవాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నట్టు వివరించారు. రాష్ట్రంలోని 9 జిల్లాలకు చెందిన 29 కాలేజీల నుంచి విద్యార్థినులు ఈ ప్రోగ్రామ్‌కు హాజరయ్యారు. రాష్ట్రంతోపాటు పుణె, నవీ ముంబై నుంచి విద్యార్థులు ఈ కార్యక్రమానికి వచ్చినట్టు అధికారులు తెలిపారు. ఈ ప్రోగ్రామ్‌లో 112 ఐడియాలు రిజిస్టర్ కాగా, 143 మంది విద్యార్థులతో కూడిన 57 హైపొటెన్షియల్ బృందాలు కొహర్ట్-1కు ఎంపికైనట్టు వెల్లడించారు.