బంజారాహిల్స్, మార్చి 31: 70ఏళ్ల వయస్సులోనూ ఎవరిమీద ఆధారపడొద్దనే మనస్తత్వంతో వంట పనులు చేస్తూ ఆత్మగౌరవంతో జీవిస్తున్న వృద్ధురాలిని రూ.26,500 కోసం పొట్టన పెట్టుకున్నాడు ఆ కిరాతకుడు. ఫిలింనగర్లో నివాసం ఉంటున్న వృద్ధురాలికి లిఫ్ట్ ఇస్తానని నమ్మించి కిరాతంగా హత్య చేసిన ఘటనలో నిందితుడిని ఫిలింనగర్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ఆన్లైన్లో జూదానికి బానిసగా మారిన కిరాతకుడు ఇద్దరు వృద్ధురాళ్లను హత్యచేసిన సంగతి తెలిసిందే. ఫిలింనగర్, జూబ్లీహిల్స్ పోలీస్స్టేషన్ల పరిధిలో రెండు హత్య కేసులు నమోదు కాగా ఫిలింనగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో తొలి హత్య జరిగివనందున నిందితుడిని మంగళవారం అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.
లిఫ్ట్ ఇస్తానని నమ్మించి..
కృష్జా జిల్లా చినగొల్లపాలెం గ్రామానికి చెందిన కునసాయి వాసు(29)కి రెండేళ్ల క్రితం పెళ్లయింది. అంతకుముందు ఏపీలో చేపల చెరువులో సూపర్వైజర్గా పనిచేస్తుండేవాడు. భార్యతో కలిసి 2022లో నగరానికి వచ్చిన వాసు కొన్నాళ్లపాటు కూకట్పల్లి ప్రాంతంలో నివాసం ఉంటూ డ్రైవర్‌గా పనిచేశాడు. ఓ స్నేహితుడి సాయంతో ఏడాది క్రితం జూబ్లీహిల్స్‌లో నివాసం ఉంటున్న డా. శ్రీనాథ్ అనే వైద్యుడి నివాసంలో డ్రైవర్‌గా చేరాడు. రూ.25వేల జీతంతోపాటు అక్కడే ఉండేందుకు గదిని కూడా ఇచ్చారు. అతడి స్నేహితుడికి చెందిన ఎర్టిగో కారును అద్దెకు తీసుకుని ఖాళీ సమయాల్లో ఓలా, ఊబర్ టాక్సీగా నడిపిస్తుంటాడు. కాగా అతడి భార్య ప్రైవేటు సంస్థలో ఉద్యోగం చేస్తుంటుంది. కాగా వాసు రెండేళ్లుగా ఆన్లైన్లో పేకాట వ్యసనానికి బానిసగా మారి భారీగా డబ్బులు పోగొట్టుకున్నాడు.
పలువురి వద్ద అప్పులు చేయడంతోపాటు భార్య మెడలోని మంగళసూత్రాన్ని సైతం తాకట్టు పెట్టాడు. ఇటీవల భార్య డెలివరీకోసం పుట్టింటికి వెళ్లగా వాసు ఒంటరిగా ఉంటున్నాడు. ఈ నెల 11న సాయంత్రం ఏడున్నర ప్రాంతంలో ఫిలింనగర్‌కు వెళ్లిన వాసుకు బోయినపల్లి యాదమ్మ(70) అనే వృద్ధురాలు తారసపడింది. గతంలో తన యజమాని ఇంటికి వంటపని కోసం వచ్చిన యాదమ్మ ఒంటరిగా ఉంటుందనే విషయం వాసుకు తెలుసు. తనకు ఫిలింనగర్లో గది అద్దెకు చూడాలని చెప్పిన వాసు అక్కడినుంచి బయలుదేరే సమయంలో తాను కృష్ణానగర్ వెళ్తున్నానని యాదమ్మ చెప్పింది. దాంతో తాను కృష్ణానగర్‌లో డ్రాప్ చేస్తానని ఆమెను నమ్మించి తన యాక్టివా బైక్ మీద ఎక్కించుకున్నాడు. జూబ్లీహిల్స్ రోడ్ నెం.44లోని పెద్దమ్మగుడి సమీపంలోని రాగానే వాసు యజమాని ఫోన్ చేసి అర్జెంట్‌గా ఇంటికి రావాలని చెప్పాడు. దీంతో యాక్టివా మీద వచ్చిన యాదమ్మను అక్కడే దింపిన వాసు 20నిమిషాల్లో వచ్చి, కృష్ణానగర్‌లో దింపుతానని చెప్పి వెళ్లాడు.
యాదమ్మ చెవులకు కమ్మలు, మెడలో బంగారు గొలుసు, చేతులకు గాజు ఉండడంతో ఆమెను చంపేసి వాటిని కాజేయాలని నిర్ణయించుకున్న వాసు తన యజమాని ఇంటికి సమీపంలో పార్క్ చేసిన స్నేహితుడికి చెందిన ఎర్టిగో కారుతో వచ్చి యాదమ్మను ఎక్కించుకున్నాడు. కృష్ణానగర్ వెళ్లే మెయిన్రోడ్లో ట్రాఫిక్ ఎక్కువగా ఉందని, షార్ట్‌కట్‌లో తీసుకువెళ్తున్నానని ఆమెను మాటల్లో పెట్టి రోడ్ నెంబర్ 45, దుర్గం చెరువుమీదుగా ఓఆర్ఆర్ పక్కన సర్వీస్ రోడ్లో గ్రేహౌండ్స్ కార్యాలయం పక్కన నిర్మానుష్య ప్రాంతంలో కారును ఆపి డిక్కీలో ఉన్న తాడుతో యాదమ్మ మెడకు బిగించి దారుణంగా హత్య చేశాడు. ఒంటి మీద నగలను తస్కరించి మృతదేహాన్ని రోడ్డుపక్కన పారేసి వెళ్లిపోయాడు. మరుసటిరోజు బంగారు వస్తువులను కూకట్‌పల్లిలో తనఖా పెట్టి రూ.26500 తీసుకున్నాడు. వచ్చిన డబ్బులతో మరుసటిరోజు ఆన్లైన్ పేకాట అడాడు.
