బోధన్, మార్చి 31: అకాల వర్షం అన్నదాతలను దెబ్బ కొట్టింది. గాలీవాన బీభత్సం రైతుల ఆశలపై నీళ్లు గుమ్మరించింది. అన్నదాతలపై ప్రకృతి పగ బట్టిందా అన్నట్టుగా సోమవారం రాత్రి నుంచి మంగళవారం తెల్లవారుజాము వరకు పెనుగాలులతో కూడిన వర్షం బీభత్సం సృష్టించింది. జిల్లాలోని పలు ప్రాంతాల్లో పెనుగాలులతో కూడిన వర్షం రైతాంగానికి తీరని నష్టం మిగిల్చింది.
మొత్తంగా 2,559 ఎకరాల్లో పంటలు దెబ్బ తిన్నట్లు వ్యవసాయ శాఖ ప్రాథమికంగా అంచనా వేసింది. అందులో అత్యధికంగా వరి పంటలకే నష్టం వాటిల్లింది. 2,209 ఎకరాల్లో వరిపైరు దెబ్బ తిన్నట్లు గుర్తించారు. ఇక, కోసి ఆరబెట్టిన ధాన్యం సైతం తడిసి పోయింది. గాలీవాన ఉధృతికి పలుచోట్ల కల్లాల్లో ఆరబెట్టిన ధాన్యం కొట్టుకుపోయింది. మరోవైపు, మక్క, నువ్వుతో పాటు మామిడి రైతులకూ తీవ్ర నష్టం వాటిల్లింది.

చేతికొచ్చిన వరి నేలపాలు..
నిజామాబాద్ జిల్లాలోని 14 మండలాల్లో అకాల వర్షం తీవ్ర ప్రభావం చూపింది. బలమైన ఈదురుగాలుల కారణంగా ప్రధా నంగా వరికి అత్యధికంగా నష్టం వాటిల్లింది. రేపో, మాపో కోతకు సిద్ధంగా ఉన్న పైర్లు నేలకొరిగాయి. ధాన్యం గింజలు రాలిపోవడంతో రైతులు లబోదిబోమంటున్నారు. నేల కొరిగిన వరి పొలాల్లో కోత కోయడం కూడా రైతులకు ఇబ్బందికరంగా మారింది. నీరు, బురదలో ఒరిగిన ధాన్యం మొలకెత్తుతాయేమో.. గింజ రంగు మారుతుందేమోనని రైతులు ఆందోళన చెందుతున్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలు తెరవక పోవడంతో ఇప్పటికే కోతలు పూర్తిచేసిన రైతులు అమ్ముకోలేకపోయారు. కల్లాల్లో, రోడ్లపై కుప్పలుగా ఉంచిన వరి ధాన్యం కూడా తడిసి పోయాయి.
కామారెడ్డి జిల్లాలో..
కామారెడ్డి జిల్లాలోని బీర్కూర్ మండలంలోని పలు గ్రామాల్లో వరి పంట దెబ్బతినగా, నిజాంసాగర్ మండలం మల్లూర్ గ్రామంలో జొన్న పంట నేలవాలింది.

అంచనాల కన్నా ఎక్కువే..!
14 మండలాల్లో పెనుగాలులతో కూడిన వర్షం కారణంగా 2,209 మంది రైతులకు చెందిన 2,559 ఎకరాల్లో పంట నష్టం జరిగినట్లు వ్యవసాయశాఖ అంచనా వేసింది. ఏడు మండలాల్లో 2,054 మంది రైతులకు చెందిన 2,295 ఎకరాల్లో వరి పంట దెబ్బతింది. నవీపేట్ మండలంలో 29 గ్రామాలకు చెందిన 918 ఎకరాల్లో, భీమ్గల్ మండలంలో 523 ఎకరాల్లో, నందిపేట్ మండలంలో 245 ఎకరాల్లో, రెంజల్ మండంలో 220 ఎకరాల్లో, ఎడపల్లి మండలంలో 185 ఎకరాల్లో, నిజామాబాద్ రూరల్ మండలంలో 172 ఎకరాల్లో తీవ్రమైన నష్టం జరిగింది. డిచ్పల్లి మండలంలో కూడా 32 ఎకరాల్లో వరి పంట దెబ్బతింది. మక్కజొన్న పంటకు నవీపేట్ మండలంలో 30 ఎకరాల్లో, ఆలూరు మండలంలో 40 ఎకరాల్లో నష్టం జరిగింది. పూతదశలో ఉన్న నువ్వుల పంట ఏర్గట్ల మండలంలో 55 ఎకరాల్లో, వేల్పూరు మండలంలో 18 ఎకరాల్లో దెబ్బతింది. అయితే, వ్యవసాయ శాఖ వేసిన అంచనాల కంటే నష్టం ఎక్కువగా జరిగిందని రైతులు చెబుతున్నారు. పంట నష్టంపై పూర్తిస్థాయిలో సర్వే జరిపించాలని, ప్రభుత్వం పంట నష్ట పరిహారాన్ని అందించాలని కోరుతున్నారు.
మామిడి తోటలకు సైతం
పెనుగాలులకు పిందె, కాయ దశలో ఉన్న మామిడి తోటలకు సైతం నష్టం జరిగింది. మామిడి పిందెలు, కాయలు రాలిపోవటంతో రైతులు ఆందోళనకు గురవుతున్నారు. ప్రాథమిక అంచనాల ప్రకారం.. నవీపేట్ మండలంలోని 35 ఎకరాల్లో, వేల్పూరు మండలంలో 50 ఎకరాల్లో, జక్రాన్పల్లి మండలంలో 20 ఎకరాల్లో, కమ్మర్పల్లి మండలంలో 12 ఎకరాల్లో మామిడి తోటలకు తీవ్ర నష్టం జరిగింది.
