– ప్రారంభించిన డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
– రాష్ట్ర వ్యాప్తంగా పామాయిల్ మొక్కలు కొనిజర్ల నుండే సరఫరా
వైరా టౌన్, జూలై 20 : ఖమ్మం అంటేనే వ్యవసాయమని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు. సోమవారం కొనిజర్ల మండల పరిధిలోని అంజనాపురం గ్రామం వద్ద గోద్రెజ్ ఆగ్రోవెట్ ఆధ్వర్యంలో దేశంలోనే మొట్టమొదటి ఇంటిగ్రేటెడ్ ఆయిల్ ఫామ్ కాంప్లెక్స్ ను రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరావు తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో వారు మాట్లాడుతూ.. ఉమ్మడి జిల్లాలో అనేక పరిశ్రమలు ఉండేవని ప్రస్తుతం జిల్లాలు విడిపోయిన తర్వాత ఖమ్మం జిల్లా వ్యవసాయ రంగానికి పరిమితమైందన్నారు. ప్రధానంగా ఖమ్మంలో పాలేరు వైరా సీతారామ ప్రాజెక్టు ద్వారా వ్యవసాయానికి సాగునీరు అందుతున్నాయని వీటి ద్వారానే వ్యవసాయమే ప్రధాన వనరుగా జిల్లాలో ఉందన్నారు. ఆయిల్ పామ్ పంట సాగు ద్వారా రైతు ఆర్థికంగా ఎదగాలని, రాష్ట్ర ప్రభుత్వం ఎకరాకు రూ.46 వేలు సబ్సిడీ ఇస్తుందన్నారు. గతంలో టన్ను రూ.12,000 ఉన్న పామాయిల్ ప్రస్తుతం రూ.23 వేలకు చేరడం గొప్ప విషయం అన్నారు. ఎల్ నినో వంటి విపత్తును కూడా తట్టుకునేలా పామాయిల్ పంట ఉంటుందన్నారు. మన జిల్లాలో వైరా పాలేరు సీతారామ కెనాల్ ద్వారా 25 లక్షల ఎకరాల్లో ఈ పంట సాగు చేసేందుకు అనువుగా ఉందన్నారు. రైతులు ఉద్యానవన పంటలు పై దృష్టి సారించాలన్నారు.
వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ.. ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీని కొనిజర్ల మండలం అంజనాపురం గ్రామంలో నిర్మించడం ద్వారా ఈ ప్రాంత రైతులకు జిల్లా రైతులకు ఎంతో సహాయకారిగా ఉంటుందన్నారు. ఆంధ్ర రాష్ట్రంలో ఐదు ఆరు లక్షల ఎకరాల్లో ఆయిల్ ఫామ్ సాగు చేస్తుండగా తెలంగాణలో మాత్రం మూడు లక్షల ఎకరాల్లో మాత్రమే సాగు చేస్తున్నారని దీనిపై రైతులు దృష్టి సారించి అన్ని పంటల కంటే లాభదాయమైన పండుగ గుర్తించి పంటకు సాగు చేయాలని సూచించారు. ప్రస్తుతం ఇక్కడ నిర్మించిన ఈ ఆయిల్ ఫామ్ కాంప్లెక్స్ లో నర్సరీ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ విత్తన ప్రయోగం మేలు రక విత్తనాల తయారీ వంటి ఏర్పాట్లు ఉన్నాయన్నారు. తెలంగాణ రాష్ట్రం ఆయిల్ ఫామ్ కు అనుకూలంగా ఉంది కావున రాష్ట్రవ్యాప్తంగా ఈ పంటను సాగు చేస్తే జిల్లాకు ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీని ఏర్పాటుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఆయిల్ ఫామ్ పంట ఒక్కసారి వేస్తే 30 సంవత్సరాల వరకు పంట దిగుబడిని ఇస్తుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గోద్రెజ్ చైర్ పర్సన్ నదిర్ బి.గోద్రెజ్, గోద్రెజ్ సంస్థ ఎండీ సీఈఓ సునీల్ కటారియా, వైరా ఎమ్మెల్యే మాలోత్ రామదాసు నాయక్, వ్యవసాయ కార్యదర్శి సురేంద్రమోహన్, జిల్లా కలెక్టర్ టీఎస్ దివాకర, సిపి సునీల్ దత్, సుడా చైర్మన్ పువ్వాళ్ల దుర్గాప్రసాద్, గిడ్డంగుల చైర్మన్ రాయల నాగేశ్వరావు, వైరా మార్కెట్ కమిటీ చైర్మన్ బోళ్ల గంగారావు, సర్పంచులు కమల, సునీత, గ్రంథాలయ చైర్మన్ ఖాదర్ బాబు పాల్గొన్నారు.