ర్యాపిడో బుక్ చేయమని అడిగిన మహిళను..
యాదమ్మను హత్యచేసిన తర్వాత వచ్చిన డబ్బులతో ఆన్లైన్లో గేమ్స్ ఆడిన వాసు మూడురోజులైనా తనమీద ఎవరికీ అనుమానం రాకపోవడంతో తనను ఎవరూ పట్టుకోరనే ధీమాకు వచ్చాడు. ఈ క్రమంలో ఈనెల 14న మధ్యాహ్నం తాను పనిచేస్తున్న ఇంటికి ఎదురుగా ఫార్మా సంస్థ యజమాని ఇంట్లో దోబీగా పనిచేస్తున్న సీహెచ్.మంగమ్మ ఇంటికి వెళ్లేందుకు బయటకు వచ్చింది. రోజూ అక్కడున్న వారితో ర్యాపిడో బుకింగ్ చేయించుకుని ఇంటికి వెళ్తే మంగమ్మ ఫోన్ ఇంట్లో మర్చిపోవడంతో ఎదురింట్లో డ్రైవర్ వాసు వద్దకు వెళ్లింది.
ర్యాపిడో బుక్ చేయాలని చెప్పగా అప్పటికే ఆమె చెవి కమ్మలను కాజేయాలనే ప్లాన్‌తో ఉన్న వాసు కారులో డ్రాప్ చేస్తానని నమ్మబలికాడు. యజమాని ఇంటి గేట్లోకి వచ్చిన తర్వాత కారులో కూర్చొబెట్టి వెనుక సీట్లో ఎక్కి తాడుతో గొంతు బిగించి చంపేశాడు. ఆమె చనిపోయిన తర్వాత చెవి కమ్మలను తస్కరించిన వాసు కారులో ఆమె మృతదేహాన్ని ముందు సీట్లో కూర్చోపెట్టి సీటును వెనక్కి వంచాడు. కారుకు నల్ల అద్దాలు ఉండడంతో బయటి వ్యక్తులకు కనిపించే అవకాశం లేదని నిర్దారించుకున్న తర్వాత సుమారు 20 కిలోమీటర్ల దూరం ప్రయాణించి నిర్మానుష్యమైన ప్రాంతంలో ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్లో మృతదేహాన్ని పాడేసి వచ్చాడు.
యాక్టివా బైక్ ఆధారంగా నిందితుడి అరెస్ట్
ఫిలింనగర్లో యాదమ్మ అదృశ్యంపై ఈనెల 20న ఆమె కుమారుడు బోయినపల్లి రామకృష్ణ ఇచ్చిన ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఫిలింనగర్తోపాటు సమీప ప్రాంతాల్లో సీసీ ఫుటేజీని పరిశీలించగా ఈనెల 11న సాయంత్రం 8గంటల ప్రాంతంలో ఇంటివద్ద నుంచి యాక్టివా బైక్ మీద ఎక్కిందని తేలింది. ఆ బైక్‌ను ట్రేస్ చేయగా జూబ్లీహిల్స్ రోడ్ నెం 44లో సీఎం రేవంత్‌రెడ్డి నివాసానికి సమీపం దాకా వచ్చినట్లు తేలింది. అక్కడినుంచి కారులో ఎక్కి వెళ్లినట్లు గుర్తించిన ఫిలింనగర్ పోలీసులు నిందితుడిని గుర్తించారు. కాగా అప్పటికే నార్సింగి, మోకిలా పోలీస్స్టేషన్ల పరిధిలో గుర్తుతెలియిని మృతదేహాలు లభ్యమైనట్లు తేలడంతో వాటిని పరిశీలింగా మొత్తం వ్యవహారం బయటపడింది.
ఈ మేరకు నిందితుడు వాసును అదుపులోకి తీసుకున్న ఫిలింనగర్, జూబ్లీహిల్స్ పోలీసులు విచారించగా రెండు హత్యలు తానే చేసినట్లు అంగీకరించాడు. దీతో నిందితుడిని మంగళవారం రిమాండ్‌కు తరలించారు. పోలీసుల విచారణలో వాసు మీద ఏపీలో ఓ చైన్ స్నాచింగ్ కేసు ఉన్నట్లు ప్రాథమికంగా తేలింది. కాగా గతంలో ఓలా, ఉబెర్ క్యాబ్స్ డ్రైవర్‌గా పనిచేసినట్లు తేలడంతో ఇలాంటి నేరాలు ఇంకా ఏమైనా చేశాడా? అనే కోణంలో విచారణ చేయాల్సి ఉందని పోలీసులు భావిస్తున్నారు.