ఆరుగాలం కష్టపడి పండించిన మొకజొన్న రైతులకు నేడు కన్నీళ్లే మిగులుతున్నాయి. పెట్టుబడి కోసం తెచ్చిన అప్పులు తీరాలంటే ప్రభుత్వం మద్దతు ధరతో కొనుగోలు చేయాల్సి ఉంటుంది. కానీ, ఖమ్మం జిల్లాలో పంట చేతికొచ్చే సమయం ఆసన్నమైనా ఇప్పటికీ కొనుగోలు కేంద్రాలు ప్రారంభం కాలేదు. దీంతో అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ముందస్తుగానే కేంద్రాలు ఏర్పాటు చేయాల్సి ఉంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో రైతులు పండించే పంటను కొనుగోలు చేసేందుకు యుద్ధ ప్రాతిపదికన కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి రైతులకు అందుబాటులో ఉంచేవారు. దూరప్రాంతాలకు వెళ్లి పంటలు అమ్ముకోవడం కాకుండా పంట పండించిన చోటే కొనుగోలు చేయడానికి అవకాశాన్ని కల్పించేవారు. కానీ, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం.. అలాంటి ముందస్తు చర్యలు తీసుకోవడం లేదు. దీంతో రైతులంతా దళారుల చేతిలో నష్టపోతున్నారు. -మధిర, మార్చి 31
గడిచిన వారం రోజులుగా ఖమ్మం జిల్లాలోని మక్క రైతులు తమ మొక్కజొన్న పైరును యంత్రాల ద్వారా కోతలు చేపడుతున్నారు. మరో పది రోజుల్లో జిల్లా వ్యాప్తంగా 80 శాతం పంట రైతుల చేతికి రానుంది. అయినప్పటికీ, ఇప్పటివరకు జిల్లా వ్యాప్తంగా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తారా? లేదా? అనే సమాచారం కూడా అటు అధికారులకుగానీ, ఇటు రైతులకుగానీ తెలియడం లేదు. దీంతో మక్క రైతులు తీవ్రంగా ఆందోళన చెందుతున్నారు. ముగ్గురు కీలక మంత్రులు ప్రాతినిథ్యం వహిస్తున్న ఖమ్మం జిల్లాలోనూ ఈ పరిస్థితి ఉండడం గమనార్హం. జిల్లా వ్యాప్తంగా యాసంగి మొకజొన్న 1.50 లక్షల ఎకరాల్లో సాగవుతోంది. ఒక్క మధిర నియోజకవర్గంలోనే 75 వేల ఎకరాల్లో ఈ పంటలను రైతులు సాగు చేస్తుండడం విశేషం.
సకాలంలో సర్కారు స్పందించక..
మక్కల కొనుగోలు కేంద్రాల ఏర్పాటుపై ప్రభుత్వం నుంచి స్పష్టత లేకపోవడంతో రైతులు గత్యంతరంలేక తమ పంటను తకువ ధరకే ప్రైవేటు వ్యాపారులకు అమ్ముకుంటున్నారు. దానికితోడు అకాల వర్షాల భయంతో రైతులు కల్లాల్లోనే పంటను తెగనమ్ముకోవాల్సిన దుస్థితి ఏర్పడింది. ప్రభుత్వం సకాలంలో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తే అక్కడ క్వింటాకు రూ.2,400 మద్దతు ధర లభించే అవకాశం ఉంది. కానీ, ఆ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయని కారణంగా ప్రైవేటు వ్యాపారుల రూ.1,500 రూ.1,800 మధ్య ప్రైవేటు విక్రయిస్తున్నారు. క్వింటాకు రూ.900 వరకూ నష్టపోతున్నారు.
ప్రభుత్వంపై మండిపాటు
ప్రభుత్వ గత జీవో ప్రకారం ఎకరాకు కేవలం 26 క్వింటాళ్ల మొక్కజొన్నలు మాత్రమే సేకరించాలనే నిబంధన ఉంది. అయితే, ఆధునిక సాగు వల్ల రైతులు ఎకరాకు 35 నుంచి 45 క్వింటాళ్ల వరకు దిగుబడి సాధిస్తున్నారు. పాత నిబంధన వల్ల మిగిలిన 15 నుంచి 20 క్వింటాళ్లను మళ్లీ ప్రైవేటులోనే విక్రయించాల్సి వస్తోంది. ఈ నిబంధన తెచ్చిన ప్రభుత్వంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 26 క్వింటాళ్ల నిబంధనను ఎత్తివేయాలని, రైతులు పండించిన పూర్తి పంటను కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. తడిసిన పంటను, రంగు మారిన పంటను కూడా ప్రభుత్వమే కొనాలని కోరుతున్నారు.

రూ.900 వరకూ నష్టపోతున్నాం.
నేను 8 ఎకరాల్లో మొకజొన్న సాగుచేశాను. పంట చేతికొచ్చింది. కానీ, ప్రభుత్వం ఇప్పటివరకు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయలేదు. గత కేసీఆర్ ప్రభుత్వంలో పది, పదిహేను రోజులు ముందుగానే కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసేవారు. ఈ ప్రభుత్వం ఆలస్యం చేస్తుండడం వల్ల మాలాంటి రైతులం ప్రైవేటులోనే అమ్ముకోవాల్సి వస్తోంది. ఫలితంగా క్వింటాకు సుమారు రూ.900 వరకూ నష్టపోతున్నాం.
-గుడిమల్ల సాంబయ్య, రైతు, బోనకల్లు
13 ఎకరాల్లో మొకజొన్న సాగుచేశా..
ఈ ఏడాది యాసంగిలో 13 ఎకరాల్లో మొకజొన్న సాగుచేశాను. ఎకరాకు సుమారు రూ.70 వేల పెట్టుబడి పెట్టాను. గతంలో మార్క్ఫెడ్ ద్వారా క్వింటా రూ.2.400 చొప్పున కొనుగోలు చేశారు. ఇప్పుడు ప్రభుత్వం ఇంకా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయకపోవడంతో ప్రైవేట్ వ్యాపారులు కింటాకు రూ.1,600 రూ.1,800 మధ్యనే ధర వెచ్చించి కొనుగోలు చేస్తున్నారు.
-పిల్లెం వెంకటేశ్వర్లు, కౌలు రైతు, చిరునోముల
కొనుగోలుకు పరిమితి ఎత్తివేయాలి..
రైతుల నుంచి ఎకరాకు 26 క్వింటాళ్ల మక్కలు మాత్రమే కొనుగోలు చేస్తామన్న నిబంధనను ప్రభుత్వం వెంటనే ఎత్తివేయాలి. ఒక్కో రైతు ఎకరానికి 35 నుంచి 45 క్వింటాళ్ల వరకు దిగుబడి సాధిస్తున్నప్పుడు.. ప్రభుత్వం 26 కింటాళ్లు మాత్రమే కొనుగోలు చేస్తే మిగతా పంటను ఎకడ అమ్ముకోవాలి? రైతులు ప్రైవేటు వ్యాపారులను ఆశ్రయించేలా విధంగా ప్రభుత్వమే వ్యవహరిస్తోంది. గత జీవోను రద్దు చేయాలి.
-కొనకంచి నాగరాజు, రైతు, మధిర
రైతులను నాటి ప్రభుత్వం ఆదుకుంది..
అకాల వర్షంతో నష్టపోయిన రైతులను కూడా నాటి కేసీఆర్ ప్రభుత్వం ఆదుకుంది. ఎలాంటి కొర్రీలూ లేకుండా రైతులు పండించిన పంట మొత్తాన్ని కొనుగోలు కేంద్రాల ద్వారా కొనుగోలు చేసింది. పైగా మద్దతు ధర కూడా కల్పించింది. అకాల వర్షం వల్ల నష్టపోయిన రైతులకు అండగా నిలిచింది. ఎకరాకు రూ.పది వేల చొప్పున పరిహారం కూడా అందించింది. కానీ, ఇటీవల కురిసిన వర్షాలకు నష్టపోయిన రైతులకు ఈ ప్రభుత్వం ఇంకా పరిహారం చెల్లించలేదు.
-దూబ శ్రీనివాసరావు, రైతు, ముష్టికుంట్ల